2015 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధాని నగరంగా “నోటిపై” చేస్తూ ఉత్తర్వు జారీ చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పార్లమెంటుకు తెలియజేశారు.
అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ఎందుకు “నోటిపై” చేయలేదంటూ ప్రశ్నిస్తూ వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మౌనం వహించారు.
కానీ, బిజెపి, జాతీయ ప్రతినిథి జి. వి.ఎల్.నరశింహారావు రంగ ప్రవేశం చేసి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధాని అని “నోటిపై” చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు శిలాశాసనం కాదని, ప్రస్తుత ప్రభుత్వం మరొక ఉత్తర్వు జారీ చేసుకొనే అధికారం ఉన్నదని జివిఎల్ జ్ఞానోదయం కలిగించారు.
అమరావతే రాజధానంటూ బిజెపి రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందంటూనే శల్యసారధ్యం చేస్తున్న జీ.వి.ఎల్. తో ఈ మాటలను ఎవరు మాట్లాడిస్తున్నారు?
పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కదా! అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసింది, దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే కదా! నాటి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి కూడా భాగస్వామే కదా! అమరావతి రాజధాని అంటూ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేయడంలో బిజెపి భాగస్వామే కదా! రాజధాని నిర్మాణానికి రు.1500 కోట్లు నిథులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా! మరి, నిర్మాణంలో ఉన్న అమరావతి రాజధానిని పరిరక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదన్నట్లు మాట్లాడుతున్న జి.వి.ఎల్. గారి నోటికి బిజెపి కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం తాళం వేయడం లేదంటే అర్థమేంటి?