రాజధానిని విశాఖకు తరలించేందుకు ఒక వైపు ప్రభుత్వంలో చర్చలు మొదలయ్యాయి. జనవరి నెలాఖరునుంచి తరలింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో జోరుగా వినబడుతూ ఉంది. మరొక వైపు అమరావతి రైతులు ‘సేవ్ అమరావతి’ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. పెద్ద యువకులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశానికి వెళుతున్న సీఎం జగన్‌కు అమరావతి ప్రాంత రైతులు నిరసన తెలిపారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకు రైతులు ఆగ్రహం మళ్లించారు.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రైతులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు. దీనితో ట్రాఫిక్ జామ్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు రాస్తారోకోలో చిక్కుకుంది. కారు ముందు రైతులు ఆందోళనకు దిగారు. కారు ముందు బైఠాయించి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ దాడిని వైసిపి హత్యా యత్నంగా వర్ణించింది. రైతుల ముసుగులో టిడిపి నాయకులే ఈ దాడి చేశారని పార్టీ ట్వీట్ చేసింది.
ప్రభుత్వ విప్ పిన్నెళ్లిపై హత్యాయత్నం. ఉద్యమం ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుండా గిరి. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రైతులు, సామాన్య ప్రజల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ల దాడి.#TDPGoons #AttackOnPinnelli pic.twitter.com/coF81lrUx6
— YSR Congress Party (@YSRCParty) January 7, 2020