అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ( కోవిడ్ 19 ) దృష్టిలో ఉంచుకొని ఎవరైతే చట్ట వ్యతిరేకంగా (undocumented) కువైట్ లో ఉంటున్నారో, వారిపై ఎలాంటి జరిమానాలు విధించకుండా, మళ్లి కొత్త వీసా తో కువైట్ రావచ్చు అనే వెసులుబాటుతో కువైట్ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించింది. ఈ అవకాశాన్ని రాష్ట్రానికి చెందిన ప్రవాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి, డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
కువైట్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ అధికారులు 16 – 04 – 2020 నుండి 20 – 04 – 2020 వరకు భారత ప్రవాసుల కొరకు, రెసిడెన్సీ(ఆకామా) లేకుండా ఒరిజినల్ మరియు వాలిడిటీ పాస్ పోర్ట్ ఉన్న వారిని, మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఇమ్మిగ్రేషన్ పనులు పూర్తయిన తర్వాత వారిని కువైట్ ప్రభుత్వం భారతదేశం పంపేవరకూ తమ ఆధీనంలోనే పెట్టుకొని, అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు.
ఏపీఎన్ఆర్టీఎస్ ఆమ్నెస్టీ విషయమును రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు.
తాత్కాలిక పాస్పోర్ట్ కొరకు భారత ఎంబసీ వారు 5 దినార్ల రుసుం చెల్లించమన్నారని తెలిసి, 5 దినార్లు రుసుం లేకుండానే తాత్కాలిక పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీఎన్ఆర్టీఎస్ ఏప్రిల్ 6 న భారత ఎంబసీ మరియు కేంద్ర విదేశాంగ శాఖకు ఈమెయిల్ పంపడం జరిగింది.
దీనికి అనుకూలంగా స్పందించిన అధికారులు 5 దినార్లు రుసుం లేకుండానే తాత్కాలిక పాస్పోర్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలి అనే విషయముపై ఏపీఎన్ఆర్టీఎస్ అనునిత్యం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతోందని, ఎలాంటి కష్టం లేకుండా క్షేమంగా వారిని వారి వారి స్వస్ధలాలకు చేర్చేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేస్తోందని, ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరిని క్వారంటైన్ కు పంపించి, కోవిడ్ 19 నిర్దారణ పరీక్షలు చేసి, ఆ తర్వాత ఇళ్ళకు పంపడము జరుగుతుందని వెంకట్ మేడపాటి తెలిపారు.
పాస్పోర్ట్ లేని వారు ఎవరైతే తాత్కాలిక పాస్పోర్ట్ కొరకు అప్లికేషన్ ఇచ్చారో వారు భారతరాయబార కార్యాలయ అధికారులు ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలని అభ్యర్ధించారు. ఆమ్నెస్టీ పై రాష్ట్రానికి వస్తున్న ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నెం +91 8500627678 కు వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలు పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆమ్నెస్టీ పై పకడ్బందీగా పనిచేస్తున్నభారత రాయబార కార్యాలయ అధికారులకు, సిబ్బందికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి బాసటగా నిలబడి, కష్టమైన తాత్కాలిక పాస్పోర్ట్ (ఔట్ పాస్) కొరకు ప్రవాసాంధ్రులకు సహకారం అందిస్తున్న కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్స్ కు, వివిధ సామాజిక సంస్ధ సభ్యులకు, ముఖ్యంగా ఎంబసీ తరపున సలహాలు, సూచనలు అందిస్తున్న సోము గారికి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీఎన్ఆర్టీఎస్ తరపున వెంకట్ మేడపాటి, ఇలియాస్ బి.హెచ్ కృతజ్ఞతలు తెలిపారు.