’మొన్నటి ఎన్నికల్లో బిజెపి, జనసేన, టిడిపి విడివిడిగా పోటీ చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు’. ఇది తాజగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సరే పవన్ వ్యాఖ్యలే నిజమని కాసేపు అనుకుందాం. మరి 2014లో మూడు పార్టీలు కలిసే కదా పోటి చేసింది. ఎంత మెజారిటితో గెలిచారు ? ఓట్లపరంగా చూస్తే 5 లక్షలు. అదే ఓట్ల శాతంలో చూస్తే కేవలం 1.6 % అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తమ సత్తా చాటేందుకు మళ్ళీ ఓ అవకాశం రాబోతోంది.
మరి ఐదేళ్ళ పాలనలో చంద్రబాబునాయుడు చేసిన అద్భుత పాలన ఏముంది ? అన్నింటా వైఫల్యాలే కదా ? అవినీతి, అరాచకాల చంద్రబాబు పాలనతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం. అదే సమయంలో ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు తదితరాల్లో మోసం చేసిందన్న మంట బిజెపిపై జనాల్లో బాగా పేరుకుపోయింది.
ఇక పవన్ సంగతంటారా చాలా సందర్భాల్లో తాను చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటానికే ఉన్నట్లు రుజువు చేసుకున్నారు.
కాబట్టి పవన్ కూడా ఏదో రాజకీయ భూకంపం సృష్టిస్తాడన్న భ్రమలు జనాల్లో తొలగిపోయాయి. అదే సమయంలో చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి 3680 కిలోమీటర్ల పాదయాత్రతో జనాల్లోకి చొచ్చుకుపోయారు. దాంతో జనాలందరూ జగన్ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్లు అనేక సర్వేల్లో అర్ధమైపోయింది.
కాబట్టి చెప్పినట్లుగా మూడు పార్టీలు కలిసి 2019 లో పోటి చేసినా రిజల్టులో పెద్దగా మార్పేమీ ఉండేదికాదేమో.
సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మరి రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కలిసి పోటి చేయచ్చు కదా ఎవరు వద్దన్నారు ? ముగ్గురు కలిసి జగన్ కు వ్యతిరేకంగా పోటి చేస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. అసలు బిజెపి, టిడిపిని దగ్గర చేసేందుకే పవన్ ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడా ? చూద్దాం కొద్ది రోజుల్లో తేలిపోతుంది కదా ?