అంధ్రప్రదేశ్ రాష్ట్రం – శ్రీబాగ్ ఒడంబడిక – మూడు రాజధానులు – రాయలసీమ అభివృద్ధినేపధ్యంలోరాయలసీమ సంఘాల సమన్వయ వేదిక తీర్మానాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తూ జి ఎన్ రావు కమిటి, బిసిజి కమిటి, హైపవర్ కమిటి లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్న నేపథ్యంలో రాయలసీమ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్న అనేక రాయలసీమ ప్రజా సంఘాలు జనవరి 5, 2020 న కర్నూలు పట్టణంలో సమావేశం నిర్వహించాయి. రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు రాయలసీమ ప్రజా సంఘాలు కింది తీర్మానాలను చేయడం జరిగింది. ఈ తీర్మానాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయలసీమ ప్రజా సంఘాల పక్షాన కోరుతున్నాం.
శ్రిబాగ్ ఒడంబడిక :- ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలో అత్యంత కీలక భూమిక వహించిన 1937 నాటి శ్రిబాగ్ ఒడంబడికను జి ఎన్ రావు కమిటి, కోస్తా ఆంధ్ర ప్రజలు 82 సంవత్సరాల తరువాత గుర్తించి ప్రస్తావించడాన్ని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక స్వాగతిస్తున్నది. శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తిగా అందులో అంగీకరించిన అంశాలు ఇప్పటికైనా అమలు చేసి రాయలసీమ మిగిలిన ప్రాంతాలతో సమానంగా అన్నిరంగాలలో అభివృద్ది చేయాలని సమావేశం తీర్మానించింది.
హైకోర్ట్ ఏర్పాటుపై ప్రతిపాదన :- రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని జి ఎన్ రావు కమిటి ప్రతిపాధించడం, శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం పై సమావేశం హర్షం వ్యక్తపరిచింది. అయితే శ్రిబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టును ఎంచుకునే హక్కు ఉన్న రాయలసీమ వాసులకు ఆ అవకాశం లేకుండా గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం పట్ల సమావేశం తీవ్ర ఆవేదన వ్యక్తపరిచింది.
ఇదే సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ చేపట్టాలని నిర్ణయించి అందులో భాగంగా అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్టణం లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. నిర్ణయాత్మకమైన ఈ వ్యవస్థలను రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న కనీస ఆలోచనకూడా ప్రభుత్వం చేయక పోవడం పట్ల సమావేశం నిరసన వ్యక్తపరిచింది.
అదేవిదంగా రాయలసీమలో కూడా శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ విభాగాలను ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సమాన అభివృద్ధికి కీలకమైన పాలనావ్యవస్థ వికేంద్రీకరణలో రాయలసీమకు కుడా మిగిలిన ప్రాంతాలతో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని, ఈ రెండు వ్యవస్థలను కూడా రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు: సమైక్య అంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలైన ఇప్పటికి రాష్ట్ర విభజన చట్టంలో వెనకబడిన రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న భున్దేల్కండ్ తరహ ప్యాకేజి అమలు చెయ్యడం, అప్పటికే నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజక్టులు పూర్తి చేసి నీళ్ళు యిస్తామన్న హామీని ఇప్పటికి అమలు చేయలేదు. కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి విభజన చట్టంలో ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ సమావేశం తీర్మానించింది.
కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యం : శ్రిబాగ్ ఒడంబడిక ప్రాతిపదికగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాయలసీమ నీటి అవసరాలు తీరిన తరువాతనే కృష్ణా, తుంగభధ్ర, పెన్నా నీటిని ఇతర ప్రాంతాలకు ఇవ్వవలసి వుంది. ఇందుకు విరుద్దంగా రాయలసీమ నీటి అవసరాలు పట్టించుకోకుండా కృష్ణా. గుంటూరు జిల్లాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం గోదావరినీటిని కృష్ణా భేసిన్ కు తరలించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. ఇప్పటికే పట్టి సీమ ద్వార ప్రతి సంవత్సరం 100 TMC లకు పైగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది.
పై అంశాలను పరిగణలోనికి తీసుకొని శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయించాలని సమావేశం తీర్మానించింది.
రాయలసీమలో సాగునీటి హక్కు ఉన్న ప్రాజక్టుల సక్రమ నీటి వినియోగానికి అవసరమైన నిర్మాణాలు : రాయలసీమ లోని మొత్తం వ్యవసాయ యోగ్య భూమి 90 లక్షల ఎకరాలకు గాను 19 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి (Irrigation Potentiality Created) కల్పించారు. సాగునీటి వసతి కల్పించిన ఈ 19 లక్షల ఎకరాలలో కేవలం 8 లక్షల ఎకరాలలో మాత్రమే సాగునీటి వినియోగం(Irrigation Potentiality Utilised) జరుగుతున్నది. తక్కువ వర్షపాతం ఉన్న రాయలసీమలో భూగర్బ జలాలు అడుగంటి పోయాయి, చెరువులు నిర్వీర్యం అయ్యాయి. దీనితో రాయలసీమ మొత్తంగా సాగునీటి వినియోగం లేని భూమి 81 లక్షల (90 – 8 = 81) ఎకరాలలో అత్యధికం వర్షంపైన ఆధార పడ్డాయి. అత్యల్ప వర్షపాతం పడే రాయలసీమలో సాగునీటి వసతిలేని ఈ భూమి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 24000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన కోల్పోవడం జరుగుతున్నది. ఇది రాయలసీమ ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా ప్రతిబంధకంగా మారింది.
1953 లో ప్రారంభమైన తుంగభద్ర డ్యాం ఆధారంగా చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టుల కాలువల నిర్మాణం సంపూర్తిగా జరగక పోవడం వలన మిగిలిన నీటిని కృష్ణా డెల్టా రబీ ఆయకట్టుకు 37498 ఎకరాలకు అదనంగా వినియోగించు కొనడానికి తాత్కాలిక అనుమతులను పొందడం జరిగింది. 1953లో ప్రారంభమైన తుంగభద్ర ఎగువ మరియు దిగువ కాలువల మరియు కే సి కెనాల్ కింద ఈ రోజు వరకు కేటాయించిన నీటి వినియోగం జరగడం లేదు. దీనితో కృష్ణా డెల్టాలో రబీ ఆయకట్టు 37498 ఎకరాలకు అదనంగా సుమారు పది లక్షల ఎకరాలకు నీటి వినియోగం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి పై బ్యారేజి మరియు ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల రిజర్యవార్ నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, తుంగభద్ర వరద కాలువ నిర్మాణం చేపట్టి 70 నుండి 100 సంవత్సరాల పైన చరిత్ర కల్గిన తుంగభద్ర ఎగువ మరియు దిగువ కాలువల మరియు కే సి కెనాల్ లను పరిరక్షించి, వెనుకబడిన ప్రాంతాల అస్తిత్వం నిలపాలని సమావేశం తీర్మానించింది.
అభివృద్ధి వికేంద్రీకరణ: రాష్ట్ర విభజన చట్టం 13 వ షెడ్యూలులో పేర్కొన్న సంస్థలలో కీలకమైన ఎయిమ్స్ మరియు జాతీయ ప్రాధాన్యత కల్గిన వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
కడపలో మైనింగ్ యూనివర్శిటీ, తిరుపతి లో క్యాన్సర్ హాస్పిటల్ , తెలుగు విశ్వవిద్యాలయం పాలనా కేంద్రంగా శ్రీ శైలంలో ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయం లో భాగమైన చరిత్ర శాఖ కేంద్రం లో కొనసాగించాలని సమావేశం తీర్మానించింది.
గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్, సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని సమావేశం తీర్మానించింది.
కర్నూలును సీడ్ హబ్ గా అభివృద్ధి చేయడానికి APSSDC, APSSCA, వ్యవసాయ కమేషనరేట్, విత్తనా దృవీకరణ కేంద్రం లను కర్నూలులో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
విభజన చట్టంలో ని 9వ షెడ్యూల్ లోని 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పోరేషన్ లను, 10 వ షెడ్యూల్ లోని 107 రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థలలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని పరిష్కారం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో ఏర్పాటు కాబోతున్న పై సంస్థలు వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం తీర్మానించింది.
సమాన నిష్పత్తిలో శాసనసభ స్థానాలు:- శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తితో ఆంధ్ర ప్రాంతంలోని కోస్తా జిల్లాలకు సమానంగా రాయలసీమ నెల్లూరు జిల్లాల ప్రాంతాలలో సమాన నిష్పత్తిలో శాసనసభ స్థానాలు ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
రాయలసీమ అభివృద్దికి ప్రత్యేక బోర్డ్ :- రాయలసీమ ప్రాంత అభివృద్ధి బోర్డు ను నిపుణులతో ఏర్పాటు చేయాలి. ఇతర ప్రాంతాలతో సమాన అభివృద్ధి సాధించటానికి అవసరమైన బడ్జెట్ నిధులను రాయలసీమకు కేటాయించాలని సమావేశం తీర్మానించింది.