రాయలసీమ డిమాండ్ల మీద ప్రముఖ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ పూర్తి పాఠం.
జి.ఎన్ రావు , బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికల ఆధారంగా ఈ నెల 27 న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొంటారని తెలుస్తుంది. ఈనేపథ్యంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కింది అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
*ఉత్తరాంధ్రలో ప్రధాన సచివాలయం, హైకోర్టు బెంచ్, వేసవికాల అసెంబ్లీ, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్నవిధంగానే,
*ఆంధ్రలో ప్రధాన అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కీలక పాలన కార్యాలయాలు ఉన్నవిధంగానే,*
*రాయలసీమలోను ప్రధాన హైకోర్టు తోపాటు,… వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మినీ సెక్రటేరియట్ నెలకొల్పాలి. విశాఖపట్నం, విజయవాడలకు దీటుగా ఒక ముఖ్యపట్టణం రాయలసీమలో అభివృద్ధి అయ్యేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.*
*రెండు వేరు వేరు హైకోర్టు బెంచిలను, వేరు వేరు ట్రిబ్యునల్ లను ఇతర ప్రాంతాలలో నెలకొల్పి కేవలం నాలుగు జిల్లాలకు పరిమితమైన హైకోర్టుతో సీమ ప్రాంతానికి న్యాయం జరగదు. రాజధాని , హైకోర్టు విషయంగా శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తి పూర్తిగా సీమకు నెరవేరదు. ఇన్నాళ్ళు నష్టపోయిన సీమకు మరో సారి నష్టం కలగరాదని తెలియచేస్తున్నాం.*
*మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవం కోసం మూడు ప్రాంతాలలో సమాన అభివృద్ధి ప్రాతిపాదికగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. వచ్చే రోజులలో ఆయా ప్రాంతాల అవకాశాలు, సహజవనరులు, సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలు, సాగునీటి వసతి తదితర అంశాలలో వికేంద్రీకరణకు అడుగులు వేయాలని కోరుతున్నాం.