వర్సిటీలలో రాజకీయ జోక్యం తెలుగుదేశం చలవే : మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
యూనివర్సిటీ నియామకాలలో రాజకీయ జోక్యానికి ఆద్యులు ఎవరు ?
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీలకు పాలకమండళ్లను నియమించినది. యూనివర్సిటీల భవితవ్యాన్ని నిర్ణయించే యూజీసీ చైర్మైన్ ,వైస్ చెైరన్లు మరియు పాలకమండళ్ల నియామకాలలో రాజకీయ నిర్ణయానికి అవకాశం ఉన్నపుడు ప్రస్తుత పాలకమండళ్లు నియామకాలలో రాజకీయ సిపార్సులకు అవకాశం ఎందుకు ఉండదు.
అభ్యంతరం ఏమిటంటే ఈ సమయంలో జరిగిన నియమకమే గాడితప్పినట్లు మాట్లాడటం , నేడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారు గడిచిన దశాబ్దాలుగా జరిగిన వ్యవహారాలలో ఇలానే ఎందుకు స్పందించలేదు అన్నది అసలు ప్రశ్న.
యూనివర్సిటీలలో రాజకీయ జోక్యం ప్రారంభించినది తెలుగుదేశం.
30 సంవత్సరాల క్రితం SVU లో జరిగిన పరిణామాలలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తన మాటకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో అప్పటి వరకు యూనివర్సిటీలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తూ రాజకీయ జోక్యానికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేసింది. VC నియామకంలో చర్చి కమిటీ ముగ్గురి పేర్లు ప్రతిపాదిస్తుంది. వారిలో ఒక్కరిని ఛాన్సలర్ హోదాలో గవర్నర్ నియమిస్తారు అలా 1984 ప్రాంతంలో ఇదే యూనివర్సిటీలో ప్రభుత్వ సిఫార్సుకు భిన్నంగా నాటి గవర్నర్ రామ్ లాల్ GN రెడ్డి ని వైస్ ఛాన్సలర్ గా నియమించారు. మరో ముఖ్యమైన విషయం నేడు వివాదంగా మారిన పాలకమండలి విషయంలో కూడా 30 సంవత్సరాల క్రితం వరకు నియామకాలలో యూనివర్సిటీ ప్రొఫెసర్ లు , డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు నుంచి నేరుగా ఎన్నికలు జరిగేవి. అదే విధముగా సెనేట్ మెంబర్లకు విద్యార్థులు నేరుగా ఎన్నిక కాబడేవారు. సహజంగా ఎన్నిక అయినవారి రాజకీయ నేపథ్యం ఎలా ఉన్నా విద్యార్థుల వైపు ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. అలాంటి సాంప్రదాయం ఉన్న రాష్ట్రంలో 1984 – 1986 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పాలకమండళ్లు , సెనేట్ సభ్యులను నేరుగా విద్యార్థులు , అధ్యాపకులు ఎన్నుకుంటే నష్టం అని భావించి ఆ సాంప్రదాయాన్ని రద్దు చేసి ప్రభుత్వం నేరుగా నామినేటెడ్ , నియామకాలు చేసే పద్దతిని తీసుకు వచ్చింది.
యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తికి బీటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనడానికి సంకోసించాల్సిన అవసరం లేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారి ప్రభుత్వం విద్యార్థి ఎన్నికలను నిషేధించినది. అటు పిమ్మట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా కొనసాగించింది. అలా నియామకాలలో ప్రభుత్వ పాత్ర కీలకంగా మారింది. ఒకసారి రాజకీయ జోక్యం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత దాని మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గదు. నేడు జరిగిన నియామకాలు మంచివా చెడ్డవా అన్నది కాదు గడిచిన 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే నేడు జరిగింది.
విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా వ్యవహరించినపుడే వాటి ఫలితాలు దేశ ప్రజలకు అందుతాయి. రాష్ట్రంలో , దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల నడక , నియామకాలు స్వతంత్రంగా ఉండే చట్టబద్ద వ్యవస్థ క్రిందకు తీసుకురావాలి. తమకు నచ్చిన పార్టీ నియామకాలు చేపట్టినపుడు నోరుమేదపక , నచ్చని పార్టీ చేసినపుడు నితులు చెప్పడం సరికాదు. సమూల మార్పు కోసం ప్రజా ఉద్యమం రావాలి. మేధావులు , ఆలోచన పరులు రాజకీయ ప్రేరేపిత ప్రయత్నం కాకుండా సమజాహితం ప్రాతిపదికన ప్రయత్నాలు చేసినపుడు మంచి మార్పుకు దారితీస్తుంది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)