భవన నిర్మాణాలకు, ఇతర కట్టడాలకు సంబందినించిన నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణకోసం, వారి సంక్షేమం కోసం, కేంద్రప్రభుత్వం 1996 లో, సమగ్రమైన చట్టాన్ని ప్రవేశపెట్టినది. ఆ చట్టాన్ని అమలుపరచడానికి కావలసిన నిధులను చేకూర్చడం లక్ష్యంగా కేంద్రం కట్టడాలకు అయ్యే ఖర్చులో 1% సెస్ గా నిర్మాణదారులవద్దనుంచి సేకరించడం కోసం, ఇంకొక చట్టాన్ని అమలు చేసినది.
ఆ రెండు చట్టాల నకళ్లను ఇక్కడ జతపరిచాను. రెండు చట్టాలను అమలు పరిచే బాధ్యత రాష్ట్రాల మీద ఉంది.
ఇటువంటి మంచి చట్టాలు అమలులో ఉన్నా, రాష్ట్రాల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా, అధికారులు కట్టడాలను 100% రిజిస్టర్ చేయడం లేదు. రిజిస్టర్ అయిన కట్టడాలమీద రావలిసిన సెస్ ఆదాయాన్ని సేకరించడంలేదు. వచ్చిన సెస్ ఆదాయం చాలామట్టుకు దుర్వినియోగం అవుతున్నది.
ఈ విషయాలను, కాగ్ తమ 4 /2013 రిపోర్టులో, పార్లమెంటరీ స్టాన్డింగ్ కమిటీ (16వ లోక్ సభ) వారు, వారి 2017-18 రిపోర్టులోను, సుప్రీం కోర్టు వారు WP(సి) 318/2006 లో 19-3-2018 న ఇచ్చిన జడ్జిమెంట్ లోను విపులంగా చర్చించి రాష్ట్రాలకు తగిన ఆదేశాలను ఇవ్వడం జరిగింది.
అయినా, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పక్షంలో ఉండడం వలన, మీద సూచించిన రెండు కేంద్రప్రభుత్వ చట్టాల అమలులో ఇంకా నిర్లక్ష్యత కనిపిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇందువలన లక్షలాది మంది నిర్మాణ కార్మికుల హక్కులకు అపారమైన నష్టం కలుగుతున్నది. చట్టాలలో సూచించిన సంక్షేమ పథకాల లాభాలు వారికి అందడం లేదు.
మన రాష్ట్రం సంగతికి వస్తే, నిర్మాణ కార్మికుల సంక్షేమం విషయంలో అధికంగా ఉదాసీనత కనిపిస్తున్నది.
జతపరిచిన రాష్ర ఆర్ధిక లెక్కల ఆధారంగా, మన రాష్ట్రంలో, 2011 సెన్సస్ ప్రకారం 80 లక్షలమంది నిర్మాణ కార్మికులు ఉండగా, రాష్ట్ర నిర్మాణకార్మికుల వెల్ఫేర్ బోర్డు లెఖ్ఖల ప్రకారం 18.16 లక్షలమంది కార్మికులు మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నారు. అదే రాష్ర ఆర్ధిక లెక్కల ప్రకారం, రాష్ట్రములో కట్టడాల విలువ 2018 లో 54,677 కోట్ల రూపాయలు ఉండడం వలన, అన్ని కట్టడాలు రిజిస్టర్ అయి ఉంటే, సెస్ ఆదాయం (1%) ఉండడం వలన, 2018 లో 547 కోట్ల రూపాయలు రావలసిఉంది. కాని, చట్టాలు అమలు అయిన సంవత్సరం నుంచి 30-9-2018 వరకు (అంటే 22 సంవత్సరాలు) కేవలం 2,374 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు జమ అయినది. అధికారుల అవినీతివలనో, నిర్లక్ష్యం వలనో, ఇందు మూలంగా ఎన్నో కట్టడాలు రిజిస్టర్ అవడం లేదని తెలుస్తున్నది.
మీది సూచించిన విషయాలను రాష్ట్ర ఆర్ధిక గణాంక శాఖ వారిచేత ఇంకా లోతుగా అధ్యయనం చేయిస్తే, అసలు నిజాలు బయటకు వస్తాయి.
సేకరించిన 2,374 కోట్ల రూపాయల సెస్ ఆదాయంలో, రాష్ట్ర కార్మిక సంక్షేమ విభాగం కేవలం 519 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసినదని, జతపరిచిన రిపోర్టుల ద్వారా తెలుస్తున్నది. అలాగ జమ అయిన నిధులు నిజంగా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించబడ్డాయా, లేక కొంతవరకు దుర్వినియోగం అయ్యాయా అనే విషయాన్ని సుప్రీం కోర్ట్ వారు విపులంగా పరిశీలించారు. వారి జడ్జిమెంట్ లో సూచించిన విషయాలవల్ల తెలుస్తున్నదేమంటే, నిధులు చాలా మట్టుకు కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించబడలేదు. ఇందుకు కారణం, ముందున్న ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం మీద దృష్టి పెట్టకపోవడమే.
బాధాకరమైన విషయమేమిటంటే, మీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి చర్యలను ఇంకా తీసుకోకపోవడం.
ఉదాహరణకు, కేంద్ర చట్టాల ప్రకారం, రాష్ట్ర స్థాయిలోఒక కార్మిక సంక్షేమ సలహా కమిటీ నియమించబడాలి. ఆ కమిటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు ఉండాలి. కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసి, కట్టడాల రెజిస్ట్రేషనుల మీద, సేకరించిన సెస్ ఆదాయం మీద, నిధులను ఎంతవరకు కార్మికుల సంక్షేమం మీద ఖర్చు చేశారు అనే విషయం మీద, సంక్షేమ పథకాల అమలులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలమీద చర్చించి ప్రభుత్వ విభాగాలకు తగిన సలహాలను ఇవ్వవలసిఉంది. కాని అటువంటి కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఆ కమిటీలో నిర్మాణ కార్మికులకు స్థానం కల్పించబడ లేకపోవడం బాధాకరం. కమిటీ వారి వెబ్సైటులో కట్టడాల రెజిస్ట్రేషనుల గురించి కాని, సేకరించిన సెస్ ఆదాయం గురించి కాని, ఖర్చు చేసిన తీరు గురించి కాని, కార్మికుల దరఖాస్తుల విషయంలో జరుగుతున్న జాప్యం గురించికాని పూర్తి సమాచారం లేకపోవడం, కార్మిక సంక్షేమ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
నేను విశాఖ జిల్లాలో, కొంతమంది నిర్మాణ కార్మికుల సమస్యలగురించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను. మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిన చట్టాల అమలులో నిర్లక్ష్యత స్పష్ఠముగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి నిర్మాణ కార్మికుని కుటుంబానికి, చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే, పిల్లల చదువుల ఖర్చుల నుంచి, మహిళల, కుటుంబం సంక్షేమ నిధులవరకు, ప్రమాదాలకు గురి అయిన కార్మికుల ఆసుపత్రి ఖర్చుల వరకు, ఉపాధి మెరుగు పరిచే శిక్షణ పథకాలవరకు, కార్మికుల భద్రత వరకు కావలిసిన నిధులను, సెస్ సేకరణ ద్వారా సమకూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ఒక్క నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ చట్టమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కార్మికుల సంక్షేమం కోసం ఇతర చట్టాలను కూడా అమలు చేసినది.
ఉదాహరణకు, కార్మికుల ప్రోవిడెంట్ ఫండ్ చట్టం, భీమా చట్టం, ప్రమాదాలకు గురి అయిన కార్మికులకు నష్టపరిహారం కలిగించే చట్టం, గ్రాట్యూయిటీ చట్టం, కనీస వేతనం చట్టం, మహిళల ప్రసూతి సంక్షేమ చట్టం వంటి ఎన్నో చట్టాలు అమలులో ఉన్నా, రాష్ట్ర కార్మిక సంక్షేమ విభాగం వారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల, పరిశ్రమదారుల ఒత్తిళ్లకు లొంగి, కార్మికులకు అన్యాయం చేస్తున్న విషయం, ఉదాహారణలతో నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, స్పందన కనిపించలేదు.
ఈ నేపథ్యంలో, క్రింద సూచించిన విధంగా, మీరు కార్మిక సంక్షేమ విభాగానికి ఆదేశాలు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను.
- రాష్ట్ర స్థాయి సంక్షేమ కమిటీలో నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులను మెంబర్లుగా చేర్చాలి. కమిటీ నెలకొకమాటు సమావేశమవ్వాలి. సమావేశం చర్చించిన వివరాలను వారి వెబ్సైటులో తెలుగులో అందరికీ అర్ధమయినట్లు ప్రకటించాలి
- అధికారిక వెబ్సైటులో కట్టడాల రెజిస్ట్రేషనుల మీద, సేకరించిన సెస్ ఆదాయం మీద, నిధులను ఎంతవరకు కార్మికుల సంక్షేమం మీద ఖర్చు చేశారు అనే విషయం మీద, కార్మికుల దరఖాస్తుల పరిశీలన మీద వివరాలను తెలుగులోప్రతినెలా ప్రకటించాలి
- ఇందుకు సంబంధించిన అధికారులు జిల్లాలవారీగా సర్వే చేసి మూడునెలలలో రాష్ట్రవ్యాప్తంగా చట్టం క్రిందకు వచ్చే అన్నీకట్టడాలను గుర్తించి రిజిస్టరు చేయాలి. చట్టాలను ఉల్లంఘించిన అధికారులమీద, రిజిస్టర్ చెయ్యకుండా కట్టడాలు చేస్తున్న పెట్టుబడుదారుల మీద చర్యలు తీసుకోవాలి
- అలాగ రిజిస్టర్ అయిన సెస్ నిధులను 15 రోజులలో కార్మిక సంక్షేమ విభాగానికి బదలాయింపు చేసే విధానాన్ని తత్క్షణం ప్రవేశపెట్టాలి.
- రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు చట్టాలకు అనుగుణంగా రిజిస్టర్ అవడం లేదు. అందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెలరోజులలో 100% నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయినట్లు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఉదాసీనత చూపిన అధికారులమీద చర్యలు తీసుకోవాలి
- నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ చట్టమే కాకుండా, మీద సూచించిన ఇతర చట్టాల అమలును కూడా ఆలస్యం చేయకుండా చేపట్టాలి. కార్మికులకు రావలసిన ప్రోవిడెంట్ ఫండ్, గ్రాట్యూయిటీ, భీమా, కనీస వేతనం వంటి హక్కులపరిరక్షణ కోసం వారి పేర్లు అందుకు సంబంధించిన విభాగాలలో నమోదు అయినట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ విభాగం బాధ్యత తీసుకొని ప్రయత్నం చేయాలి. సరిగ్గా ఈ విషయంలో పర్యవేక్షణ చేయని అధికారులమీద చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కార్మిక హక్కుల పరిరక్షణ చట్టాలను అమలు చేయడం వలన, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మికుల సంక్షేమం కోసం ప్రయతించే ఒక మంచి అవకాశం లభించినది. ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని అన్ని విధాలా కార్మికులకు, వారి కుటుంబాలకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రంగాలలో ఉన్న లంచగొండితనాన్ని నిర్ములించాలి.
ఈ విషయంలో మీరు ఆలశ్యం చేయకుండా తగిన చర్యలను తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది.