రెండో రోజు కొనసాగుతున్న నిరవధిక దీక్షకు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, విద్యావేత్త పెరుగు విజయ వర్ధన్ రెడ్డి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. మద్దిలేటి యాదవ్, తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవీన్ రాజు యాదవ్, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె భాస్కర్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కారుమంచి, ఎఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేంద్ర, నగర అధ్యక్షులు శరత్, బిసి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు టి.జి. రజక శ్రీనివాసులు, రాయలసీమ ప్రజా సమితి ఉపాధ్యక్షులు బి. నాగ భూషణం, శారద డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేష్ మద్దతు తెలిపి మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ గారు మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ఫీజు రీయింబర్స్మెంట్, తక్షణమే పెండింగ్ లో ఉన్న 2018-19 సంవత్సరానికి సంబంధించి ₹1230కోట్లు, 2019-20 సంవత్సరానికి సంబంధించి ₹3600 కోట్లు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో విద్యార్థుల ఏ కాలేజీలో చదువుతున్నా ఆ ఫీజును పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుందనీ చెప్పి నేడు అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతున్న ఈ ఏడాది ఫీజులు ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు.
విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థులతో కలిసి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి బిసి విద్యార్థి యువజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి సురేష్ బాబు, బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రాయలసీమ నాయకులు శేషు పాల్గొన్నారు.