(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడింట ఒక భాగంగా విస్తీర్ణం మరియు జనాభాగా ఉన్న రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు హైపవర్ మంత్రుల కమిటీ నివేదికలో స్థానం కల్పించాలని కోరుతున్నాం.రాష్ట్రంలో పరిపాలనను వికేంద్రీకరంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాయలసీమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఇది సరైన సమయమనే ఉద్దేశంతో హైపవర్ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకురావాలనుకుంటున్నాం. రాయలసీమ ప్రధాన డిమాండ్లు:
1. రాయలసీమలో హైకోర్టుతో పాటు మినీ సచివాలయం, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. రాయలసీమను పది జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. సీమలోని ప్రధాన పట్టణాలను స్మార్ట్ సిటీలుగా, ఒక పట్టణాన్ని విశాఖపట్నం, విజయవాడ స్థాయలో కీలక నగరంగా అభివృద్ధి చేయాలి.
2. 35 సెక్రటేరియట్ డిపార్ట్మెంటు లను , 132 హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ ను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమంగా విభజించాలి.
3. విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ లోని 89 ప్రభుత్వ కంపెనీలు మరియు కార్పోరేషన్ లను, 10 వ షెడ్యూల్ లోని 107 రాష్ట్రస్థాయి సంస్థలు, శిక్షణా సంస్థలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాగా వచ్చేవాటిని మూడు ప్రాంతాలలో సమంగా నెలకొల్పాలి.
4. విభజన చట్టం ప్రకారం 13 వ షెడ్యూల్ లో కీలక విద్యాసంస్థలు ఎయిమ్స్, వ్యవసాయ విద్యాలయాలను రాయలసీమలో నెలకొల్పాలి. రైల్వేజోన్ ను గుంతకల్లులో, ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఏర్పాటు చేయాలి. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజిని ముఫ్పై కోట్లరుపాయలతో సమగ్రంగా చేపట్టాలి.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/english/features/water-should-also-be-decentralized-among-various-regions-of-andhra/
5. ఎదో ఒక పద్దతిలో సీమ ప్రాంతానికి 500 టి.యం.సీలు కేటాయించడం పాలకుల కనీస బాధ్యత. తరతరాలుగా అన్ని విధాల నష్టపోతు వచ్చిన సీమకు ఇకనైనా పరిష్కారం కావాలి.పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్న విధంగానే ఈ రాష్ట్రంలో సమానంగా ప్రాంతాలకు నీళ్ళను కూడా వికేంద్రీకరణ చేసేందుకు తక్షణం జల నిపుణులతో మరింత చర్చించి అసెంబ్లీలో చట్టం చేయాలి. అపుడే సమగ్ర వికేంద్రీకరణ అవుతుంది.
6. రాయలసీమలోని సహజవనరులు, ఖనిజ వనరుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి, అర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహక విధానం ప్రకటించాలి. మినరల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ ను సీమలో నెలకొల్పాలి.
అనంతపురము జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఐ.టి అభివృద్ధి, బి.ఇ.యల్, చిత్తూరు జిల్లాలో మన్నవరం బి.హెచ్.ఇ.యల్, ఐ.టి అభివృద్ధి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు లో విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల మరమ్మత్తు కేంద్రం, టెక్స్ టైల్ క్లస్టర్, కడపలో పారిశ్రామిక క్లస్టర్, సిమెంట్ సెజ్, హార్టికల్చర్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి.
7.సీమలో రహదారుల అనుసంధానం, రైల్వే ప్రాజక్టులు, విమానయాన సౌకర్యాలు మెరుగు పరచాలి.
8.రాయలసీమలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశం ఉంది. చారిత్రక, ఆధ్యాత్మిక, ఎకో టూరిజం అభివృద్ధికి విశేషంగా అవకాశం ఉంది. సీమలోని సాహిత్య, సాంస్కృతిక, కళా వికాసానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ శైలంలో ఏర్పాటు చేయాలి.
9.రాయలసీమలో జీవ వైవిధ్యం పరిరక్షణకు కృషిచేయాలి. నల్లమల ఎర్రమల అడవులు కాపాడాలి. పెన్నా దాని ఉపనదులను పునరుజ్జీవనం చేయాలి. దక్షిణాదిలోని కరువుజిల్లాలను కలిపి ఎడారి నివారణ పథకం అమలుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. మేఘమదనం ద్వారా వర్షాలకోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలి. సీమలోని వాతావరణ మార్పుల అధ్యయనానికి ప్రత్యేక పరిశోధన కేంద్రం ఉండాలి. ఎర్రచందనం, బట్టమేక, కలివికోడిల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
10.రాయలసీమ ప్రాంతీయ మండలిని రాజ్యాంగ చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో బడ్జెట్ పంపకం, విద్యా ఉద్యోగాలు, పదవులు తదితర అన్ని అంశాలలో మూడింట ఒకభాగం రాయలసీమ వాటాగా ఉండాలి.
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం (రి),అనంతపురము)