*రేపు సింగరేణి వ్యాప్తంగా అన్ని బొగ్గు గనులు, కార్యాలయాలు బంద్ *ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంపై *సింగరేణిలో సంపూర్ణంగా ‘‘జనతా కర్ఫ్యూ’’ కు నిర్ణయం *18 ఓపెన్ కాస్ట్ గనులు, 27 అండర్ గ్రౌండ్ గనులు మూత
ఆదివారం (మార్చి 22వ తేదీ) తలపెట్టిన ‘‘జనతా కర్ఫ్యూ’’ కు స్పందనగా సింగరేణి యాజమాన్యం తన పరిథిలోని 18 ఓపెన్ కాస్ట్ గనులు, 27 అండర్ గ్రౌండ్ గనులు, సి.హెచ్.పి.లతో సహా అన్ని డిపార్డుమెంటులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం సెలవు దినం అయినప్పటికీ సాధరణంగా అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కొన్ని భూగర్భ గనులు యథావిధిగా పనిచేస్తుంటాయి. కానీ, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ కోసం భారత ప్రధాని ఇచ్చిన ‘‘జనతా కర్ఫ్యూ’’ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తిపై యాజమాన్యం ఆదివారం నాడు అన్ని గనులు, శాఖలు మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఓ.సి. గనుల్లో ఓ.బి. తొలగింపు పనిలో ఉన్న కాంట్రాక్టర్లు కూడా పనులను నిలిపి వేయాలని యాజమాన్యం ఆదేశించింది. దీనితో అత్యవసర సేవలు మినహా, సింగరేణి వ్యాప్తంగా మిగిలిన అన్ని శాఖలు ఆదివారం నాడు మూతపడనున్నాయి.
దీనితో పాటు కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు స్వీయ నియంత్రణతో తమ తమ ఇళ్లకే పరిమితమై ఉండాలని యాజమాన్యం కోరింది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులకు, ఉద్యోగులకు, సేవకులకు అభినందనలు, సంఫీుభావం తెలుపుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు మోగించాలని యాజమాన్యం కోరింది. సింగరేణీయూలందరూ కరోనా వ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని నిబంధనలను కఠినంగా పాటిస్తూ, అప్రమత్తంగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యంతో మెలగాలని యాజమాన్యం కోరింది.