కర్నూలు: కర్నూలులో అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ మీద ఈ రోజు పట్టణంలోని రాజ్‌విహార్ సర్కిల్ నుంచి కోట్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. అనంతరం సభలో ఆయన ప్రసంగించారు.
ఒక విద్యాసంస్థలో ఇలాంటి దారుణాలు జరిగడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థే నిందితులకు అండగా ఉన్నపుడు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని పవన్ప్రశ్నించారు.
బాలిక అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని పవన్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు అప్పగించకపోతే మానవహక్కుల కమిషన్‌కు తానే ఫిర్యాదు చేస్తానన్నారు.
ఈ కేసు విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు ఉన్న స్థానిక నేతలు వల్ల వారు ఆగిపోతున్నారని చెప్పారు. ఆ బాలిక కుటుంబానికి న్యాయం జరగనప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని పెట్టినా నిష్ప్రయోజనమని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ ఇంకా ఏమన్నారంటే…
‘కర్నూలు అత్యాచారం ఘటనని ఒక్కరూ పట్టించుకోవం లేదు. హైదరాబాద్ శివారులో హత్యాచారానికి గురై దిశ ఘటనపై స్పందించారు. కాని, ఇప్పుడెందుకు మాట్లాడరు? ఆడబిడ్డకి అన్యాయం జరిగింది. మనకీ ఆడబిడ్డలున్నారు. నేడు ఎవరూ ముందుకు రాకపోతేె ఎలా? రేపు మన ఇంట్లో ఏం జరిగినా ిలాగే ఎవరూ పట్టించుకోరు. ఒక కులం, మతం అనవసరం. తప్పుచేసిన ఎవరికైనా శిక్ష పడాల్సిందే.
దిశ నిందితుల మాదిరిగా ఎన్కౌంటర్ చేయమనడం లేదు.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
ఈ విషయంలో సీఎం జగన్ బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆయనకు చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక నేతలు కేసును ప్రభావితం చేస్తున్నట్లు తెలిసింది. సీబీఐ విచారణకు అప్పగించకపోతే కర్నూలులో ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చుంటాను. అప్పటికీ స్పందించకపోతే పరిస్థితి ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఆడబిడ్డల మాన ప్రాణాలను రక్షించలేనపుడు దిశలాంటి చట్టాలు ఎన్ని చేసినా నిష్ప్రయోజనమే. రెండు చేతులు జోడించి కోరుతున్నా.. దయచేసి బాలిక కుటుంబానికి న్యాయం చేయండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి. రాష్ట్ర డీజీపీ, జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించాలి.