రాజమండ్రిలో వస్తున్న మొట్టమొదటి ‘దిశ’ పోలీస్ స్టేషన్

అమరావతి,3 ఫిబ్రవరి: దిశ ఘోరం తర్వాత ప్రజల్లో ముఖ్యంగా యువతీయువకులలో దిశ చట్టం గురించి అవగాహన పెంచి, ఈ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ‘దిశ’ పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతున్నది.  ఈనెల 7వ తేదీన రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తున్నారు.  పోలీస్ స్టేషన్ తో పాటు  ప్రత్యేక యాప్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ విషయం వెల్లడించారు. ఈ ఏర్పాట్లు మీద ఆమె ఈ రోజు  అధికారులతో సమీక్షించారు.
మహిళలమీద దిశ లాంటి అత్యాచారాలు జరగుకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదట్టమయిన చర్యలు తీసుకుంటున్నది. దోషుల మీద కఠిన చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం 2018 నవంబర్ లోనే తీసుకువచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తర్వాత చట్టం కఠినంగా అమలు జరిగేలా చూసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్  కృతిక శుక్లా ( ఐఎఎస్ ), అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపికా (ఐపిఎస్) అధికారులను నియమించింది.
మహిళల మీద లైంగిక దాడులు జరిగినపుడు  21 రోజులలో విచారణ పూర్తయ్యేలా ఈ చట్టం  నిర్దేశించింది. అంతేకాదు, నిందితులకు మరణ శిక్ష విధించే ఏర్పాటు కూడా చేసింది. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2019 డిసెంబర్ 13 ఆమోదించింది.
ఈ నెల 7వ తేదీన రాజమండ్రిలో సీఎం దిశ పోలీస్ స్టేషన్, ఒన్ స్టాప్ సెంటర్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని  నీలమ్ సాహ్ని తెలిపారు. తదుపరి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపి) ప్రారంభించడంతో పాటు దిశ చట్టానికి సంబంధించి పోలీస్, వైద్య ఆరోగ్యం, ఒన్ స్టాప్ కేంద్రాల సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ సిబ్బంది, పలువురు డాక్టర్లు, విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
అందుకు సంబంధించిన కార్యక్రమాలను రాష్ట్ర స్థాయి శాఖలతో పాటు జిల్లా కలెక్టర్ నేతృతంలో జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సక్రమంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంకా ఇందుకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో హోం, స్త్రీ శిశు సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులు కిషోర్ కుమార్, కె.దమయంతి, సిఐడి పోలీస్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి, దిశ చట్టం పోలీస్ ప్రత్యేక అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు.

https://trendingtelugunews.com/uncategorized/chandrababu-naidu-antidalit-alleges-ysrc-mla-merugu-nagarajuna/