బంగారు ఎపుడూ వన్నె తగ్గకుండా నిగనిగలాడుతూ ఉంటూంది. దేనితో కూడా కెమికల్ రియాక్షన్ ఉండదు. మసక బారదు. ఇలాంటి అద్భుతమయిన బంగారు ధర మాత్రం చీటికి మాటికి పెరుగుతూ ఉంటుంది. పడిపోతూ ఉంటుంది. మొన్నా మధ్య అమెరికా చైనాల మధ్య వాణిజ్య పరమయిన గొడవలు జరగుతున్నపుడు బంగారు విపరీతంగా పెరిగింది. ఇపుడు తాజాగా నిన్న అమెరికా వాళ్లు ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఇరాన్ కు చెందిన టాప్ మిలిటరీ జనరల్ కాసిమ్ సొలేమాని ను హత్య చేశాక బంగారు ధర మళ్లీ అమాంతం పెరిగింది.
అమెరికా వాళ్లు జనరల్ సొలేమాని వాహనం మీద మిసైల్స్ దాడులు జరిపి చంపేశారు. దీని మీద తీవ్రమయిన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
దీనితో మధ్య ప్రాచ్యంలోొ టెన్షన్ మొదలయింది. దీని ప్రభావం మొదట ఇండియా స్టాక్ మార్కెట్ పడింది. గత కొద్ది రోజులుగా జోరుగా ఉన్న స్టాక్ ధరలకు కళ్లెం పడింది. అంతేకాదు, ఇక క్రూడాయిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళన దేశంలో మొదలయింది.
ఇదే జరిగితే ప్రభుత్వం ఆర్థికరంగ అంచనాలు కొత్త సంవత్సరం మొదట్లోనే తలకిందులవుతాయి. కేంద్ర ఇప్పుడే 2020-21 బడ్జెట్ తయారీకి పూనుకుంది. ఇందులో ప్రజలకు ఇవ్వాలనుకున్న కానుకలన్నింటిని ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది.
ఇపుడు దీని ప్రభావం బంగారు ధర మీద పడింది. మల్టీ కమోడటీ ఎక్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధరలు 2 శాతం పెరిగాయి.అంటే పది గ్రాముల ధర రు. 835 పెరిగి రు. 40115 కు చేరుకుంది.
గత రెండు వారాల్లో భారత దేశంలో బంగారు ధరలు పదిగ్రాముల మీద దాదాపు రు. 2000 పెరిగాయి. ఇప్పటికే డాలరు మీద రుపాయ ధర పడిపోతూ ఉండటం , అంతర్జాతీయంగా బంగారు ధరలు పెరుగుతూ ఉండటంతో ఇలా పదిగ్రాముల బంగారు ధర బాగా పెరిగింది.
ఈ రోజు వెండి ధరలు కూడా బాగా పెరిగాయి. కిలోగ్రాము వెండిధర 1.7 శాతం పెరిగింది. అంటే రు.814 లు పెరిగి కిలో ధర రు.47,836 గ్రాములకు చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర ఒక శాతం పెరిగి ఔన్స్ ధర 1,543.66 డాలర్లకు చేరింది. నిన్న అమెరికాజరిపిన దాడిలో ఖాసిమ్ సొలేమాని చనిపోవడంతో మధ్య ప్రాచ్యంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే పెరిగేవి బంగారు ధరలే. ఎందుకంటే, ఇలాంటి రాజకీయ సంక్షోభ సమయంలో ప్రజలు స్టాక్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని దెబ్బతినని బంగారు కొనుగోలు చేయడం మొదలుపెడతారు. అందుకే సంక్షోభసమయాల్లో బంగారు ధరలు పెరుగుతాయి.
భారతదేశంలో బంగారు ధర బాగా ఎక్కువగా ఉండేందుకు కారణం బంగారు మీద 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జిఎస్ టి ఉంటుంది.