వైద్య రంగానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతున్నది. వైయస్సార్ విలేజ్ క్లినిక్స్ పేరిట హెల్త్ సబ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఈ విలేజ్ క్లినిక్ లు 24 గంటలపాటు పాటు చేస్తాయి. ఇందులో సేవలందించేందుకు ఒక నర్సు, ఒక ఏ ఎన్ఎం రోజంంతా అందుబాటులో ఉంటారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తనను కలుసుకున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసకున్న పలు పథకాలను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ఈసందర్బంగా రాష్ట్రంలో ప్రారంభకానున్న మరికొన్ని వినూత్న పథకాల గురించి వారికి ఆయన వివరించారు. ఇందులో ప్రధానమయినది విలేజ్ క్లినిక్ (సబ్ సెంటర్లు).
ముఖ్యమంత్రి వివరించిన మరిన్ని విశేషాలు
ఈ సబ్ సెంటర్లలో 51 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతారు. రోగి ఆరోగ్య పరిస్థితి సబ్‌సెంటర్ పరిధి దాటితే నేరుగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. నర్స్ నేరుగా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తే… వెంటనే ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలా అన్ని చర్యలూ తీసుకుంటారు.
ఇప్పటికే ప.గో. జిల్లాల్ ప్రారంభించిన పైలట్ ప్రాజక్టు కింద ఆరోగ్య శ్రీ పరిధిలో 2వేల రోగాలకుచికిత్స వసతి అమలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అన్నిజిల్లాల్లో ఇదే సంఖ్యలో రోగాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తున్నారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పతులను నాడు–నేడు కింద అభివృద్ధిచేస్తున్నారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాసుపత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను 27కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.