దేశాన్ని కుదిపేసిన నిర్భయ అత్యాచారం కేసులో నేరస్థులకు ఉరిశిక్షను అమలుచేసే తేదీ ఖరారయింది. ఈ కేసులో ఉన్న నలుగురిని జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు. ఢిల్లీపాటియాలా హౌస్ కోర్టు ఈ మేరకు వారంట్ జారీ చేసింది.
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు 2012లో నమోదయింది. ఈ నేరస్థులకు సంబంధించి ఏ కోర్టులో కూడా ఎలాంటిపిటిషన్ పెండింగులో లేదు. వీరి రివ్యూపిటిషన్లను సుప్రీంకోర్టు డిసెంబర్ 18న తిరస్కరించింది. విషయాన్నికోర్టు దృష్టికి తెస్తూ వారంట్ జారీ చేయవచ్చని ప్రాసిక్యూషన్ కోర్టుకు నివేదించింది.
అయితే, శిక్ష అమలుచేసేలోపు నేరస్థులు అవసరమయితే క్యురేటివ్ పిటిషన్ ను వేసుకోవచ్చని ప్రాసిక్యూషన్ తెలిపింది. కాని, నేరస్థులు ముఖేష్, వినయ్ ల న్యాయవాది మాత్రం క్యూరేటివ్ పిటిషన్ వేయబోతున్నామని కోర్టుకుచెప్పారు.
నిర్భయ కేస్ టైమ్ లైన్
23 సంవత్సరాల పారామెడికల్ విద్యార్థి ‘నిర్భయ’ గ్యాంగ్ రేప్ 2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో జరిగింది.
దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్నపుడు ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిర్బయ కన్నుమూసింది.
ఈ కేసులో ఆరుగురు నిందితులంతా దోషులని రుజువయింది. కోర్టు 2017 మేలో తీర్పు వెలువరించింది.
దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
మిగిలిన నలుగురు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌కి కోర్టు ఉరిశిక్ష విధించింది.ఇదే ఇపుడు ఈ నెల 22న అమలవుతున్నది.
మరొక దోషి మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34) ఉరి శిక్ష రివ్యూ పిటిషన్ ను ఈ జూలై 9న సుప్రీంకోర్టు తిరస్కరించింది
మరొక నేరస్థుడు అక్షయ్ కుమార్ (31) రివ్యూ పిటిషన్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు డిసెంబర్ 18న కొట్టివేసింది.
తర్వాత, కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని సిఫార్సు చేసింది. రాష్ట్రపతి తిరస్కరించారు.