కరోన వ్యాప్తి నివారణలో ఆంధ్రా వలంటీర్లు ముందుండాలి : మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
కరోన బారినుంచి భారతదేశ ప్రజలను కాపాడే ఒకే ఒక్క మార్గంగా స్వీయ నియంత్రణ అని అందరూ అంగీకరించారు. ప్రధాని మోదీ మూడు వారాలు పాటు స్వీయ నియంత్రణలో ప్రజలు ఉండాలని సూచించారు. పూర్తిగా వారి పిలుపు విజయవంతం అయితే సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయినట్లే. సమస్య విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడమే ముఖ్యం.
కరోన నియంత్రణలో అనుభవాలు
కరోన సమస్య జటిలం అయిన ఇటలీ , విజయవంతంగా నియంత్రణ చేసిన చైనా అనుభవాలు మన ముందు ఉన్నాయి.
చైనా దాదాపు 40 రోజుల స్వీయ నియంత్రణ చర్యలు తీసుకున్నది. ప్రజల సహకారంతో బాటు ప్రభుత్వ చర్యలు కూడా ప్రదానం. నగరంలో నివాస కేంద్రాలను యూనిట్ గా చేసుకుని కార్యాచరణ ప్రణాళికను అమలుచేసింది.
అపార్ట్మెంట్ కు ఇద్దరు వాలంటీర్లును నియమించారు. అందులో నివసిస్తున్న ప్రజల రోజువారి అవసరాలకు సరిపడ అన్ని రకాల సరుకులను వాలంటీర్లుతో అందుబాటులోకి తీసుకు వచ్చినారు. అపార్ట్మెంట్ కు తాళం వేసి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు మినహా మిగిలిన వారు రోడ్డు మీద కనపడకుండా చేసినారు. అలా 40 రోజుల స్వీయ నియంత్రణతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినారు.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి 
మన రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉన్నా తెలియని ఆందోళన వెంటాడుతుంది. చైనా , ఇటలీ , అమెరికా దేశాల పరిస్థితి మనకు లేదు. కారణం వాతావరణ పరిస్థితులు , ఆహారపు అలవాట్లు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోన పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. విదేశాలు , కరోన ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చిన వారిని వేరు చేయడం మిగిలిన సమాజాన్ని కూడా స్వీయ నియంత్రణ మూడు నాలుగు వారాలు చేస్తే చైనా కన్నా ఆమాటకొస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ఆంద్రప్రదేశ్ లో కరోన నియంత్రణ చేయవచ్చు. కావాల్సినదంతా ప్రభుత్వ కార్యాచరణ , ప్రజల సహకారం
ఏపీలో మంచి ఫలితాలు సాధించవచ్చు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది , వాలంటీర్ల నియామకాలను చేశారు. సచివాలయ సిబ్బంది దాదాపు 1.20 లక్షలు కాగా గ్రామ వార్డు వాలంటీర్లు 2 .75 లక్షల మంది గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు పట్టణాల్లో 75 – 100 ఇండ్లకు ఒకరు ఉన్నారు. వీరిని పర్యవేక్షణ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయడం వీరి ప్రధాన పని. ఇప్పటికే కొన్ని పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు విజయవంతంగా అందించారు. అంటే చైనాలో కరోన సమస్య ఉత్పన్నం అయినపుడు వాలంటీర్లు నియామకం చేసుకున్నారు. అదే మన రాష్ట్రంలో ప్రతి 50 , 100 ఇండ్లకు ఒక వాలంటీరు వారిని పర్యవేక్షణ చేయడానికి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
విదేశాల నుంచి , కరోన ఉన్న ప్రాంతాల నుంచి ఆంద్రప్రదేశ్ కు వచ్చిన వారు దాదాపు 40 లేదా 50 వేలు ఉండవచ్చు. ఇప్పటికే 15 వేల మందిని గుర్తించి స్వీయ నియంత్రణలో ఉంచారు. మిగిలిన వారిని గుర్తించడం వారిని గ్రామాలు లేదా కళాశాలల హాస్టల్ కు తరలించి అక్కడే భోజన ఏర్పాట్లు చేసి పరిస్థితిని బట్టి ఇళ్లకు లేదా హాస్పిటల్ కు తరలించాలి. మిగిలిన కోట్ల మంది ప్రజలను స్వీయ నియంత్రణ పాటించమని కోరడంతోబాటు వారికి కావాల్సిన సరుకులు రోజు వారి అవసరాలయిన పాలు , కూరగాయలను వాలంటీర్ల ద్వారానే అందించేలా ఏర్పాట్లు చేయాలి ఆరోగ్య సమస్యలు అది కూడా హాస్పిటల్ కు వెళ్ళవలసిన అవసరం ఉన్న వారు వాలంటీర్ల సహకారంతో ఏర్పాట్లు చేయాలి. అపుడు మాత్రమే పరిస్థితి చాలా తొందరగా అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమములో ఉద్యోగులు , మధ్యతరగతి , ఆర్థికంగా స్థితి మంతుల నుంచి వారి అవసరాలకు అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేసి. మిగిలిన వారికి ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలి చైనాలో దాదాపు అందరిని సమానంగా చూసినారు అంటున్నారు.
వాలంటీర్లు , సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా నేటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అత్యవసరం. మాములు రోజులలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి తర్వాత తమ స్వంత పనులు చేసుకుంటూ 5 వేలు గౌరవ వేతనం తీసుకునేవారు నేడు వారికి ఇతర పనులు ఉండవు అత్యంత సమస్యాత్మక పని కాబట్టి వారికి కరోన స్వీయ నియంత్రణ చర్యలలో ఉన్నంత వరకు జీతాలను భారీగా పెంచి ఇవ్వాలి. ప్రభుత్వ సమాచారం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన 15 వేల మందిని గుర్తించింది వాలంటీర్లు. ఈ అనుభవం నేర్పుతుంది మిగిలిన వారిని కూడా వారే గుర్తించగలరు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని , వైరస్ పుట్టిన చైనా ఇలాంటి కార్యాచరణతో 40 రోజులలో అధిగమించినది. అదే కేవలం విదేశాల నుంచి వచ్చిన వారినుంచి వచ్చే ప్రమాదం ఉన్న భారతదేశం అందులో ఉష్ణ ప్రాంతమైన ఆంద్రప్రదేశ్ లో నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే చాలా తొందరగా సమస్యను అధిగమించేందుకు అవకాశాలు ఉన్నాయి. సమస్య పరిష్కారానికి సిత్తశుద్దితో కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా పరిశీలన చేయాలి !
 (*పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫారం
తిరుపతి)