సినిమాల్లో ‘హీరో‘కు అంత ఇమేజ్ ఎలా వచ్చింది?

(త్రిభువన్)
ఇప్పుడు కోవిడ్-19 సమయంలో డాక్టర్లు, నర్సులు, అరోగ్య కార్యకర్తలు, పారిశుద్దశాఖ ఉద్యోగులు , పోలీసులు, తదితరులను ‘హీరో’లంటున్నారు.
ఇలాంటి సందర్భాల్లో సినిమాల్లో హీరోయిజం చూపించే కథానాయకులు బయటికి వచ్చి వారి హీరోయిజం చూపించడంలేదని కొంతమంది తప్పుబడుతున్నారు. ఇప్పుడేకాదు ఎప్పుడు విపత్తు సంభవించి పరిష్కారం ఆలస్యమైనా సినీహీరోల ప్రసక్తి తెస్తూంటారు.
అలా అనడం తప్పు, ఎందుకంటే వాళ్లు వెండితెరమీద హీరో ఇమేజ్ ని (ఊహా చిత్రాన్ని) పోషిస్తున్ననటులు మాత్రమే. కానీ తమ వెండితెర హీరో నిజజీవితంలోకూడా హీరోయేనని చాలామంది అభిమానులు నమ్మేంత స్థాయిలో మనకు హీరో ఇమేజ్ ఉంది.
నిజజీవితంలో హీరోలు సామాన్యులుగా ఉంటారు. వాళ్లుచేసే మంచిపనులవల్ల వాళ్లు హీరోలౌతారు. వీరిలో పురుషులేకాదు స్త్రీలు, పిల్లలుకూడా ఉంటారు. అంటే నిజజీవితంలో ‘హీరో’ వేరు, తెరమీది ‘హీరో ఇమేజ్’ వేరు. ఆధునికభావాల ప్రకారమైతే ఇప్పుడు తెరమీద చూపిస్తున్న ఈ హీరో ఇమేజ్ మంచిదికాదంటున్నారు. ఆసంగతి తరువాత చూద్దాం.
మరి ఈ తెరమీది ‘హీరో ఇమేజ్’ ఎక్కడినుంచి వచ్చింది? దీనికి మూలం చరిత్రలోని ‘వీరుడు’ అనే భావన. అసలు ఈ భావన ఎలావచ్చింది, ఇప్పటి ఈరూపమెలా ఏర్పడింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
చాలా శతాబ్ధాలకిందట చరిత్ర పూర్వయుగంలో ప్రపంచవ్యాప్తంగా మనిషి ఇంకా సంచార సమూహాలుగా ఉన్నప్పుడు, ‘మాతృస్వామ్య’ వ్యవస్థ ఉండేదన్నది అందరికీ తెలిసినవిషయమే. అంటే ఇంటికి, సమూహానికేకాక, యుద్ధసమయంలోనూ ఆడవాళ్లే నాయకులు. మగవాళ్లు పూర్తిగా వాళ్లకనుసన్నల్లో వుండేవాళ్లు.
ఆకాలంలో యుద్ధాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు కొందరు స్త్రీలు, పురుషులు వీరోచితంగా ఎదుర్కొని తమవారిని రక్షించుకుని వీరులు లేదా హీరోలయ్యేవారు. స్త్రీల నాయకత్వంవల్ల మొదట్లో ఈవీరుల్లో స్త్రీలు అధిక సంఖ్యలో వుండేవాళ్లు.
తరువాతి కాలంలో సంచారజీవితంనుంచి వ్యవసాయాధారిత స్థిరజీవనం ఏర్పడ్డాక క్రమంగా స్త్రీలస్థానంలో పురుషులు నాయకత్వం తీసుకున్నారు. అప్పటినుంచి ‘పితృస్వామ్య’ వ్యవస్థ వచ్చింది.
పురుషులకు నాయకత్వమొచ్చాక వీరుల్లో పురుషుల సంఖ్య పెరిగి వారు హీరోలుగా కీర్తింపబడ్డారు. ఈ వీరులకు అప్పటి సమాజంలో సహజంగానే మంచి గౌరవ ప్రతిష్టలుండేవి, వారు కోరినవి సులభంగా లభించేవి.
దీన్ని గ్రహించిన చెడ్డవాళ్లైన కొందరు పురుషులుకూడా కాలక్రమంలో తమ భుజబలాన్ని ఉపయోగించి వీరులుగా చలామణి అవడం ప్రారంభించారు.
అంతటితో ఆగకుండా పురుషులు స్త్రీలకంటే గొప్పవారనే నమ్మకాన్ని కలిగించి పురుషాధిక్యతను తేవడానికి వీళ్లు ఈ వీరుడు అనే భావనకు తమ స్త్రీలోలత్వాన్ని కలిపి ‘మగోడు (మగాడు)’ అన్న అదనపు పదాన్నికూడా వాడుకలోకి తీసుకొచ్చారు. హీరో అనే పదానికి అసలు అర్థం పలుచబడ్డమేకాక ఆ స్టేటస్ పురుషుడికే పరిమితమైంది. మరి అర్థం మారిన సందర్భంలో హీరో లేక మగాడు అంటే ఎలాంటి పురుషుడు?
అతడి మొదటి అర్హత శారీరక బలం, ఇదివరకులాగ సాహసంతోకూడిన మంచితనం కాదు. ఐతే శారీరకబలమొక్కటే సరిపోదు, అతడు దాన్నుపయోగించి తమ సమూహంలోని ఇతర స్త్రీ, పురుషులను హింసద్వారా అణగదొక్కి నాయకుడవ్వాలి. అప్పుడు అతనికి హీరో లేక మగాడి స్థాయి వస్తుంది.
ఆతరువాత అతడు చుట్టుపక్కలున్న ఇతరసమూహాల నాయకుల్ని, ప్రజల్ని కూడా హింసాయుతంగా అణగదొక్కి వాళ్ల ధన, మాన, ప్రాణాల్ని ఆక్రమించుకున్నప్పుడు అతడు రాజుగా కీర్తింపబడతాడు. రాజులందరూ చెడ్డవాళ్లు కాకపోవచ్చుగాని బలవంతుడైన చెడ్దవాడికి రాజయ్యే అవకాశాలెక్కువ.
ఐతే దీనికి మినహాయింపులుండవా అంటే ఉంటాయి. హీరోల్లోకూడా మంచివాళ్లుంటారు. ఐతే నాయకుడు ఎలాంటివాడైనా అతనికి భయపడి అందరూ అతన్నిగురించి మంచిగా చెప్తారుకాబట్టి నిజమైన మంచిహీరోలను కనుక్కోవడం కష్టం.
ఒక నాయకుడికి భుజబలం, పోరులో గెలవడమేకాక ఎంతమంది రాణులుంటే అతను అంత గొప్ప వీరుడు లేక మగాడు. హీరో భావన పూర్తిగా ‘మగాడు’ భావనకి మారింది.
ఇప్పుడు మనం మాస్ సినిమాల్లో తెరమీద చూస్తున్న హీరో భావనకి ఇదే మూలం. ఐతే మన సినిమావాళ్లు ఈమూలంలోని చెడును పెద్దగా తగ్గించకుండా, దీనికి ‘మంచితనం’ అనే గుణాన్ని మళ్లీకలిపి ఇప్పటి మాస్ హీరో ఇమేజ్ ని రూపొందించారు.
(తర్వాత హీరోయిన్ అనే పదం వచ్చినా అది సినిమాల్లో హీరో ప్రియురాలికిచ్చిన స్థానమేగాని, దానికి హీరోస్థాయి లేదు)
ఐతే ఏంటి? మనహీరో మంచివాడు కదా? బలవంతుడైన చెడ్డవాణ్ణి (విలన్ని) ఎదుర్కోవడానికి హీరోక్కూడా బలముండాలి కదా? అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి.
ఇప్పుడు అదేంటో చూద్దాం. మన విలన్లు చెడ్డగా ఉంటారు, నిజమే.
మన వెండితెర హీరో మంచివాడే, సందేహం లేదు. కానీ పరిశీలనగా చూస్తే మంచితనం మినహాయిస్తే చాలావరకు అతనిలో పైన చెప్పిన చారిత్రక ‘మగాడి’ లక్షణాలు కనబడతాయి.
ఉదాహరణకు; మన ఈతరం హీరోయొక్క సూపర్ హ్యూమన్ కండబలాన్ని మొదటి సీన్లలోనే చూపిస్తారు. ఒక్కడు చొక్కా నలక్కుండా వందమంది ధృఢకాయులను చితక్కొట్టేస్తాడు (దీనికోసం ఇష్టమున్నా లేకున్నా పాపం మన హీరోలందరు జిమ్ముల్లో వర్కవుట్లుచేసి కండలుపెంచడం అవసరమైంది). అతని స్థాయిని పెంచడంకోసం విలన్ ను కూడా బలవంతుడిగా, అతిక్రూరుడిగా చూపిస్తారు.
హీరో తన చుట్టూ ఉన్నవాళ్లకంటే అన్నివిధాలా పైస్థాయిలో ఉంటాడు. అతని మిత్రులు అన్నిటికీ అతనిమీద ఆధారపడుతూంటారు. ఈపాత్రలు సాధారణంగా హాస్యపాత్రలుగా ఉంటాయి. హీరోను ఎలివేట్ చేస్తూ ప్రత్యేక సీన్లు, పాటలు ఉంటాయి. ఒక్కోసారి హీరో ఎంట్రీనే గగుర్పాటు కలిగించేలా ఉంటుంది.
సాధారణంగా హీరో చదువులో వెనకబడివుండి టీచర్లను గేలిచేస్తూంటాడు. ఐటెమ్ గర్ల్ తో డ్యాన్స్ కూడా చేస్తాడు. ఐనా ఆమ్మాయిలంతా అతని వెంటపడుతూంటారు. హీరో మొదట్నుంచే హీరోయిన్ కంటే పైచేయిగా ఉండి ఆమెను ఏడిపిస్తూంటాడు. సగంసినిమా అయ్యేసరికి అతని బలాన్ని చూసి ఆమె పిచ్చిగా ప్రేమిస్తుంది.అన్నిటికంటే ముఖ్యంగా హీరో సినిమా ప్రారంభంనుంచే సాంఘికసమస్యలను కూడా కండబలాన్ని ఉపయోగించి హింసద్వారా పరిష్కరిస్తూంటాడు.
ఇదీ మన ఈతరం సినిమా హీరో ఇమేజ్
ఐతే ఏమి? మొత్తానికి అతను మంచివాడు. చివరికి విలన్ను మట్టుబెట్టి సమస్యను పరిష్కరిస్తాడు. మరింక ఇందులో ప్రమాదమేముంది అనే సందేహంరావడం సహజమే. ఆ ప్రమాదమేమిటో చూద్దాం.
మాస్ హీరోవున్న సినిమాలో హీరో ఇమేజే కథనంతా శాసిస్తుంది.
సమాజంలో, దేశంలోవున్న అన్ని వ్యవస్థలు అవినీతితో, అసమర్థతతో, విలనంటే భయంతో నిర్వీర్యమైనట్టు కథనంలో చూపిస్తారు. అంటే రాజకీయ, పరిపాలన, న్యాయ, పోలీసు, రెవెన్యూ, విద్యా, వైద్య ఇలా అన్ని వ్యవస్థలూ విలన్ కు లొంగిపోయి అతనికితప్ప సామాన్యజనానికి పనిచేయకుండా ఉంటాయి.
దీన్ని బాగాచూపించడానికి ఒకరిద్దరు నిజాయతిగల అధికారులను, జర్నలిస్టులను, సాక్షులను, సామాన్యపౌరులను విలన్ దారుణంగా చంపడం, పోలీసులు వివిధ స్థాయుల్లో అవినీతివల్ల ఏమీ చేయలేకపోవడం చూపిస్తారు. ఇంకా అవసరమైతే నిర్దోషులు జైలుకు వెళ్లడం ఉంటుంది.
అప్పుడు హీరో రంగంలోకి దిగి చట్టాన్ని, న్యాయాన్ని తనచేతుల్లోకి తీసుకుని ఒక్కడే కేవలం తనకండబలంతో మొదట విలన్ అనుచరులను, తరువాత విలన్ ను దారుణంగా చంపి సమస్యను పరిష్కరిస్తాడు. మన మాస్ హీరో ఉన్న చాలాసినిమాల్లో ఇలాగేవుంటుంది.
చరిత్రలో పొగడబడిన ‘మగాడి’ కథ కూడా ఇలాగే ఉంటుంది. అయితే అది చరిత్ర, ఇది వర్తమానం. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం. ఈ ‘మగాడి’ లక్షణాలను ఇక్కడ చూపించడం మంచిదికాదు. ప్రజాస్వామ్యం హీరోలవల్ల నడవదు, సామాన్యుడికోసం పనిచేసే వ్యవస్థలద్వారా నడుస్తుంది.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారాలు ప్రజల చైతన్యంతో, వ్యవస్థల కార్యాచరణతో మాత్రమే జరగాలి. వ్యక్తి ఆరాధనకి దారితీసే ‘హీరోయిజం’ ఎక్కడికక్కడ హిట్లర్లని సృష్టించి ప్రజాస్వామ్యానికి, పౌరులకు హానిచేస్తుంది. అంతేకాక ఇలాంటికథలు ప్రజలలో వ్యవస్థలపట్ల అపనమ్మకానికి, నిసృహకు, నిస్తేజానికి దారితీస్తాయి.
ఐనా ఈ మాస్ హీరోల సినిమాలు ఎందుకు తీస్తున్నారు అంటే ‘హిట్టౌతున్నాయి కాబట్టి’ అనే సమాధానం వస్తుంది. సినిమా అంటే కళ ప్లస్ వ్యాపారం. కాబట్టి నిర్మాతలు లాభాలొచ్చే సినిమాలే తీస్తారు. వాళ్లు తీస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు అనేది దీనికి ప్రతివాదన. ఇది విత్తుముందా చెట్టుముందాలాంటి డైలమా.
యేమైనా సినిమాల్లో ఒక మంచి లక్షణముంది, ఏ ట్రెండ్ అయినా కొన్నాళ్లే ఉంటుంది. యువతలోని భావాలకు కొంత నష్టం జరిగినా అంత భయపడాల్సినపని లేదంటారు కొందరు.
ఇప్పడు చాలాదేశాల్లో ప్రజాస్వామ్యవ్యవస్థలు అనుకున్నంతగా పనిచేయకపోవడం వాస్తవమే. దానికి కారణం సరైన ప్రజాచైతన్యం లేకపోవడమే. కాబట్టి ప్రజాచైతన్యాన్ని కలిగించే చర్యలు కావాలి, ‘మాస్ హీరోయిజం’ కాదు. వీటిని కొందరు సామాన్యపౌరులు ప్రజాస్వామ్య పద్దతిలో, అహింసాయుతంగా చేస్తారు, వాళ్లే నిజజీవితంలో మనం గుర్తించాల్సిన హీరోలు.
నిజమైన హీరోలకు మన జాతిపిత గాంధీజీ ఒక గొప్ప ఉదాహరణ.
సినిమాహీరోలు కేవలం తెరమీద ‘హీరో ఇమేజ్’ తో కనపడే నటులు మాత్రమే. వాళ్లను నిజజీవితంలోకూడా హీరోలుగా భావించి ప్రజారంగంలో వాళ్లసేవలు ఆశించడం సరైందికాదు.