మనందరికీ ఆదర్శ నేత అయిన నర్రా రాఘవరెడ్డి గారు భౌతికంగా కనుమరుగై అపుడే 5 సంవత్సరాలు అవుతుందా? అనిపిస్తుంది. కాలం శరవేగంగా పరుగులు తీస్తోంది. నేనిప్పటి వరకు రాఘవరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ఎటువంటి వ్యాసం వ్రాయలేదు. కానీ ఈ రోజు వ్రాయాలనిపించింది. ఎందుకంటే సుదీర్ఘ కాలం విద్యార్థిగా, ఆందోళనకారుడిగా, నాయకుడిగా ఆయన కనుసన్నల్లో అభివృద్ధి అయినవాణ్ణి. కాబట్టి ఆయన నుండి నేను నేర్చుకున్న అనేక అనుభవాలను సమాజం ముందు ఉంచవలసిన బాధ్యత నాపై ఉంది అనిపించింది.
అది 1982 ఆనాటికే అనగా రాఘవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా స్వంత గ్రామమైన చిట్యాలలో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనాటికి నేను 7 వ తరగతి చిట్యాల హైస్కూల్లో బహిరంగ సభలకు వేలాది మంది తండోప తండాలుగా కదిలి వచ్చారు. అందులో ప్రారంభంలో నర్రా రాఘవరెడ్డి గారు చెప్పిన పల్లె సుద్దులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాకారుడిగా వేషం తీసి, మళ్లీ నాయకుడిగా రాజకీయ అంశాలు చెప్పడం ఆయనకే సాధ్యమైంది. ఆనాటి బహిరంగ సభ మాలాంటి విద్యార్థులపై గొప్ప ప్రభావాన్ని పడవేసింది.
1986 లో నేను రామన్నపేట జూనియర్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా గెలిచాను. నర్రా రాఘవరెడ్డి గారి బంధువైన నర్రా గోపాల్ రెడ్డి గారు చైర్మన్ గా గెలిచాడు. మా యొక్క ప్రమాణ స్వీకార సభకు ఆనాటి జిల్లా కలెక్టర్ ఏకే గోయల్ గారిని ఆహ్వానించడానికి జడ్పీకి వెళ్ళాము. నర్రా రాఘవరెడ్డి గారికి నన్ను పరిచయం చేశారు. ఆయన్ని తీక్షణంగా పరిశీలించే వాణ్ణి. అతని అనుసరించే వందలాది మంది ప్రజలు. అతని చూపుడు వేళ్ళను గమనిస్తూ ఆయన ఆదేశాలను పాటించే జిల్లా అధికారులు. ఆయన ప్రతి కదలికలో దార్శనికత ఉట్టిపడేది. ఆనాటికే ఆయన సిపిఎం శాసనసభా పక్ష నాయకుడుగా ఉన్నారు. ఎంతో అనుభవాన్ని గడించి ప్రభుత్వ చట్టాలపై ప్రతి విషయం చెప్పగలిగిన దిట్టగా మారారు. అందుకోసమే అధికారుల్లో ప్రజల్లో ఆయనంటే అనేకమైన గౌరవాభిమానాలు కనిపించేవి.
రాఘవ రెడ్డి గారి నివాసానికి మా నివాసానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరమే ఉండేది. చిట్యాలలో పెద్దబాయి గూడెంగా పిలువబడే మా నివాసం నుండి తరచూ రాఘవరెడ్డి గారి వద్దకు వెళ్లి అనేక సలహాలు సూచనలతో బయల్దేరి వచ్చేవాళ్లు. మా రక్త సంబంధీకులు ప్రస్తుతం చిట్యాలలో తహశీల్దార్ ఆఫీసు ఎదురుగా ఉన్న చవుళ్లలో ప్రభుత్వ భూమిపై గుడిసెలు వేశారు. ఇది తనకు కంటగింపుగా మారిందని ఆనాటి స్థానిక శాసనసభ్యుడైన గుత్తా మోహన్‌రెడ్డి గారు నా కళ్ళెదుటే దగ్గరుండి మా గుడిసెల్ని తగులబెట్టించడం జరిగింది. తన నియోజకవర్గం కాకపోయినా, నర్రా రాఘవరెడ్డి గారు మా బంధువులందరినీ ప్రభుత్వ ఆఫీసులకు రప్పించి వెనువెంటనే అక్కడే పట్టాలు ఇప్పించడం జరిగింది. అందుకని ఎవరి నియోజకవర్గం ఎవరి ప్రాంతం అని చూసేవాడు కాదు. సమస్య ఎక్కడ ఉన్నా, ఎవరి వైపు న్యాయం ఉన్నా అది అమలయ్యే విధంగా చట్టసభల్లో పోరాడేవారు. ఈ విధంగా ఉన్నవారు ప్రస్తుతం ఎందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అనేది ప్రశ్న.
1988లో నేను ఎస్.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఎన్.జీ. డిగ్రీ కాలేజీ సమస్యలపై 2 వందల మంది విద్యార్థులతో జడ్పీకి తరలి వెళ్లాం. ఆనాటి చైర్మన్, సి.ఇ.ఓ. లను ఘెరావ్ చేయాలనేది మా పథకం. నర్రా రాఘవరెడ్డి గారు జడ్.పి.లో కనిపించారు. సమస్య ఎంతటిది? మీరు అనుసరించే పోరాట పద్ధతి ఏమిటి? అని నన్ను ప్రశ్నించాడు. వెంటనే కళ్లాలు పడ్డ వాళ్లుగా మేమందరం ఆగిపోయి, వినతిపత్రం వారకే ఇచ్చి తిరిగి వెళ్లాము. నర్రా రాఘవరెడ్డి గారు సమస్య తీవ్రతను బట్టి పోరాట పద్ధతులు ఉండాలని, పోరాట పంథా సమస్య పరిష్కారమయ్యేందుకు మార్గంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలను అంగీకరించేవాడు కాదు.
చిట్యాల పట్టణ పాటల బృందంగా మేము తరచూ బహిరంగ సభల్లో కెళ్ళి పాటలు పాడేవాళ్లం. ఒకమారు మా బృందం నర్రా రాఘవరెడ్డి గారి కంటపడింది. తనవద్దకు పిలిపించుకుని ప్రధాన గాయకుణ్ణి మీరు అనుసరించడం లేదని, అప్పుడు పాట ఎలా? రక్తి కడుతుందని? అడిగాడు. ఆయన సూచనలతో ఆనాటి నుండి మా పాటల దళానికి మంచి పేరు వచ్చింది. తను సొంతంగా కళాకారుడు కాబట్టి కళాకారుల్లో దోషాలను వెంటనే సవరించి చెప్పేవాడు.
నర్రా రాఘవరెడ్డి గారిలో హాస్య దృక్పథం ఎక్కువగా ఉండేది. తన ఉపన్యాసం ఇచ్చినా, విషయాన్ని చెప్పినా, తెలంగాణ యాసలో, భాషలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పేవారు.1989 లో నల్లగొండలో పది వేల మందితో ఎస్.ఎఫ్.ఐ. జిల్లా మహాసభలు నిర్వహించాము. అందులో ప్రధాన ఉపన్యాసకుడు నర్రా రెడ్డిగారు. ఆయన హాస్య దృక్పథంతో మాట్లాడిన ఉపన్యాసం నేటికి కూడా మరిచిపోను. రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానం గురించి తెలియజేస్తూ… “వెనుకటికి ఒక రాజు అద్దం ముందు కూర్చుని తన తల కొప్పు పెట్టుకోవడం పైనే సమయమంతా వృథా చేశాడు. చివరికి తల కొప్పు బాగా కుదిరిందని బయటికి రాగానే, ప్రజలంతా ఘొల్లున నవ్వారు. అదేమని ప్రశ్నిస్తే నీ తల కొప్పు కాదు, కింది పరిస్థితి చూసుకో… అని అన్నారట. దాని అర్థమేమిటి అంటే తలపాగా చుట్టుకుబోయి క్రింద వస్త్రాలను మరిచిపోయాడట, అట్లాగే రాజీవ్ గాంధీ నూతన విద్యావిధానం లక్షలాది స్కూళ్లను ఎండబెట్టి, పెద్దలు చదివే కొన్ని స్కూళ్లకు నిధులను కేటాయించడం ఏమిటని, రాజు కథ పోలి ఉంది కదా! అని చెప్పాడు. దీనికి సభకు వచ్చిన వాళ్లంతా కడుపుబ్బ నవ్వారు. ఇటువంటి అనేక అంశాలు నర్రా రాఘవరెడ్డి గారి గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఏ సభలో మాట్లాడినా ఏ నిర్మాణ సమావేశంలో మాట్లాడినా తన విమర్శ సునిశితంగా, హాస్య దృక్పథంలో తానొవ్వక నొప్పించని విధంగా ఉండేది.
1991 లో నల్లగొండ పట్టణంలో ఎ.బి.వి.పి. శక్తులు ఒక రాత్రి పూట మాటు కాసి నాపై దాడి చేయడం జరిగింది. ముఖమంతా గాయాల మయమై నా బట్టలన్నీ రక్తంతో తడిసి ముద్దైనాయి. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్ళాను. అదే రాత్రి హుటాహుటిన వార్త తెలుసుకుని ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించి ధైర్యం జరిగింది. నిర్బంధాల్లో త్యాగాలు చేసే కార్యకర్తల విషయంలో తగినంత జాగరూకత ప్రదర్శించేవాడు. అంతేకాకుండా 1992 లో నకరేకల్ లో కాపిటేషన్ ఫీజు పైన పట్టణ బంద్ నిర్వహించాము. నాటి మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి గారు ఒక కార్యక్రమానికి రాగా వారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాము. డీఎస్పీ గారి ఆదేశాల మేరకు తీవ్రమైన లాఠీచార్జి ప్రారంభమైంది. ఎందుకు ఈ లాఠీ చార్జి చేస్తున్నారని డిఎస్పీతో నేను మాట్లాడుతుండగా మరింత కోపంతో మంత్రి కాన్వాయ్‌లో ఉన్న గన్మెన్లను రెచ్చగొట్టి వీడి సంగతి చూడండని అన్నాడు. ఐదుగురు గన్ మెన్ లు నాపై పడి స్టెన్ గన్ లతో దాడి చేశారు. వళ్ళు హూనమయ్యింది. తల పగిలి దేహమంతా రక్తసిక్తమయింది. దారంతా రక్తమయమే… ఈ వార్త తెలుసుకుని హుటాహుటిన నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులతో, సునిశితంగా మా వాడిపై మీరు కేసు ఏమైనా పెడతారా? అని ప్రశ్నించాడు. వారు లేదని చెప్పగా తన జీపులో తీసుకుని నన్ను హాస్పిటల్ లో వైద్యం చేయించడం జరిగింది.
1993 లో నకిరేకల్ నియోజకవర్గం నిస్తబ్దత గా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడినైన నన్ను ప్రత్యేకంగా అక్కడ పనిచేయాలని పార్టీ నిర్ణయించి పంపించింది. ఈ విషయాన్ని నకిరేకల్ కు వెళ్ళి నర్రా రాఘవరెడ్డి గారికి తెలియజేశాను. ఆయన దీనిపై స్పందించి “మా నియోజకవర్గం బాగానే ఉందని, నువ్వు దున్న గలిగితే శాలిగౌరారం మండలంలోని పెరిక కొండారం, మాదారం, ఇటుకులపహాడ్, వంగమర్తి, చిత్తలూరు గ్రామాలలో దున్నమని నీ శక్తి ఏమిటో అప్పుడు తెలుస్తుందని చెప్పడం జరిగింది. వారి మాటలకు ప్రారంభంలో బాధ కలిగింది.కానీ పట్టుదల పెరిగింది. 10 రోజులు ఇంటి వైపు వెళ్లలేదు. గ్రామాల్లో సమావేశాలు వందలాది మంది కార్యకర్తలను వీధుల్లోకి తెచ్చి సభ్యత్వ సేకరణలు, మాకినేని బసవపున్నయ్య భవన్ హైదరాబాద్‌లో ప్రారంభోత్సవానికి 7 లారీలలో మందిని సమీకరించడం జరిగింది. నియోజకవర్గం నుండి ఎక్కడి నుండి కూడా హైదరాబాద్ సభకు ప్రజలు వెళ్లలేదు. నాకు అప్పగించిన 5 గ్రామాల నుండి మాత్రమే 7 వందల మంది ప్రజలు వెళ్లారు. దాంతో ముగ్ధుడైన నర్రా రాఘవరెడ్డి గారు నూనె వెంకట్ స్వామిని చూసి నేర్చుకోమని, అతని పని పద్ధతిని అలవరచుకోమని చివాట్లు పెట్టాడు. నీవు 5 గ్రామాలే కాదు. ముందుగా శాలిగౌరారం మండలం ఆ తరువాత నియోజకవర్గమంతా తిరగమని, నేనే గ్రామాల్లో ఉన్న స్థానిక నాయకత్వానికి పరిచయం చేస్తానని ప్రత్యేకంగా తన మార్షల్ జీపులో నన్ను ఎక్కించుకుని గ్రామాల్లోని నాయకత్వానికి పరిచయం చేయడం జరిగింది. మరి నేను “అనారోగ్యానికి గురైతే ఎట్లా?” అని ప్రశ్నిస్తే… నవ్వి “ఇది దగ్గు గోలి, ఇది కడుపు నొప్పు గోలి, ఇది జ్వరం గోలి, ఇది వాంతులు, విరేచనాలకు గోలీలు”, అని ఒక 50 గోలీలు నా చేతిలో పోసి, వీటి ఆసరాగా ఈ గ్రామాల్లోనే ఉండమని ఆదేశించి వెళ్లారు. మళ్లీ నేను వెనక్కి చూడలేదు. సంవత్సర కాలం పాటు నకరేకల్ నియోజకవర్గానికే పరిమితమై దాదాపు అన్ని గ్రామాలను చుట్టుముట్టడం జరిగింది. మంచి రాజకీయ ఫలితాలను సాధించడం జరిగింది.
1994 లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తన అభ్యర్థిత్వంపై వస్తున్న భిన్నాభిప్రాయాలపై కోపగించుకుని బయట తిరగకుండా ఇంటికే పరిమితమై ఉన్నాడు. ఆ సందర్భంలోనే నా వివాహం నిర్ణయమయింది. వెళ్లి ప్రాధేయపడ్డాను. మీరే ఆచార్యులుగా వ్యవహరించి నాకు స్టేజ్ మ్యారేజీ చెయ్యాలని వేడుకున్నాను. ఆయన పట్టు వదిలి నా వివాహానికి హాజరై, ఆచార్యుడిగా వ్యవహరించారు. జిల్లా రాష్ట్ర నాయకత్వం ఎంతో సంతోషపడింది.
ప్రజల ఆరోగ్యం విషయంలో కమూనిస్టు పార్టీ కార్యకర్తల, నాయకుల ఆరోగ్యం విషయంలో నర్రా రాఘవరెడ్డి గారు ఎంతో శ్రద్ధ వహించేవారు. ఎవరైనా తన రక్షణ కోరి వచ్చినా, వారిని ప్రత్యేకంగా తన వాహనంపై ఎక్కించుకుని ఆయా హాస్పిటళ్ళ దగ్గరికు తీసుకు వెళ్లి, వాళ్లను జాయిన్ చేసి, వారి యొక్క ఆరోగ్య క్షేమాలు తెల్సుకుంటూ.. వారిని కాపాడేవారు. చివరకు నాటి సీ.పీ.ఎం. జిల్లా కార్యదర్శిగా ఉన్న మల్లు వెంకట నరసింహారెడ్డి గారు, నేను కంటి వైద్యానికి సంబంధించి వారిని కోరగా ప్రత్యేకంగా తీసుకుని హైదరాబాద్ సరోజిని కంటి ఆసుపత్రిలో మమ్మల్ని చూపించడం జరిగింది.
12 సంవత్సరాల వయసులో ఒక ఎమ్మెల్యేను మరియు ఒక ప్రజా నాయకుడిగా నర్రా రాఘవరెడ్డి గారిని చూసిన నేను… 1997 లో ఆయనతోపాటే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఎంతో దూరంలో ఆదర్శ నేతగా చూసిన నేను. అతి సమీపంగా వారితో పాటు రాష్ట్ర కమిటీలో దీర్ఘకాలంగా పనిచేశాము. ఆయన పోరాట దక్షత, నిర్మాణ దక్షత కలిగిన నాయకుడు. 1967 నుండి 1999 వరకు 6 దఫాలు 30 ఏళ్లు శాసనసభ్యుడిగా ఉన్న నర్రా రాఘవరెడ్డి గారి విషయంలో ఎటువంటి ఆరోపణలు కానీ, అవినీతి అంశాలు గాని ఆయనపై లేవు. చంద్రుడి లోనైనా మచ్చలు ఉండొచ్చుగాక… రాఘవరెడ్డి గారిలో ఎటువంటి మచ్చ లేదు. అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ప్రభుత్వం. దాని యొక్క పరిపాలన. దాని యొక్క విధానాలు, ప్రభుత్వ జీ.వో.లు వాటి యొక్క అంతర్ సారాంశం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు తెలువకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు. ప్రజా ఉద్యమాలను ఏ విధంగా నడిపిస్తారు. అని అనేవాడు. అందుకు కనీసం రెండు పత్రికల్లో నైనా ప్రతిరోజూ సంపాదకీయాలు చదవండి తద్వారా మీకు వర్తమాన రాజకీయ పరిస్థితులు అర్థమవుతాయి అని చెప్పేవాడు. నిత్యం ఘర్షణలు జరిగే గ్రామాల్లో అక్కడి కేడర్ ను కూర్చుండబెట్టి “మనకు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది శత్రువులు ఉండాలని, శత్రువుల సంఖ్యను పెంచవద్దని, ప్రజాస్వామిక పద్ధతుల్లో మన పోరాట పంథా ఉండాలని, ప్రజలు మెచ్చే విధంగా ఉద్యమించాలని, చెప్పేవాడు. అది నేటికీ అనుసరణీయమే…
అంతేకాకుండా ఆయన నీతి- సేవ గురించి ప్రత్యేకంగా చెప్పేవాడు. దేశంలో, ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీకి ఇతర పార్టీలకు తేడా ఉందని, కమ్యూనిస్టు పార్టీలు బూర్జువా, భూస్వామ్య, దోపిడీ రాజకీయ పార్టీల లాగా సంపద కలిగి లేమని, అధికారం కలిగి లేమని ఈ పరిస్థితుల్లో మనల్ని రక్షించేవి నీతి-సేవ అని చెప్పేవారు. ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సేవ ప్రజలకు చేయాలని, ఇతర రాజకీయ పార్టీల నాయకత్వంలో ఉన్న స్వార్థపరత్వం, లోభిదృక్పథం, అరాచక సంస్కృతి మనలో ఉండరాదని అత్యంత నీతివంతంగా, కడిగిన ముత్యాల్లా… ప్రజల తలలో నాలుక లాగా ఉండాలని, అప్పుడు మాత్రమే మనల్ని ప్రజలు ప్రేమిస్తారని ఉద్బోధించే వారు. ఈ అంశం నేటి విపత్కర పరిస్థితులలో మరింత అనుసరణీయం.
ఇంతటి మహనీయుడు 2009 లో నకిరేకల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నా అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది. అదే సందర్భంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. అతని యొక్క ఉక్కు సంకల్పాన్ని మేమెక్కడా కూడా ప్రశ్నించలేదు.
వివిధ పత్రికల్లో నేను పాల్గొనే వార్తలను చదువుకుని తన యొక్క అనుయాయుల ద్వారా ప్రత్యేకంగా నన్ను తన ఇంటికి పిలిపించుకుని, ప్రజా సమస్యలపై ప్రజల్లో దూసుకువెళ్తున్నావని ఇదే పంథాను అనుసరించాలని ప్రోత్సహించేవాడు.
ఆయనకు నాపై అపారమైన గురి ఉండేది. ఎడారి లోనైనా ప ఓర్పుతో, నేర్పుతో, పార్టీని నిర్మించగలరని, ఎన్ని నిర్బంధాలు వచ్చిన ప్రాణాలకు తెగించి పోరాడగలనని, ఎన్ని ఆటుపోట్ల కైనా వెరవని, ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజా పోరాట పంథాను విడవని, ఆయన 5 వ వర్ధంతి సందర్భంగా శపథం చేస్తున్నాను.
(నూనె వెంకట్ స్వామి,రాష్ట్ర అధ్యక్షుడు,ప్రజా పోరాట సమితి)