తెలుగుదేశం నాయకులు తన మీద నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కియా ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలిపోతున్నదనే రాయిటర్ వార్త సంస్థ రాసిన వార్త రాష్ట్రంలో పెను తుఫాన్ సృష్టించిన సంగతి తెలిసిందే. దీనమీద పార్లమెంటులో కూడా రచ్చ జరిగింది. వైసిపివిధానాల వల్ల,స్థానిక నాయకులు వత్తిళ్ల వల్ల కియా ఈ నిర్ణయానికి వచ్చినట్లు , దీనితో కంపెనీని తమిళనాడుకు తరలించేందుకు అక్కడ ఎఐడిఎంకె ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఈ వార్త సారాంశం.పైకి కంపెనీ అధికారికంగా ఖండించినా రాయిటర్ తన వార్తను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో తన మీద విమర్శలు చేయడాన్ని ఎంపి మాధవ్ ఖండించారు. ఆయన కౌంటర్ యధావిధిగా…
నేను చేసిన నేరమేమిటి?
భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రయత్నించడమే నేను చేసిన నేరమా ?
భూములు కోల్పోయిన 400 మంది రైతు కుటుంబాలకు నష్టపరిహారం, ఉపాధి చూపించాలని గట్టిగా డిమాండ్ చేయడమే నేను చేసిన నేరమా?
తమిళనాడు వాళ్ళకే కాకుండా మా అనంతపురం జిల్లా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం నేను చేసిన నేరమా ?
కియా ఫ్యాక్టరీ తరలిపోతుంది అంటూ పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బూటకపు ప్రసంగాన్ని అడ్డుకోవడం నేను చేసిన నేరమా ?
ధర్మవరంలో ఫ్యాక్ష నిజాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేయడానికి ప్రయత్నించినప్పుడు ఎస్ ఐ గోరంట్ల మాధవ్ నిజాయితీ, సమర్థవంతమైన అధికారి అని నిండు బహిరంగసభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పొగడ్తల గుప్పించిన విషయం వాస్తవం కాదా ?
అనంతపురంలో పోలీస్ అధికారిగా అక్రమ వడ్డీ వ్యాపారులను నడి రోడ్డుపై అర్థనగ్నంగా ఊరేగించే కొట్టడమే నేను చేసిన రౌడీయిజమా?
ధర్మవరంలో మట్కా రాయుళ్లను జిల్లా నుండి బహిష్కరించి , బడుగు బలహీన వర్గాలు ఆ మహమ్మారి లో చిక్కుకోకుండా చేయడమే నేను చేసిన పాపమా?
కరువు ప్రాంతమైన రాయలసీమలో హైకోర్టుతో పాటు, మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని సీఎం జగన్ ను కోరడమే ప్రజా ద్రోహమా
అనంతపురం జిల్లా ప్రజలను ఎవరిని అడిగినా నా నిజాయితీ గురించి తెలుస్తుంది. ఒక్కసారి సర్వే చేయించండి బాబు గారు. ఇకనైనా దుష్ప్రచారం మానుకోండి. ప్రజాసేవకు మాతో కలిసి రండి.