ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తమిళనాడుకు చెందిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద నియమించింది. రాష్ట్రం మరొక వైపు కరోనాతో సతమతమవుతున్నా, కీలకమయిన బదిలీలు, నియామకాలు యధేచ్చగా జరుగుతున్నాయి. ఇలాంటిదే కొత్త ఎన్నికల కమిషనర్ గా మాజీ న్యాయమూర్తి నియామకం. ఇపుడున్న కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు చట్టాన్ని సవరించి, కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే, పాతకమిషనర్ కు వర్తిస్తుందా లేదా అనే దానిమీద స్పష్టత లేదు. కొంత మందిఅధికారులు వర్తించదని, మరికొందరు వర్తిస్తుందని ట్రెండింగ్ తెలుగున్యూస్ కు చెప్పారు. అయితే, ఈ ఆర్డినెన్స్ కు సవాల్ చేస్తారేమో చూడాలి. ఆర్డినెన్స్ రావడం, కొత్త కమిషనర్ నియమాకం అంతా 24 గంటల్లో పూర్తయింది.
జస్టిస్ కనగరావు మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన మద్రాసు హైకోర్టులో 1959లో న్యాయవాదిగా చేరారు. 1989 అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ అయ్యారు. 1990లో మార్చిలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా రిటైరయ్యాక సేల్స్ టాక్స్ స్పెషల్ ట్రిబ్యునల్ చెయిర్మన్గా మూడేళ్లు పని చేశారు. తర్వాత హైకోర్టు నియమించిన పలు కమిటీ లకు నాయకత్వం వహించారు.