ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ను విశాఖ పట్టణానికి మార్చాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి భూములను ఒక ప్రత్యేక వ్యవసాయ జోన్ (Special Agricultural Zone SEZ)గా మార్చేందుకు సిద్ధమవుతూ ఉంది. ప్రత్యేక ఆర్థిక సెజ్ ల మాదిరిగా పలురాయితీలను ప్రకటించి ఈ ప్రాంత భూముల విశిష్టత ప్రకారం పంటలను పండించి వాటిని మార్కెటింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటుచేసే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని అధికారి ఒకరు ట్రెండింగ్ తెలుగున్యూస్ కు చెప్పారు. దీనికి అధిపతిగా ఒక సీనియర్ అధికారిని నియమించే అవకాశం ఉందని కూడా తెలిసింది.
అమరావతి భూములు విశిష్టమయినవని, వాటిని కాపాడుకోవాలని, ఒకపుడు మేధాపట్కర్ వంటి పర్యావరణ నిపుణులంతా డిమాండ్ చేశారు. దానిని ఖాతరుచేయకుండా నాడు చంద్రబాబు ప్రభుత్వం ఈ భూములను రాజధాని నిర్మాణంకోసం రకరకాల పద్ధతులలో తీసుకుంది. ఇపుడు వాటినిరైతులకు అప్పగించే విషయం పరిశీలనలో ఉందని తెలిసింది.
ఇక్కడ చేపట్టిన నిర్మాణాల వల్ల ఈ భూములలో సిమెంట్, తదితర కంట్రక్షన్ మెటీరియల్ పడిపోయి, వ్యవసాయపనికిరాకుండా పోయాయని వస్తున్న విమర్శను ఈ అధికారి తోసిపుచ్చారు. ఒక వేళ అలాంటిదేమయినా ఉంటే ప్రభుత్వ వ్యవయంతోనే ఈ భూములను వ్యవసాయయోగ్యంగా మార్చడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఇది ఇలా ఉంటే అమరావతి ప్రాంతాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక హరిత మండలం (గ్రీన్ జోన్) గా మార్చడం జరుగుతుందని వైసిసి రైతునాయకడు, ఎపి అగ్రికల్చర్ కమిషన్ ఛెయిర్మన్ ఎం విఎస్ నాగిరెడ్డి చెప్పారు. ఈ విషయం ఇపుడు హైపవర్ కమిటీ చర్చల్లో ఉందని వివరాలు తొందర్లో తెలుస్తాయని ఆయన చెప్పారు.