అమరావతి : ఈరోజు రాత్రి 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం జరుగబోతున్నట్లు తెలిసింది. అధికారికంగా సమాచారం మా త్రం లేదు. రాజధాని వికేంద్రీకరణ బిల్లలు కౌన్సిల్ ఆమోదానికి ఎదురుచూస్తున్న సమయంలో ఈ క్యాబినెట్ సమావేశం అని వార్త వచ్చింది.. అందుకే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశార ని భోగట్టా. దీనితో ఇది శాసన మండలిని రద్దు చేసేందుకే ననే అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారీటీ ఉండటం, వైసిసికి కేవలం 9 మంది సభ్యులే ఉండటం వల్ల ముఖ్యమయిన బిల్లు చర్చకు వచ్చినపుడుల్లా టిడిపి సమస్యలు సృష్టించవచ్చినే అనుమానంతో కౌన్సిల్ నే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చర్య తీసుకుంటున్నారని వినపడుతూ ఉంది. నిజానికి సమావేశంలో తొలిరోజున జరిగే క్యాబినెట్ లోనే ఈ ప్రయత్నం జరుగుతుందని అనుకున్నారు. ఎందుకో అది చర్చకు రాలేదు. ఇపుడు క్యాబినెట్‌ను అత్యవసరంగా సమావేశంపర్చి రేపు మండలి రద్దు బిల్లును శాసనసభలో పెట్టె అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.
గత రెండురోజులుగా కౌన్సిల్ రద్దుకు సంబంధించిన న్యాయపరమయిన అంశాలను పరశీలించారని, కౌన్సిల్ ను సమావేశాలలో నే రద్దు చేసే అవకాశం ఉందని నిపుణులు సలహా ఇచ్చినందున ఈ రాత్రి క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉందని చెబుతున్నారు.
ఇలా చేయడం తొందరపాటు చర్య అనే అభిప్రాయంచాలా మంది వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి ముందుకు వెళ్లాలనే భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి మండలిని ఎపుడో ఇలాంటి పరిస్థితులలోనే నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేశారు. అపుడాయన తనకు అడ్డువస్తున్న మండలిని నిర్వహించడం వేస్టు అని డబ్బు దండగ అని రద్దు చేశారు. రద్దయిన మండలిని దాదాపు ఇరవై సంవత్సరాలత తర్వాత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ 2007 పునరుద్ధరించారు.
175 మంది సభ్యులున్న అసెంబ్లీలో 151 మందిఎమ్మెల్యేలను గెలుచుకున్న తనని ఎన్నికల ద్వారా గెలవని కౌన్సిల్ అడ్డుకోవడమేమిటనే భావం, నాటి ఎన్టీరామారావు లాగానే, ఇపుడు జగన్ లో కూడా బలంగా ఉంది.
58మంది సభ్యలున్న (50 ఎన్నికైన వారు, 8 నామినేటెడ్) కౌన్సిల్ వైసిపి సభ్యులు కేవలం తొమ్మది మందే. తెలుగుదేశం పార్టీకి 34 మంది ఉన్నారు. ఇక మిగతా పార్టీలు కూడా టిడిపికే మద్దతునిస్తాయి.
అందువల్ల బిల్లులను సులభంగా అడ్డుకోగలవు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులుచూపి ఆయన కౌన్సిల్ ను రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారని అందుకే క్యాబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేస్తున్నారని చెబుతున్నారు.
వైసిపికి చెందిన సభ్యలకు ఇతర ప్రతిష్టాకరమయిన పదవులు ఇచ్చే అవకాశం ఉంది.