పడిపోయిన యాబైనాలుగేళ్ల తరువాత బరేలికి దొరికిన జుంకా

(త్రిభువన్, జింకా నాగరాజు)
ఇదొక చిత్రమైన జుంకా కథ.
ఉత్తరప్రదేశ్ లోని బరేలి పట్టణం శివార్లలో మొన్నటి ఫిబ్రవరి నెల మొదటివారంలో,  నేషనల్ హైవే 24 పక్కన జీరో పాయింట్ దగ్గర, 18 లక్షల ఖర్చుతో 14 అడుగుల ఎత్తుగల కంచు జుంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. రెండువందల కిలోల బరువున్న ఈ జుంకాకు  రంగురాళ్లు తాపడంచేసి, బరేలికి ప్రతేకమైన జరీ ఎంబ్రాయడరీతో అలంకరించారు. దాని డిజైను, నిర్మాణం ఆవూరి నిపుణులే చేసారు.
ప్రభుత్వనిధులు కాకుండా, సేకరించిన విరాళాలతో ఏర్పాటుచేసిన దీన్ని అక్కడి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రారంభించారు. దీంతో బరేలి పట్టణప్రజలు 54 యేళ్లగా కంటున్న కల సాకార మైంది.
నిజానికి బరేలికి జుంకాకు ఏమీ సంబంధంలేదు. అక్కడ ప్రత్యేకంగా జుంకాలేవీ తయారుకావు. అన్నివూళ్లలోలాగే అక్కడా ఆభరణాల దుకాణాల్లో జుంకాలు దొరుకుతాయి అంతే. పైగా ఆవూరు దేనికైనా ప్రసిద్ధి అంటే, అది గాలిపటాలకు వాడే మాంజా దారానికి.
మరి ఈ జుంకా విగ్రహంకోసం ఆపట్టణప్రజలు అర్దశతాబ్ధంగా ఎందుకు ఎదురు చూసారన్నది ఆసక్తికరమైన విషయం. ఈ జుంకా ఒక చిహ్నమని, ఆ చిహ్నం ఏర్పాటు చేసుకోవాలనుకోవడానికి కారణం ఒక హింది సినిమాపాట అంటే ఆశ్చర్యం కలుగక మానదు.
యాభైనాలుగేళ్ల కిందట, 1966లో, విడుదలైన ‘మేరా సాయా’ అనే హిందీ సినిమాలో అప్పటి ప్రముఖ హీరోయిన్ ‘సాధన’ డ్యాన్స్ చేసిన ‘జుంకా గిర్రారే బరేలీకె బాజార్ మే’ అనే జానపద స్టైల్లోని పాటకు దేశమంతా విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. సినిమాలో ఆపాట వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు పువ్వులు, నాణేలు ఎగజల్లేవారట. ఈపాటను రాజా మెహ్ది అలి ఖాన్ రాయగా, మదన్ మోహన్ బాణీ సమకూర్చగా, ఆశా భోంస్లే పాడారు. దర్శకుడు రాజ్ ఖోస్లా, నిర్మాత ప్రేమ్ జి.
ఈపాట పల్లవిలోవున్న ‘బరేలికి బజార్ మే’ అన్న వాక్యం పల్లవి వచ్చిన ప్రతిసారీ రావడంతో బరేలి పేరుకూడా ప్రజల నాలుకలమీద ఆడింది. ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కలవాళ్లు, బరేలి నగరానికి వెళ్లిన యాత్రికులు, బరేలిలో ప్రత్యేకమైన జుంకా తయారుచేస్తారనే భావనతో ఈ ‘బరేలి జుంకా’ గురించి అడగడం మొదలు పెట్టారట.
నిజానికి అటువంటిదేమీ లేకపోయినా అదేపనిగా ఆవూరొచ్చి ఆసక్తిగా అడుగుతున్నవాళ్లకి అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పడం బరేలి ప్రజలకి, దుకాణదార్లకి ఇబ్బందిగా ఉండేదట. జుంకావల్ల తమవూరికి అంత ప్రాచుర్యం వచ్చిందిగాబట్టి కృతఙ్ఞతగా ఏదైనా చేయాలని అప్పుడే అనుకున్నారట. ఊర్లో ఒక జుంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, జుంకాల మార్కెట్ ను విస్తరిస్తే బావుంటుందని నిర్ణయించుకున్నారట.
మార్కెట్ నైతే విస్తరించుకోగలిగారుగాని ఎప్పటికప్పుడు బడ్జెట్ పెరిగి, విరాళాలు సరిపోక జుంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 54 సంవత్సరాలు పట్టడం వాళ్లకు బాధాకరమైన విషయం. మొత్తానికి ఇప్పటికైనా వచ్చిందని సంతోషిస్తున్నారట.
జుంకా విగ్రహమైతే వచ్చిందిగాని దానికి కారణమైన 54 సంవత్సరాల నాటి పాట, అంటే రెండుతరాల కిందటి పాట ఈ తరంవాళ్లకి అసలు గుర్తుంటుందా అన్నది ప్రశ్న. ఈ సందర్భంలో ఈపాటను అజరామరం చేసిన అప్పటి కళాకారులను, ముఖ్యంగా సినిమాలో కళ్లకు కనిపించే దృశ్యమాధ్యమంలో నృత్యంచేసి ఈపాటకు విపరీతమైన ప్రజాదరణ తెచ్చిన నటీమణి ‘సాధన’ను గురించి తెలుసుకోవడం ఔచిత్యంగా ఉంటుంది.
యాభైనాలుగేళ్లకింద ఈపాటను తన నిషాకలిగిన గొంతుతో ఉత్సాహంగా పాడిన ఆశా భోంస్లే ఇప్పటికీ పాటలు పాడుతున్నారు. ఆమె గాయనిగా తారాస్థాయిని చేరడానికి ఈపాటకూడా తోడ్పడిందంటారు. ఆమె ఈరోజునకూడా ప్రజాదరణ పొందుతున్న గాయనీమణుల్లో ఒకరు. ఈతరానికికూడా బాగా తెలిసినవారు.
ఈపాటరాసిన రాజా మెహ్ది అలీ ఖాన్ (1928 – 1966) తక్కువ పాటలు రాసినా అప్పట్లో మంచిపాటలు రాసిన రచయితల్లో ఒకరు. ఆయన రాసిన పాటలు సంగీతఙ్ఞుల ప్రసంశలేకాక ప్రజాదరణ కూడా పొందాయి. ఆప్ కి నజరోంనె సంఝా (అన్ పడ్), లగ్ జా గలే, నైనా బర్సె (వో కౌంథీ), తు జహా జహా చలే (మేరే సయా) ఒకట్రెండు ఉదాహరణలు మాత్రమే. అయన ఎక్కువ సినిమాల్లో సంగీత దర్శకుడు మదన్ మోహన్ తో కలసి పనిచేసారు.
పల్లెటూరి వాళ్లైన ఇద్దరుప్రేమికుల మధ్య జరిగిన ప్రణయకలహం, ఆ కలహంలో బరేలి బజార్లో పడిపోయిన ఆమె జుంకా. ఈ విషయాన్ని ఆమె తరువాత తనవాళ్లకు సిగ్గుపడుతూ వివరిస్తుంది. ఇదీ పాట స్క్రిప్టు.
‘మేరా సాయ’ కు సంగీతం సమకూర్చింది అప్పటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు మదన్ మోహన్ (1924-1975). ఆయన బాణీలనుగురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అవన్నీ మృదువుగా, వినసొంపుగా ఉంటాయి. ఈ సినిమాలోని అన్నిపాటలకు ఆయన అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ముఖ్యంగా ఈపాటకు ఏర్పరచిన జానపద బాణి ఎవరైనా పాడుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ సినిమా దర్శకుడైన రాజ్ ఖోస్లా (1925-1991) కూడా ఒక ప్రముఖ దర్శకుడు. ఆయన 1950ల నుంచి 80ల దాకా చాలా ప్రజాదరణ పొందిన సినిమాలు తీసారు. ముఖ్యంగా స్త్రీ పాత్రను ప్రముఖంగా తీర్చిదిద్దడంలో ఆయన ముద్ర కనిపిస్తుంది. అతను సాధన నాయికగా తీసిన మూడు సస్పెన్స్ సినిమాల్లో ‘మేర సాయ’ రెండవది. ‘వో కౌంథి’ మొదటిది, ‘అనిత’ చివరిది. మూడూ బాగా హిట్ అయ్యాయి.
చివరగా, ఈపాటలో నర్తించిన నటీమణి సాధన (1941-2015) అప్పటి ప్రముఖ హీరోయినేకాక ఒక ఫ్యాషన్ ఐకాన్ కూడా. అప్పట్లో ఒక సెన్సేషన్ గా మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న ‘సాధన కటింగ్’ అనే కురుల ఫ్యాషన్ ఆమెతో మొదలైందే. అలాగే పంజాబి సాంప్రదాయ దుస్తుల్ని ఆధునికరీతిలో ఆమే మొదటిసారిగా డిజైన్ చేసుకుని ‘వక్త్’ సినిమాలో ధరించి వాటిని ఆధునిక ఫ్యాషన్ దుస్తులుగా మార్చింది.

Think your friends would be interested? Share this story!

డెబ్భైల్లోనే నటించడం మానేసినా ఈతరంవారికికూడా తెలిసిన నటి. ఈమెగురించి చెప్పడానికికూడా చాలా సమయం పడుతుంది. అందమైన తారగానేకాక మంచినటిగా కూడా గుర్తింపుపొందింది. ముఖ్యంగా పాటల్లో ఈమె నటన భావానికనుగుణంగా అద్వితీయంగా ఉంటుంది. భారతీయ సినిమాల్లో ఇది చాలా తక్కువసందర్భాల్లో చూస్తాం.
సాధన సినిమా జీవితాన్ని నలుపు తెలుపు సినిమాల దశగానూ, రంగుల సినిమాలు దశగాను విభజించవచ్చు. రెండవ దశ ప్రారంభంవరకు అమె దేవానంద్, రాజేంద్రకుమార్, షమ్మికపూర్, శశికపూర్, రాజ్ కపూర్, మనోజ్ కుమార్, సునీల్ దత్ లాంటి అప్పటి ప్రముఖ హీరోలందరి (దిలిప్ కుమార్ తప్ప) పక్కన నటించింది. ఆతరువాత ఆరోగ్యం దెబ్బతిని, విదేశ్శాల్లోని అత్యాధునిక చికిత్సకు కూడా లొంగక ఆమె శరీరంలోనేకాక మొహంలోకూడా మార్పులొచ్చాయి. క్రమంగా ఆమె తనస్థానాన్ని కోల్పోవాల్సివచ్చింది.
ఆమెలో వచ్చిన శారీరక మార్పులవల్ల ఆమె మొదటిరంగుల సినిమాల్లో ఒకటైన ఈ ‘మేర సాయ’ సినిమాలో ఆమె అన్నిసీన్లలో ఒకేలాగ కనిపించదు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేసింది.
దొంగలముఠాలోని మొరటు అమ్మాయి పాత్రలో, జానపద నృత్యం చేస్తూ, తన ప్రేమికుడితో జరిగిన ప్రణయకలహాన్ని ఒకేసారి గడుసుగా, అమాయకంగా వర్ణిస్తున్న హావాభావాలు చూపిస్తూ ఈపాటలో నటించిన ఆమెకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి సహజనటనను చాలా సినిమాల్లో ప్రదర్శించడంవల్ల ఆమె సినిమాలు మానేసి దశాబ్దాలు గడచినా ఆమెను ప్రజలు మరచిపోలేదు.
మొత్తానికి బరేలి ప్రజలు ఈపాటకు చిహ్నంగా ‘జుంకా’ ఏర్పాటు చేసుకున్నారు.
ప్రజలమనస్సులలో స్థానం పొందే యిలాంటి సున్నితమైన అంశాలుకూడా క్రమంగా ఒక జాతి సంస్కృతిలో భాగమౌతాయి. ఐతే ఒక్కోసారి అవేర్పడ్డానికిగల కారణాలు మరుగున పడిపోయి మతసంబంధమైందో, మరొకటో కృత్రిమ కారణం సృష్టించబడుతూంటూంది..
మూడుతరాల కింద ఒక కవి ప్రాసకోసం తమవూరి పేరు ఒక సినిమాపాటలో చేర్చితే, ఆ పాట హిట్టై దేశమంతా తమవూరి పేరు మార్మోగితే, అందుకు కృతఙ్ఞతగా తాము ఒక చిహ్నాన్ని ఏర్పరుచుకోవాలనుకోవడం గొప్పసంగతి.
యాభైనాలుగేళ్లు పట్టువిడవక ప్రయత్నించి తమ ఆలోచనను సాకారం చేసుకున్న బరేలి ప్రజలు అభినందనీయులు.
ఇది కూాడా చదవండి

https://trendingtelugunews.com/english/features/why-novel-coronavirus-vaccine-development-being-delayed/