భారత దేశానికి కొత్తగా పౌర సత్వ సవరణ చట్టం తీసుకురావలసిన అవసరం లేదని, పౌరసత్వం చట్టం (2019),తో పాటు ఎన్ ఆర్ ఐ సి, ఎన్ పిఆర్ లను ఉపసంహరించుకోవాలని 106 మంది రిటైర్డు ఐఎఎస్ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
. అన్ని మతాలకు చెందిన ఈ ఐఎఎస్ ఆఫీసర్లు భారత ప్రజలకు ఈ విషయం మీద ఒక బహిరంగ లేఖ రాశారు.తమలాగే ప్రజలంతా కూడా ఈ అంశాలమీద ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావాలని వారు ఈ లేఖలో కోరారు.
లేఖ మీద సంతకం చేసిన వారిలో రాహుల్ కుల్లడ్, నజీబ్ జంగ్, జగదీష్ జోషి, రవి వీర గుప్తా, కమల్ జస్వాల్, గౌరిశంకర్ ఘోస్, ఎస్ కె గుహ, మీనా గుప్తా, ప్రభు ఘాటే, నితిన్ దేశాయ్, సుషీల్ దూబే, ఎంజి దేశసహాయం, రేచల్ చటర్జీ, కెఎం చంద్రశేఖర్, విభా పూరి దాస్, రవి బుధిరాజ, సుందర్ బుర్రా, ఆర్ చంద్రమోహన్, అనితా అగ్నిహోత్రి, ఎస్ పి ఆంబ్రోస్ తదితరలు ఉన్నారు.
‘భారత ప్రజలుగా మీరంతా గత కొద్దిరోజులుగా పౌరసత్వ సవరణ చట్టం2019, దాని మీద ప్రభుత్వం నుంచి వస్తున్న రకరకాల ప్రకటనలు, నిరసన ఉద్యమాల వల్ల మీరు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే నేషనల్ రిజిస్టర్ అఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ ఆర్ ఐ సి) గురించి కూడా మీరంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సర్వీస్ లో దీర్ఘ కాలం పనిచేసి రాజ్యంగ బద్ధంగా నడుచుకున్న మేము సిఎఎ, ఎన్ ఆర్ ఐ సి, ఎన్ పిఆర్ గురించి మీకు వివరంగా చెప్పాలని భావించి ఈ ఉత్తరం రాస్తున్నాం,’ అని ఈ చట్టాల గురించి వివరంగా లేఖలోపాల్గొని ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశారు.
ఈ చట్టాల గురించి ప్రజలలో విపరీతమయిన భయాందోళనలు సృష్టించారని, దీనితో అంతర్జాతీయ సమాజంలో, పొరుగు దేశాలలో భారత ప్రతిష్ట దిగజారుతుందని, ఇపుడున్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇలాంటి సమస్యలో భారత్ చిక్కుకోవడం మంచిది కాదని వారంతా అభిప్రాయపడ్డారు. పౌరసత్వం గురించి ఇలాంటి చర్యలు పెట్టి, ప్రపంచంలో పలు దేశాలకు లిబరల్ డెమోక్రసీగా మార్గదర్శిగా ఉండే గొప్ప గౌరవాన్ని భారతదేశం కోల్పోతుందని వారు హెచ్చరించారు.
అందువల్ల ప్రభుత్వం-
భారత ప్రభుత్వం ఇటీవలి తీసుకువచ్చినే సిటిజన్ షిప్ అమెండ్ యాక్ట్ (CAA)ని ఉపసంహరించుకోవాలని వారు సూచించారు.
భారతదేశంలోని పౌరులందరికీ జాతీయ గుర్తింపు కార్డులిచ్చేందుకు అవకాశం కల్పించిన 1955 పౌరసత్వ చట్టంలోని 14ఎ, 18(2) సెక్షన్లను ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.
అదే విధంగా ఫారినర్స్(ట్రిబ్యునల్స్) అమెండ్ మెంట్ ఆర్డర్ 2019తోపాటు. డిటెన్షన్ క్యాంపుల నిర్మాణానికి చెందిన అన్ని ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
దేశ ప్రజలంతా తమ లాగే ప్రజలవాణిని వినాలని, గౌరవించాలని ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావాలని వారు ఈ బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.