చంద్రబాబుదంతా కృత్రిమ ఉద్యమం : వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్

(గుడివాడ అమర్‌నాథ్‌,అనకాపల్లి ఎమ్మెల్యే)
 ఈ రోజు విశాఖ పట్నంలో  గుడివాడ్ అమర్నాథ్ చెప్పిన విశేషాలు:  
ఇవాళ హై పవర్‌ కమిటీ సమావేశమవుతోంది. ఆ తర్వాత త్వరలోనే కేబినెట్‌ సమావేశం కూడా జరగనుంది. వాటిలో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం ఉంది. అయితే ఈ 10 రోజులుగా ప్రధాన విపక్షనేత చంద్రబాబు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమం చూస్తుంటే, ఆయన ఒక్క దానికి సమాధానం చెప్పాలి..
అసలు ఆయన ఎందుకు ఈ ఉద్యమం, పోరాటం చేస్తున్నారు?
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ఎక్కడా చెప్పలేదే? ఇప్పటికే అమరావతితో పాటు, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జుడీషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు కావచ్చని సీఎం గారు చెబితే ఎందుకు ఆందోళన చేస్తున్నారు?.
రాజధానిలో గతంలో రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారు. వారికి అప్పుడు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పినా, ఎందుకు ఈ కృతిమ ఉద్యమం చేస్తున్నారు?. దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.  దేశంలో మొదటి క్యాపిటలిస్ట్‌ ఉద్యమం ఇవాళ చంద్రబాబు గారు అమరావతిలో చేస్తున్నారు. దీనికి మరీ ముఖ్యంగా వామపక్షాలు వత్తాసు పలుకుతున్నాయి. వారూ సమాధానం చెప్పాలి.
గత కొన్నాళ్లుగా సీపీఐ రామకృష్ణ, మధు గారు మాటలు చూస్తుంటే, వారు ఏ రకంగా చంద్రబాబుకు సహకరిస్తున్నారు? ఎందుకలా గబ్బు పట్టి పోయారన్నది అర్ధం కావడం లేదు.
ఇవాళ రాయలసీమ తాగు, నీటి కోసం ఆరాట పడుతోంది. దాన్ని అస్సలు పట్టించుకోకుండా ఇవాళ చంద్రబాబు అమరావతిలో చేస్తున్నది రేటు పోరాటం.
మా ప్రాంతంలో పరిశ్రమలు కావాలని చేసిన ఉద్యమాలు చూశాం. కానీ అమరావతిలో ఇవాళ చంద్రబాబు తమ భూములకు రేటు కావాలని ఉద్యమం చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబుకు బాకా ఊదే పత్రికలు చూస్తుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేసినా కొన్ని పత్రికలు, ఛానళ్లు జోరుగా మద్దతునిచ్చాయి. ఆయనను ఆకాశానికెత్తాయి.
ఇవాళ విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టవచ్చన్న ప్రభుత్వ ప్రకటనపై ఇవాళ ఈనాడులో ఒక పెద్ద వార్త. పేజీలకొద్ది రాశారు. వారికి ఎంత బాధ కలుగుతోంది. ఏరోజు ఎవరైనా మాకు హైదరాబాద్‌ చాలా దూరమని అన్నామా?
 ఇప్పుడు దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి, పక్కనే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పెట్టమని అడిగామా?
విశాఖలో ఇవాళ అన్ని సదుపాయాలు ఉన్నాయి. జాతీయ రహదారి ఉంది. రైల్వే, పోర్టు కనెక్టివిటీ ఉంది. పలు విమాన సర్వీసులు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఎందుకు చూడలేకపోతున్నారు?
తనను నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. సీఎంగా ఆయన 14 ఏళ్లు పని చేశారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచాడు.
 ఉత్తరాంధ్ర ప్రజలు తొలి నుంచి ఉత్తరాంధ్రకు అనుకూలంగా ఉన్నారు. కానీ ఆ పార్టీ నైజం గమనించి, మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ఇన్నాళ్లూ మీకు అండగా నిల్చిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఇదా మీరిచ్చేది?
ఈనాడు ప్రస్థానం మొదలైంది విశాఖలో. ఎన్టీఆర్‌ను గద్దె దింపడంలో మీరు ఎలాంటి పాత్ర పోషించాలో తెలియదా?  నాడు రవాణా సదుపాయం సక్రమంగా లేనప్పుడే చాలా సులభంగా విశాఖకు వచ్చి పోయే వారు. ఇప్పుడు ఆ సదుపాయాలు బాగా వచ్చాయి.
విశాఖకు పాక్కుంటూ వస్తారా?
 అయినా విశాఖకు వచ్చి పోవడానికి రెండు, మూడు రోజులు పడుతుందా? అంటే పాక్కుంటూ లేదా నడుచుకుంటూ వస్తారా? విశాఖ అంటే ఎల్లో మీడియాకు ఎందుకంత కడుపు మంట? ఈ నగరంపై ఎందుకంత ద్వేషం?
చంద్రబాబు గారూ, మీరు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. విభజన తర్వాత 13 జిల్లాలకు సీఎంగా పని చేశారు. కానీ ఇవాళ ఒక 29 గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒక మండల అధ్యక్షుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా ఇన్నేళ్ల మీ రాజకీయ అనుభవం?  మీరు జాతీయ నాయకుడని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారని మీ కొడుకు చెబుతా ఉంటాడు. కానీ నిజానికి ఇవాళ జాతీయ రాజకీయాల్లో చక్రం కాదు కదా.. కనీసం బొంగురం కూడా తిప్పే పరిస్థితిలో లేరు. జాతీయ నాయకుడు కాస్తా, జాతి నాయకుడిగా మారిపోయాడు.
 ఇక రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాలు, 5 కోట్ల మంది ప్రజలు ఏమై పోయినా ఫరవాలేదు. ఆ 29 గ్రామాల పరిధిలో ఉన్న భూమలు, వాటి ధరలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామన్నట్లుగా ఉన్నారు. గతంలో అమరావతికి రాజధానికి ఎంపిక చేసినప్పుడు చందాల వసూలుకు మీరు హుండీలు పెట్టారు. హైదరాబాద్‌లో, అమరావతిలో పెట్టారు.
ఇక మీ అనుకూల పత్రికలు కూడా వసూలు చేశాయి. వాటికి లెక్కలు లేవు.ఆరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మీ భార్య భువనేశ్వరి గారు, ఇవాళ భూముల ధరలు పడిపోతున్నాయని చెప్పి రెండు గాజులు ఇచ్చారు. వాటిని చూపి మళ్లీ ఇవాళ వసూళ్లు మొదలు పెట్టారు.
చంద్రబాబు కాస్తా హుండీ బాబుగా మారిపోయారు. విజయవాడలో నిన్న గద్దె రామ్మోహన్‌ దీక్ష చేస్తుంటే, అక్కడ కూర్చుని కట్నాల చదివింపులు చేశారు.
 దేనికి ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? మీ భూముల ధరలు పెంచుకోవడానికి ప్రజల ఉంగరాలు, తాళిబొట్లు ఇవ్వాలా?  జీవితంలో ఆఖరి దశకు వచ్చినా ఇంకా ఎందుకీ రాజకీయాలు? 70 ఏళ్లు దాటాయి మీకు. మీరు చేస్తున్న పోరాటాన్ని గాంధీజీ స్వతంత్య్ర ఉద్యమంతో పోలుస్తున్నారు. అసలు గాంధీజీ చేసిన పోరాటం ఏమిటి? ఇవాళ మీరు చేస్తున్నదేమిటి?
 గాంధీజీ స్వతంత్య్ర ఉద్యమం చేస్తే, ప్రజలు ఇలా డబ్బులిచ్చారని అన్నారు. అసలు ఆయనతో మీరు పోల్చుకోవడం ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైపోయింది మీకు? ఎందుకు ఆ రకంగా మీకు మతి భ్రమించి ఈ రకంగా పోరాటం చేస్తున్నారు?  గాంధీజీ ఏనాడూ 29 గ్రామాల కోసమో, లేక ఆయన పుట్టిన గుజరాత్‌ కోసమో పోరాటం చేయలేదు. గాంధీజీ నాడు చేసిన స్వతంత్య్ర ఉద్యమం ప్రపంచంలోనే ఆదర్శంగా నిల్చింది. మరి మీ ఉద్యమం దేనికి ఆదర్శం?
 అంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఉద్యమాలు జరిగినప్పుడు, ఎవరైనా ప్రభుత్వానికి సహకరించి భూములు ఇస్తే, మీరు భూముల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కాదు. ఆ భూములకు రేటు వస్తుందా? లేదా? అన్న దాని మీద పోరాడమని మీరు మెసేజ్‌ ఏమైనా ఇస్తున్నారా?  గబ్బిలం గురించి మనకంతా తెలుసు. నేను పాలిస్తాను. రెక్కలున్నాయి ఎగురుతాను అని చెప్పి, పక్షి దగ్గరకు వెళ్లి నేను పక్షిని అని చెబుతుంది. అలాగే పాలిస్తాను కాబట్టి పశువుల దగ్గరకు వెళ్లి, తాను కూడా పశువునే అని చెబుతుంది.
 కానీ నిజానికి గబ్బిలం ఎక్కడ తిరుగుతుంది అని చూస్తే, మనుషుల అంత్యక్రియలు జరిగే స్మశానాల చుట్టూ తిరుగుతుంది. దెయ్యాలు తిరిగే మర్చి చెట్ల చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ఇవాళ చంద్రబాబు గారు కూడా ఒక రాజకీయ గబ్బిలంలా, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి చెందకుండా ఒక రాజకీయ గబ్బిలంలా తయారయ్యాడు.
– ఇంకా ఏం చేసుకుంటారు? కేవలం 2 ఎకరాల స్థాయి నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఎదిగారే! అంత సొమ్ము అవినీతితో సంపాదించారే? 10 తరాలకు సరిపడేంతగా సంపాదించారే?
హెరిటేజ్‌ పేరిట మీరు చేసిన దోపిడి ప్రజలంతా చూశారే? ఇవాళ మీకు ఎందుకంత ఉత్తరాంధ్ర మీద కోపం? రాయలసీమలో పుట్టినా కనీసం ఆ ప్రాంతంపై మీకు ప్రేమ లేదు. ఈరోజు ఇంకా శవాలతో రాజకీయం చేస్తున్నారు. మొన్న ఎవరో ఉల్లిపాయల కోసం చనిపోయారని రాజకీయం చేశారు. సాంబయ్య అనే రైతు గుండెపోటుతో చనిపోతే, ఆయన ఉల్లిపాయల కోసం లైన్‌లో నిలబడి చనిపోయారని అసెంబ్లీలో చెప్పారు. దాన్ని చివరకు ఆ సాంబయ్య కుటుంబ సభ్యులే ఖండించారు.
 నిన్న కూడా 29 గ్రామాల్లో ఎవరో చనిపోయారు. వారు రకరకాల కారణాలతో చనిపోతే, ఈ క్యాపిటలిస్టు ఉద్యమంలో, శవాలతో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.  10 రోజుల క్రితమే చెప్పాను. చంద్రబాబు శవాల కోసం తిరుగుతున్నాడని. ఈ రాజకీయ గబ్బిలం సరిగ్గా ఇవాళ అదే పని చేస్తున్నారు.
 మాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు, ఈ ఉద్యమం కోసం హత్యలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా చంపి, దాన్ని ఆత్మహత్యగా చూపి, ఈ ఉద్యమానికి ఊపిరి పోయాలని చూస్తున్నట్లు మాకున్నటు వంటి సమాచారం.
– గతంలో మీకు తెలుసు. మల్లెల బాబ్జీ కేసు. దాన్ని రుజువులతో సహా వంగవీటి రంగా బయట పెడితే ఆయనను కూడా హత్య చేశారు.
మొన్న ఒక రాజకీయ నాయకుడు అన్నాడు.. విశాఖలో రాజధాని పెట్టమని ఎవరు అడిగారు అని. మరి రాజధాని అమరావతిలో పెట్టమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఎవరైనా ఉద్యమం చేశారా?  శివరామకృష్ణ కమిటీ కానీ, బీసీజీ కానీ.. ఎవరైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా రిపోర్టు ఇచ్చారు.
అమరావతిలో రాజధాని పెట్టాలని కేవలం ఒక్క నారాయణ కమిటీ మాత్రమే నివేదిక ఇచ్చారు. మీకు ఏ కమిటీ మీద నమ్మకం లేదు, ఒక్క నారాయణ కమిటీ మీద తప్ప.
 1400 మంది చెప్పారు కాబట్టి, అమరావతిలో రాజధాని పెట్టామన్నారు. అందుకు సిగ్గుండాలి. 5 కోట్ల మందిలో కేవలం 1400 మంది చెబితే రాజధాని పెడతారా? విశాఖ గురించి ప్రజలు చెప్పారంటే అనుకోవచ్చు. కానీ అమరావతిలో ఏముందని ప్రజలు చెప్పారు. ఇక్కడ అసలు ఏముంది?
 ఫౌండేషన్‌ వేయాలంటే 40 మీటర్ల లోతు వరకు వెళ్లాలి. అదే విధంగా ఒక కిలోమీటరు రోడ్డు వేయడానికి రూ.30 కోట్ల నుంచి రూ.42 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం మీద రూ.1.10 లక్షల కోట్ల వరకు పనుల అంచనా వేశారు.
ఎవరో చెప్పినట్లు, మనం ఎంత పరుగెత్తుకు వెళ్లినా కేవలం 6 అడుగుల్లోనే కప్పి పెడతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనతో పాటు తీసుకెళ్లడానికి ఏమీ ఉండదు. మూడుసార్లు సీఎంగా పని చేశారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. విపక్షనేతగా పని చేశారు. ఇంకా ఏం కావాలి మీకు? ఏం తీసుకుపోతారు?
దయచేసి ఇకనైనా ఈ రాజకీయాలు మానండి. ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. కొన్ని గ్రామాలకు మాత్రమే నాయకుడిగా వ్యవహరించకండి. ఇప్పటికే మీ వెన్నుపోటు రాజకీయాలు, దుర్మార్గాలు ప్రజలు చూశారు. ఇప్పుడు ఆఖరి దశలో ఉన్నారు. కనీసం ఇప్పుడైనా మంచి అనిపించుకోండి.
అలాగే విశాఖ మీద, ఉత్తరాంధ్ర మీద విషం కక్కుతూ, కుట్ర చేస్తూ రాతలు రాస్తున్న వారిని ఖండించమని అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ద్వారా మెరుగైన సేవలందుతాయి. ఏ ఒక్కరికి బాధ కలగకుండా, నష్టం కలగకుండా, 5 కోట్ల మందికి మేలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుంది.
అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆలోచన. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.