అమరావతి మీద గద్దల్లా వాలి భూమి తన్నుకుపోయారు: మంత్రి బుగ్గన

 ఆంధ్రప్రదేశ్ లోె మూడు రాజధానుల ఏర్పాటు కు సంబంధించిన రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతి రాజధాని ప్రాంతం (CRDA)లో భూముల కొనుగోలు ఎలా జరిగిందో వివరాలు (ఇన్ సైడర్ ట్రేడింగ్ ) వెల్లడించారు.
తెలుగుదేశం ప్రముఖులు,వారి బంధువులు రాజధాని గురించి సమాచారం ముందుగానే తెలిసినందునే అంతా ఒకే కాలంలో భూములు కొనుగోలు చేయగలిగారని లేకపోతే, ఎక్కడో అనంతపురం జిల్లాకు చెందిన శాసన సభ్యులు పయ్యావుల కేశవ్, రఘనాథరెడ్డి భూములు అమరావతి ప్రాంతానికి వచ్చి 2014 లోనే ఎలా కొంటారని ఆయన ఆశ్చర్య పోయారు. ఈ భూముల కేటాయింపులో కూడా అనుమానాలకు తావిచ్చే విధంగా నిర్ణయాలు జరిగాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తేదీ 2014 జూన్‌ 2 నుంచి రాజధాని ప్రకటన తేదీ 2014 డిసెంబరు నెలాఖరు వరకూ ఆరు నెలల కాలంలో ఈ భూముల కొనుగోలు జరిగింది.
తెలుగుదేశం ప్రముఖులు, వారి కంపెనీలు, వారి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అమరావతి పరిసరాలలో విపరీతంగా భూములు కొన్నారు.
వారంతా ఇదే కాలంలోఎలా కొంటారు? రాజధాని అక్కడ రావచ్చని వారికి సమాచారం అందించారు. అందుకే అమరావతి పరిసరాలలో వాలి భూములు కొనడం ప్రారంభించారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించారు.
బుగ్గన చెప్పిన విషయాలు
*ఇలా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు సొంత పేర్లు, బినామీ పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారను.
*చంద్రబాబు చెబుతున్నట్లుగా అక్కడ ఇపుు ఎకరా రూ.10 కోట్ల ధర ఉంది. ఆ ప్రకారం లెక్కిస్తే 4,070 ఎకరాల విలువ రూ.40,700 కోట్లవుతుంది
*గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేరుతో కొనుగోలు చేశారు.
*ఎక్కడో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ఇక్కడ విజయవాడకు 20–30 కిలోమీటర్ల దూరంలోని మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు వచ్చి భూములు కొన్నారు.
*అప్పటి మంత్రి నారాయణ తన సంస్థలలో పనిచేసే ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్‌ బినామీల పేరుతో విపరీతంగా భూములుకొన్నారు.
వేమూరి రవికుమార్ అనే నారా లోకేశ్‌ బినామీగా వందల ఎకరాల భూములు కొన్నారు.
*నాటి రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మురళీమోహన్, యార్లగడ్డ రవికిరణ్, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్‌ ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్‌ పేర్లతో భూములు కొనుగోలు చేశారు.
*నాటి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గోరంట్ల ఝాన్సీలక్ష్మీ పేరు మీద కొనుగోలు చేశారు.
*ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో పాటు లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములనూ కూడా వదల్లేదు. సీఆర్‌డీఏ సరిహద్దులు మార్చారు.
కోర్‌ రాజధానిని జూలై 2015లో 395 చ.కి.మీలకు ప్లాన్‌ చేశారు. కానీ, 2016లో దానిని 217 చ.కి.మీ.కు తగ్గించారు. అంటే తమ భూమిని ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వకుండా కాపాడుకుని ధరలు పెరిగాక   బాగా లబ్ది పొందడమే లక్ష్యం.
*రింగ్‌ రోడ్డు ఎలైన్ మెంటును కూడా వదల్లేదు. వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.
*అనంతవరంలో లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములను రాజధానికి ఇచ్చినట్లు రాసుకుని ప్లాట్లు తీసుకున్నారు.
*ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్‌ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు తీసుకున్నారు.
*28వేల మంది రైతులు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇస్తే 14వేల మంది రైతులు ఇప్పటికే భూములు అమ్ముకున్నారు. వాళ్లకు ప్లాట్లు ఇస్తే 8వేల లావాదేవీలు జరిగాయి.
దీనిని ఏమంటారు?  రాజధాని నిర్మాణమంటారా లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంటారా?
టీడీపీ వారే చెప్పాలి అని బుగ్గన ప్రశ్నించారు.

https://trendingtelugunews.com/telugu/breaking/amaravati-land-allocations-scam-buggana-rajendranath-ap-assembly/