కర్నూలులో జనవరి 4-5 తేదీలలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం

(డాక్టర్ బిఆర్ ప్రసాద్ రెడ్డి*)
ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్  44 వ వార్షిక సమావేశం 2020 జనవరి 4, 5 తారీఖులలో కర్నూలులోని కె.వీ.ఆర్. ప్రభుత్వ మహిళ కళాశాలలో జరుగుతుంది.  ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షునిగా ఆంద్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు కె. తిమ్మ రెడ్డి, ప్రధాన అధ్యక్షునిగా నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డీ. భాస్కర మూర్తి వ్యవరిస్తారు.
 ప్రాచీన ఆంధ్ర చరిత్ర మరియు పురవాస్తుశాస్త్రం అనే అంశంపై జరిగే సమావేశానికి చెన్నైలోని శర్మ వారసత్వ విద్యాకేంద్రం ఆచార్యులు శాంతి పప్పు, ‘మధ్యయుగ ఆంధ్ర చరిత్ర’ అనే అంశం ఫై జరిగే సమావేశానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య రేఖ పాండే, ఆధునిక ఆంధ్ర చరిత్ర అనే అంశం ఫై జరిగే సమావేశానికి విజయవాడ ఆంద్ర లయోలా కళాశాలకు చెందిన డా. మొవ్వ శ్రీనివాస రెడ్డి, చరిత్ర పరిశోధన పద్దతి అనే అంశం ఫై జరిగే సమావేశానికి కలకత్తా విశ్వవిద్యాలయం చరిత్ర ఆచార్యులు అరుణ్ కె. బందోపాధ్యాయ స్థానిక చరిత్ర అనే అంశంపై జరిగే సమావేశానికి కర్నూలుకు చెందిన ప్రముఖ న్యాయవాది  కె. సి. కల్కూర  అధ్యక్షులుగ వ్యవహరిస్తారు.
మొదటి రోజు సాయంత్రం జరిగే ప్రత్యేక సమావేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం చరిత్ర ఆచార్యులు అరుణ్ కె. బందోపాధ్యాయ మామిడిపూడి వెంకట రంగయ్య స్మారకోపన్యాసం చేస్తారు.
లౌకిక దృక్పథంతో శాస్త్రీయంగా చరిత్రను రచించడం, అభివృద్ధి చేయడం, చరిత్ర అధ్యయనం, పరిశోధనకు తగిన తోడ్పాటును అందిచడం కోసం జాతీయ స్థాయిలో “ఇండియన్ కౌన్సిల్ అఫ్ హిస్టారికల్ రీసెర్చ్” ఏర్పాటైనది.
 దీని స్ఫూర్తిని ప్రాంతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి కొత్త దృష్టితో చరిత్రను అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి కల్గిన సభ్యులందరినీ ఒక చోటికి తీసుకురావడానికి జరిగిన ఉద్యమ కృషిలో భాగంగా “ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్” రూపుదిద్దుకుంది.
సురవరం ప్రతాప రెడ్డి, రాళ్లబండి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, చిలుకూరి వీరభద్ర రావు మొదలగు ప్రసిద్ధ చరిత్రకారుల ప్రేరణతో ఆంధ్రుల చరిత్ర అధ్యయనం, పరిశోధనకు 1976 సంవత్సరంలో డా. ఎం. పట్టాభి రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో కావలిలోని జవహర్ భారతి కళాశాలలో మొట్టమొదటి సమావేశం జరిగింది.
చారిత్రక అధ్యయనాలను ప్రోత్సహించడం, చరిత్ర పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడం, చరిత్ర రచనలో ఉన్న సమస్యలను చర్చించడం, శాస్త్రీయ చరిత్ర రచనకు పునాదులు వేయటం మొదలగు లక్ష్యాలను నిర్దేశించుకొని, బలమైన అధ్యయన పునాదుల మీద కంభంపాటి సత్యనారాయణ, బంగోరె లాంటి ప్రముఖ చరిత్రకారుల మద్దతుతో ఏర్పాటైన “ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్” మొదటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మేధావులు, పరిశోధకులు పాల్గొన్నారు.
అప్పటినుంచి ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా వార్షిక సమావేశాలు నిర్వహించడం, వార్షిక కార్యకలాపాలను ప్రచురించడం, మోనోగ్రాఫ్ లు తీసుకురావడం, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం, సమగ్ర  ఆంధ్రప్రదేశ్ చరిత్రను తయారుచేయడం మొదలుగు కార్యక్రమాలు చేస్తున్నారు.  రుద్రయ్య చౌదరి, సుబ్రహ్మణ్యం మొదలగు మహనీయులు అంకిత భావంతో చేసిన కృషి వల్ల సంస్థ బలపడ్డది.
ఆంద్ర ప్రదేశ్ లోని విభిన్న ప్రాంతాలలో ప్రాతినిధ్యం వహించే అన్ని వర్గాల ప్రయోజనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, బయట రాష్ట్రాల చరిత్రకారులు, పరిశోధకులతో సంభందాలు ఏర్పరుచుకొని బలపరచుకోవడం, ప్రాంతీయ, జాతీయ స్థాయి దృక్పధాలు గల పరిశోధకుల మధ్య సంభాషణ జరిగేలా చూడడం, గొప్ప గొప్ప చరిత్రకారులు తమ రచనల ద్వారా ఆంద్ర ప్రదేశ్ చరిత్రకు ఇతోధిక తోడ్పాటునందించడం ద్వారా సంస్థ విజయవంతంగా నడుస్తోంది.
గుంటూరు కేంద్రంగా నడుస్తోన్న ఈ సంస్థ జరిపే వార్షిక సమావేశాలలో రొమిలా థాపర్, బిపిన్ చంద్ర, ఆర్. ఎస్. శర్మ, ఇర్ఫాన్  హబీబ్, సుమిత్ సర్కార్, హార్బన్స్ ముఖియా వంటి ప్రముఖ చరిత్రకారులు హాజరై అధ్యక్షత వహించి చర్చలు సుసంపన్నం చేశారు.
కడప, నెల్లూరు, గుంటూరు మొదలగు పట్టణాలలో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక చరిత్ర అధ్యయనాలను ఈ సంస్థ చేపట్టింది.
“ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర – సంస్కృతి”ని భావితరాల వారికి అందించుటకు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ప్రధాన సంపాదకత్వంలో “Comprehensive  History and Culture of Andhra pradesh” ను ఆంగ్ల మరియు తెలుగు భాషలలో తొమ్మిది సంపుటాలను ఆధార ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రచురించటం జరిగింది.
అంతేకాకుండా వీటిని డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది.  ప్రస్తుతం తెలుగు వారి చరిత్రపై వెలువడ్డ ఉత్తమ గ్రంధాలను ఎంపిక చేసి ప్రచురించాలని సంస్థ అభిమతం.
  ఈ ప్రయత్నంలో భాగంగా ప్రప్రథంగా నలభై మూడవ సమావేశంలో కీ.శే. ఆచార్య కె. సుందరం రచించిన ప్రముఖ చరిత్ర గ్రంధం “మధ్య యుగ ఆంధ్ర దేశం” ను పునర్ముద్రించి  ఆవిష్కరణ చేశారు.
ఈ విధముగా ఆధార ప్రదేశ్ చరిత్ర రచన, పరిశోధన, అధ్యయనం కోసం నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేయుచున్న “ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్” నలభై నాల్గవ సమావేశం ఈ సారి డా. ఇందిరా శాంతి గారి ఆధ్వర్యంలో కర్నూలులోని కె.వీ.ఆర్. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2020 జనవరి 4 మరియు 5 వ తేదీలలో జరుగుతున్నది.
చరిత్ర కారులు, పరిశోధకులు,  విద్యార్థులు, చరిత్ర ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రముమును విజయవంతం చేయవలసినదిగా విజ్ఞప్తి.
(*Dr. B. R. Prasad Reddy, General Secretary, AP History Congress)