గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం (12-04-2020) సంపూర్తిగా లాక్ డౌన్ ను చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేడొక ప్రకటనలో తెలిపారు.
సాధారణ రోజులలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు కూడా ఆదివారం రోజు ఉండదన్నారు.జిల్లాలోని అన్ని రెడ్ జోన్ల పరిధిలో వున్న వారు ఎవ్వరునూ బయటకు వెళ్ళే వీలులేదన్నారు. మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రం ఆదివారం రోజు మినహాయింపు వుందన్నారు. అలాగే రోజు మార్చి రోజు లాక్ డౌన్ ను జిల్లాలో అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు కనీసం 15 రోజులకు అవసరమైన నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవలసి ఉంటుందన్నారు. మందులు, పిల్లలకు పాల డబ్బాలు వంటివి అవసరమైనంత ముందస్తుగా సమకూర్చుకోవాలని కోరారు. అవసరమైన పక్షంలో కూరగాయలు ప్రత్యామ్నాయ రోజులలో అనగా అనుమతించిన రోజులలో ఉదయం 6 నుండి 9 గంటల లోపు కొనుగోలు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. –