ఈ రోజు మే డే. సుందరయ్య గారి జయంతి కూడా

(ఆలూరు రాఘవశర్మ)
ఈ రోజు మే డే. సుందరయ్య గారి జయంతి (మే 1, 1913-మే 19,1985) కూడా ఈరోజే. కాకతాళీయంగా రెండు కలిసి వచ్చాయి. నలభై మూడేళ్ల క్రితం , ఎమర్జెన్సీ ఎత్తివేశాక తొలిసారిగా వారిని చూసాను.
కమ్యూనిస్టు భావ జాలం నన్ను చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రోజులు అవి. బాపట్లలో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తుండగా (1975) ఎమర్జెన్సీ విధించారు. కమ్యూనిస్టు లంతా అరెస్టు అయ్యారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. మా కుటుంబం నెల్లూరులో ఉండేది. ఎవరిని కదిలించినా సుందరయ్య గారి గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు. ఆయన నిరాడంబరత, నిజాయితీ, సిద్ధాంత నిబద్దత వింటూ, దినపత్రికలు చదువుతూ, ఎమర్జెన్సీ కాలమంతా గడిపే శాను. ఆ కాలంలో నే రాజకీయాలు ఒంటబట్టాయి. ఎక్కువ సమయం కోవూరు లైబ్రరీలో గడిపేవాడిని.
ఎమర్జెన్సీ 1977 లో ఎత్తేశారు. నెల్లూరు సహకార బ్యాంకు ఆవరణలో ఆ సాయంత్రం సుందరయ్య గారి సభ . తొలి సారిగా సుందరయ్య గారిని చూడడం అదే. సుందరయ్య గారి గురించి కతలు కతలుగా విన్నవన్నీ ఆయనను చూసాక, ఆయన ఉపన్యాసం విన్నాక అవన్నీ నిజాలేనని అర్థం చేసుకున్నా. ట్రుంకు రోడ్లో ఉండే సహకార బ్యాంకు ఆవరణ అంతా జనంతో నిండి పోయింది. సుందరయ్య గారి ఉపన్యాసం సాయంత్రం 6 గంటలకు మొదలైతే రాత్రి 9 గంటల వరకు సాగింది. మూడు గంటలపాటు సభ నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేవలేదు. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలను ఒక్క టొక్కటిగా వివరించారు. సుందరయ్య గారి ఉపన్యాసంలో నాకు ఇప్పటికీ గుర్తున్న మాట ఇదే. ‘ ఎమర్జెన్సీ లో పంజాబ్ ముఖ్య మంత్రి గా ఉన్న జైల్ సింగ్ ఆ రాష్ట్రాన్నే జైలుగా మార్చేశాడు ‘ అని సుందరయ్య గారు అనే సరికి సభ అంతా చప్పట్లతో మారుమోగింది.
బహుశా ఆ అర్హత తోనే అనుకుంటా జైల్ సింగ్ ఆ తరువాత రాష్ట్రపతి కూడా అయ్యారు.
వ్యక్తి గతంగా సుందరయ్య గారంటే అభిమానం ఇప్పటికీ అలాగే ఉంది. సుందరయ్య గారు మరణించి నప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే , గొంతు పెగల్లేదు. ఆ మర్నాడు ఉదయంలో సుందరయ్య గారి పైన పాకెట్ కార్టూన్ వేశారు.
ఆకాశంలో ఉన్న మబ్బుల్లో సుందరయ్య గారు. దీనికి దేవీప్రియ గారు రన్నింగ్ కామెంటరీ రాశారు ఇలా.
‘ ఎపుడైనా సోష లిజం
ఈ దేశపు బిడ్డల తల నిమిరి నపుడు
వెండి మబ్బు రథం ఎక్కి
ఒక్క సారి వచ్చి చూడు ‘
(రాఘవశర్మ సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)