తిరుపతి : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీవారి ఆలయం మూసివేయడం లేదు.
భక్తుల ప్రవేశాన్ని మాత్రం తాత్కాలికంగా నిలివేస్తున్నామని, వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ (పై ఫోటో) చెప్పారు.
శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తారు. పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా భక్తుల ప్రవేశం నిలిపివేస్తున్నారు.
ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు రాత్రి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి పంపుతారు. వారం తర్వాత సమీక్ష నిర్వహించి నిర్ణయాలు ప్రకటిస్తామని టిటిడి ఇవొ చెప్పారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. తిరుమలకు గురువారం ఒక కరోనా అనుమానితుడు వచ్చాడని ఆయన వెల్లడించారు.
ఆ వ్యక్తికి చెందిన బృందంలో మొత్తం 110 మంది ఉన్నారని, వారు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగి తిరుమలకు వచ్చారని ఆ బృందంలో కొందరికి గుర్తింపు కార్డులు లేవని అందుకే వారికి దర్శనం టోకెన్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.
ఆ వ్యక్తి అస్వస్థతకు గురికాగానే అతని ప్రాథమిక చికిత్స చేయించామని, అనంతరం రుయా ఆస్పత్రికి పంపిచామని ఆయన తెలిపారు.
భక్తుల ప్రవేశాన్ని రద్దు చేయగానే అలిపిరి టోల్ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా నివారించారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు.