తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న జెఎసి నేతలు
రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్ డిమాండ్ చేశారు.
కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సమీపంలో శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద జెఎసి కో కన్వీనర్ ఆకుమళ్ల శ్రీధర్ అధ్యక్షత రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షను చేపట్టారు.
రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు, కన్వీనర్ ఎం మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2018-19 సంవత్సరం సంబంధించి 1224 కోట్లు, 2019-20 సంవత్సరం సంబంధించి 3,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వలన పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పై ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు. లేనిపక్షంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు వేదికగా ప్రారంభమైన ఈ నిరసన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
విద్యార్థి జెఎసికి జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు జె. రేఖ జిల్లా నాయకులు పవన్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్ నాయుడు, తరుణ్, హరినాథ్ ఆచారి, ఎం రవి తదితరులు పాల్గొన్నారు