కేరళ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని చేసింది. మార్కెట్లో దొరికే నీళ్లబాటిల్ ధర రు. 13 మించడానికి వీల్లేదని చెప్పేసింది. అంతేకాదు, ఈ నియమాన్ని బాట్లింగ్ కంపెనీలన్నీ కచ్చితంగా అమలుచేసేందుకు వీలుగా నీళ్లబాటిల్స్ ను (బాటిల్డ్ వాటర్ )ని నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చేసింది.
దేశంలో ప్రస్తుతం ఏ కంపెనీదయినా సరే నీళ్ల బాటిల్ ధర రు. 20 గా ఉంది. ధరను రు,13 దగ్గిర నిర్ణయిస్తూ కేరళ ఆహార విభాగం తీసుకువచ్చిన ప్రతిపాదన మీద ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం నాడు సంతకం చేశారు. అంతా కచ్చితంగా తాగి తీరవలసిన నీటిని నిత్యావసరం సరకుగా గుర్తించడం కేరళ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం.
నీళ్ల బాటిల్ ధరను రు. 20 చేసి కంపెనీలను ప్రజల దాహాన్ని ఇంతకాలం సొమ్ము చేసుకుంటూ వచ్చాయి. ముడిసరకు లభ్యత(నీరు) ను బట్టి చూస్తే ఈ ధర చాలా ఎక్కువ అని కేరళ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నది.
బాట్లింగ్ కంపెనీలేవీ వినలేదు. 2018లో ప్రభుత్వం బాటిల్డ్ వాటర్ తయారీదారులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. అపుడు ప్రతిపాదించిన ధర రు. 12.
అయితే, చాలా కంపెనీలు వ్యతిరేకించడంతో ఈ ధరను అమలుచేయలేకపోయింది. ఇపుడు బాటిల్డ్ నీళ్లను నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చడంతో ధర నియంత్రణ మీద ప్రభుత్వానికి అజమాయిషీ లభించింది. దీనితో బాటిల్ ధరను రు. 13 గా నిర్ణయించింది.
ఈ విషయాన్ని ఆహార మంత్రి తిలోత్తమన్ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన ధరకే నీళ్ళ బాటిల్స్ ని అమ్మాలని చెబుతూ ఈబాటిల్సన్నంటికి బిఐఎస్ ప్రమాణాలు పాటించడం తప్పని సరి ఆయన చెప్పారు.
కంపెనీలు రు. 15 చేయాలని సూచించాయని ఇది ప్రభుత్వానికి ఆమోదంయోగ్యం కాదని ఆయనచెప్పారు. ‘నీళ్ల బాటిల్స్ ని చాలా తక్కువ ధరకు అమ్మవచ్చని మాకు తెలుసు. వినియోగదారులను నీళ్ల పేరుతో కంపెనీ పీక్కుతుంటాయి.చాలా మార్జిన్ తీసుకుంటున్నాయి. ఇలాంటిదోపీడిని చూస్తూ మౌనంగా ఉండటంసాధ్యంకాదు, ’అని ఆయనచెప్పారు.
ప్రభుత్వం నిర్ణయాన్ని కేరళ బాటిల్డ్ వాటర్ తయారీ దారుల సంఘంస్వాగతించింది. ఈ సంస్థ అధ్యక్షుడు ఎం ఇ మహ్మద్ మాట్లాడుతూ ధర తగ్గించేందుకు తమసంఘం సుముఖంగా ఉందని, అయితే, 2012లో బహుళ జాతి కంపెనీలన్నీ కలసి బాటిల్ ధర రు. 20 గా ఉండాలని నిర్ణయించాయని ఆయన చెప్పారు.
ఇదిఇలా ఉంటే కేరళ ప్రభుత్వం తన అనుబంధ సంస్థ ద్వారా రు. 10 కే లీటర్ వాటర్ బాటిల్ విక్రయిస్తూ ఉంది. కేరళలో మొత్తంగా 200 బాటిల్డ్ వాటర్ తయారు చేసే కంపెనీలు న్నాయి.