(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి*)
ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం 394.88 లక్షల ఎకరాలు. అందులో కోస్తాంధ్ర జిల్లాలు విస్తీర్ణం 229.08 (58.01%) లక్షల ఎకరాలు ఉండగా రాయలసీమ నాలుగు జిల్లాల విస్తీర్ణం165.80 (41.99%) లక్షల ఎకరాలు ఉంది.
జనభా పరంగా కోస్తాంధ్రలో 3.52 (69.92%) కోట్లమంది ఉండగా, రాయలసీమలో 1.51 (30.08 %) కోట్ల మంది ఉన్నారు.
ఆంధ్రలో వ్యవసాయ యోగ్యమైన భూమి 119.17(54.63) లక్షల ఎకరాలు ఉండగా, రాయలసీమలో 98.95 (45.37%) లక్షల ఎకరాలు ఉంది.
కోస్తాంధ్రలో కాలువల ద్వారా సాగునీరు 71.59 (60.07 %) లక్షల ఎకరాలు ఉండగా, రాయలసీమలో 13.42 (13.67%) లక్షల ఎకరాలకు మాత్రమే ఉంది. జలయగ్నం ద్వారా అదనంగా కోస్తాంధ్రలో 32.69 (27.43 శాతం) లక్షల ఎకరాలు ఉండగా, రాయలసీమలో 16.74 (16.92 శాతం) లక్షల ఎకరాలు ఉంది.
ఇప్పటికే కేటాయించిన నీరు మరియు జలయగ్నం పూర్తి అయన తర్వాత మొత్తం సాగు వివరాలు పరిశీలించినపుడు కోస్తాంధ్రలో 104.28 (87.50%) లక్షల ఎకరాలు కాగా, రాయలసీమలో 30.16 (30.48 %) లక్షల ఎకరాలు ఉంటుంది.
ఇరు ప్రాంతాల మధ్య సాగునీటి విషయంగా ఎంత వ్యత్యాసం ఉందో అర్థమవుతుంది.
కృష్ణా, తుంగభద్రజలాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాగా బ్రిజేష్ కమిటీ నికరజలాలుగా 811, అదనపు నికర జలాలు 49, మిగులు జలాలు 145 మొత్తం 1005 టి.యం.సీలు కేటాయించారు. ఇందులో తెలంగాణ వాట నికరజలాలు 298 కాగా, రాయలసీమ 144 + ఆంధ్ర 369 కలిపి ఆంధ్రప్రదేశ్ కు 513 టి.యం.సీలు లభించాయి. అదనపు,మిగులు జలాలు మొత్తం 194 టి.యం.సీల పంపకం పై ప్రస్తుతం బ్రిజేష్ కమిటీ విచారణ సాగుతుంది. ఇందులో 100 టి.యం.సీలు ఆంధప్రదేశ్ వాట వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కృష్ణా, తుంగభద్ర లలో 613 టి.యం.సీలు ఆంధ్రప్రదేశ్ కు లభిస్తాయి.
గోదావరి నదిలో మొత్తం 3,000 టి.యం.సీలుగా అంచనావేసి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వాటాగా 1980లో 1479 టి.యం.సీలను కేటాయించారు. ఇందులో తెలంగాణకు 375, + ఆంధ్రప్రదేశ్ కు 297 టి.యం.సీలు మొత్తం 673 టి.యం.సీలను కేటాయించారు. గోదావరి నదిలో ఆ రోజులలో నీటిని వినియోగించుకోనే అవసర ఉండకపోవడంవలన 804 టి.యం.సీలు పంచకుండా వదిలేసారు. రెండు మూడు వేల టి.యం.సీలు సముద్రం పాలవుతుండటం చూస్తున్నాము. ఇప్పుడు గోదావరి నీళ్ళను రెండు రాష్ట్రాల వినియోగం పెరుగుతోంది. వచ్చే రోజులలో కనీసం 800 టి.యం.సీల ఆంధ్రప్రదేశ్ కు నికరజలాలు దక్కే అవకాశం ఉంటాది.
పెన్నానదిలో 99 టి. యం.సీలు లభిస్తాయని అంచనా వేసారు. కుందూ నది కలిసే ప్రాంతం నుండే నీటి లభ్యత ఉంటాది. పెన్న పై భాగంలో నీటి లభ్యత లేదు. కుందూ ఇతర ఉపనదుల నుండి లభించే నీరే నెల్లూరు జిల్లాకు అధారం. కనీసం 90 టి.యం.సీలు లభిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ద్వారా 613+ గోదావరి ద్వారా 800+ పెన్నానది ద్వార 90 మొత్తం 1500 టి.యం.సీల నికరజలాల లభ్యత ఉంది.
భూభాగంలో 42 శాతం, జనాభాలో 31 శాతం ఉండే రాయలసీమ నాలుగు జిల్లాలకు కేవలం 144 టి.యం.సీలు మాత్రమే కేటాయించి, 58 శాతం భూభాగం, 69 శాతం జనభా ఉన్న కోస్తాంధ్రకు 1356 టి.యం.సీలు నికర జలాలు కేటాయించడం అసమంజసం. ఏ లెక్క ప్రకారం చూసినా కనీసం 500 టి.యం.సీలు రాయలసీమకు దక్కాలి. జలయజ్ఞం పూర్తి అయితే సీమప్రాంతం కృష్ణా నికర జలాలు 144+ అదనంగా 100 టి. యం.సీలను అందుకోవాలి. అంటే ఇప్పటికే ఉన్న హెచ్.యల్.సి, యల్.యల్.సి, కె.సి కెనాల్, యస్.ఆర్.బి.సిల ఆయకట్టు స్థిరికరించి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగలు పూర్తి చేయాలి. బ్రిజేష్ కమిటి, విభజన చట్టం పేర్కొన్న విధంగా సీమ 244 టి.యం.సీలు పొందాలి. కృష్ణలో 369 టి.యం.సీలు శ్రీశైలం దిగువన ఆంధ్ర అవసరాలకు వినియోగిస్తున్నారు. అందులో మరో 250 టి.యం.సీలు శ్రీశైలం పై భాగాన రాయలసీమ వాసులకు కేటాయించాలి. సీమలో సాగు యోగ్యమై కూడా బీడుగా ఉంటున్న 60 లక్షల ఎకరాలకు కనీసం కొన్ని తడులైనా నీరందింంచాలి. ఈ నీటి వినియోగం కోసం సీమలో అనేక ప్రాజక్టులు సిద్దం కావలసి ఉంది. కోస్తాంధ్రకు కృష్ణలో ప్రస్తుతం వినియోగిస్తున్న నీటిలో సీమ వాసులు 250 టి.యం.సి లు పై పద్దతిలో పొందాలి. ఆంధ్ర అవసరాలకోసం పక్కనే వేల టి.యం.సిలు సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను పొందే అవకాశం సులభంగా ఉంది. ఇప్పటికే పట్టిసీమ ద్వారా, భవిష్యత్తులో పోలవరం కుడికాలువ ద్వారా ఆంధ్ర లోని కృష్ణ ఆయకట్టుకు పొందే అవకాశం పుష్కలంగా ఉంది. అందుబాటులోని ఈ శాస్త్రీయ పద్దతిలో కృష్ణానది ద్వారా సీమ అవసరాలు తీర్చడమా, లేదా గోదావరి నీటినే సీమకు తరలించడమా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఉంది . ఎదో ఒక పద్దతిలో సీమ ప్రాంతానికి 500 టి.యం.సీలు కేటాయించడం పాలకుల కనీస బాధ్యత. తరతరాలుగా అన్ని విధాల నష్టపోతు వచ్చిన సీమకు ఇకనైనా పరిష్కారం కావాలి.
పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్న విధంగానే ఈ రాష్ట్రంలో సమానంగా ప్రాంతాలకు నీళ్ళను కూడా వికేంద్రీకరణ చేసేందుకు తక్షణం జల నిపుణులతో మరింత చర్చించి అసెంబ్లీలో చట్టం చేయాలి. అపుడే సమగ్ర వికేంద్రీకరణ అవుతుంది.
(*వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం.అనంతపురం. ఫోన్ 99639 17187)