రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలోరాష్ట్రం లో పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ నేపధ్యంలో రాయలసీమ అభివృద్ధిపై రాయలసీమ ప్రజా సంఘాల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ( జనవరి 5, 2020) కర్నూలులోని కృష్ణ కాంత్ ప్లాజా లోని సమావేశం మందిరంలో నిర్వహించిడమైనది.
రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తూ జి. ఎన్. రావు కమిటి, బిసిజి కమిటి, హైపవర్ కమిటి లను ఏర్పాటు చేయడాన్ని సమావేశం స్వాగతించింది. ప్రభుత్వ ఏర్పాటు చేసిన జి. ఎన్. రావు కమిటి, బిసిజి కమిటి శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో అధికార, అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని పేర్కొనడాన్ని సమావేశం స్వాగతించింది. రాష్ట్రంలో న్యాయ రాజధాని, శాసన రాజధాని, కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణను చేయాలని సంకల్పించడాన్ని సమావేశం స్వాగతించింది.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని జి. ఎన్. రావు కమిటి ప్రతిపాధించడం, శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం పై సమావేశం హర్షం వ్యక్తపరిచింది. అయితే శ్రిబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టును ఎంచుకునే హక్కు ఉన్న రాయలసీమ వాసులకు ఆ అవకాశం లేకుండా గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం పట్ల సమావేశం తీవ్ర ఆవేదన వ్యక్తపరిచింది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సమాన అభివృద్ధికి కీలకమైన పాలనావ్యవస్థ వికేంద్రీకరణలో రాయలసీమకు కూడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా ప్రాతినిధ్యం కల్పించడంలో భాగంగా శాసన, కార్యనిర్వాహణ వ్యవస్థల విభాగాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టం లో ప్రకటించిన బుందేల్కండ్ ప్యాకేజి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు, నిధులు కేటాయింపులు చేసి యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కృష్ణా, తుంగభద్ర జలాలలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత ను ఇవ్వాలి. గోదావరి జలాలను నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు మల్లించి శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలకు కేటాయించాలని సమావేశం తీర్మానించింది.
రాయలసీమకు తుంగభద్ర డ్యాం నుండి హక్కుగా లభించిన నీటిని పంట కాలువల నిర్మాణం జరగక పోవడం వలన కృష్ణా డెల్టాలో రబీ పంటకు హక్కు ఉన్న 37498 ఎకరాలకు అదనంగా 10 లక్షల ఎకరాలకు నీటిని వినియోగిస్తున్నది. దీనితో రాయలసీమ ప్రతి సంవత్సరం 8000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన నష్టపోతున్నది. రాయలసీమ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాయలసీమకు హక్కు ఉన్న నీటిని వినియోగించకొనడానికి తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, వేదవతి పై బ్యారేజి మరియు ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల రిజర్యాయర్ నిర్మాణం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, తుంగభద్ర వరద కాలువ నిర్మాణం నిర్మాణాలు చేపట్టాలని సమావేశం డిమాండ్ చేసింది.
అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్, ఎయిమ్స్ మరియు జాతీయ ప్రాధాన్యత కల్గిన వ్యవసాయ విశ్వవిద్యాలయం, కడపలో మైనింగ్ యూనివర్శిటీ, తిరుపతి లో క్యాన్సర్ హాస్పిటల్, తెలుగు విశ్వవిద్యాలయం, గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్, సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కర్మాగారం, కర్నూలును సీడ్ హబ్ గా అభివృద్ధి చేయడానికి APSSDC, APSSCA, వ్యవసాయ కమీషనరేట్, విత్తన దృవీకరణ కేంద్రాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తితో ఆంధ్ర ప్రాంతంలోని కోస్తా జిల్లాలకు సమానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాంతాలలో సమాన నిష్పత్తిలో శాసనసభ స్థానాలు ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
రాయలసీమ ప్రాంత అభివృద్ధి బోర్డు ను నిపుణులతో ఏర్పాటు చేయాలి. ఇతర ప్రాంతాలతో సమాన అభివృద్ధి సాధించటానికి అవసరమైన బడ్జెట్ నిధులను రాయలసీమకు కేటాయించాలని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో రాయలసీమ విద్యార్థి నాయకులు శ్రీరాములు, సీమ కృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, రవి కుమార్, రంగముని నాయుడు, బాస్కర నాయుడు, న్యాయవాది నాగలక్ష్మి దేవి, రాయలసీమ ప్రజా సంఘాల నాయకులు రాజు, కృష్ణయ్య, నాగభూషణం, సుంకన్న, భాస్కర్ రెడ్డి, రైతు నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి, వై ఎన్ రెడ్డి, శివనాగి రెడ్డి, ఉపాధ్యాయ నాయకులు బ్రహ్మానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.