కమిటీ నివేదిక రాకముందే జగన్ మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారు?

(ఒక విశ్లేషణ)
ఏ రాష్ట్రంలో గాని ప్రాంతీయ అసమానతలు వున్నంత వరకు ప్రత్యేక వాదనలు వినిపించడం సహజం . తెలంగాణ ఎందుకు విడిపోయిందో అనుభవం మన కళ్ల ముందుంది. వాస్తవం చెప్పాలంటే అవశేష ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ అసమానతలు నివారించాలని అభివృద్ధి వికేంద్రీకృత చేయాలనే ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణకు పూనుకుంటున్నందున రివర్స్ ఫలితాలు వచ్చే ప్రమాదం పొంచి వుంది. తుదకు మూడు రాజధానుల ప్రతి పాదన మూడు ప్రాంతాల్లో అలజడులకు దారి తీస్తుందేమో.ఇటీవల వరకు రాయలసీమలో సాగుతుండిన ఆందోళన ప్రస్తుతం అమరావతి రాజధాని గ్రామాల్లో మొదలైంది. కోస్తా జిల్లాలకు వ్యాపిస్తే రాష్ట్రంలో అగ్గి రగలేసినట్లే.
రాజధాని తరలి పోతుందని కోస్తా జిల్లాల ప్రజలు మరో వైపు రాష్ట్ర మంత్రులు కొందరు చెబుతున్నట్లు నిపుణులు కమిటీ నివేదిక మేరకు శాసన సభలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు అటు ఇటుగా తారు మారైతే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల ప్రజలు రోడెక్కే అవకాశముంది. మున్ముందు ఏం జరుగుతుందో ఏమో గాని ఇది స్వయంకృతాపరాధమే. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావించి పరిపాలన అన్ని ప్రాంతాలకు పంచ బోయి అంతిమంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమౌతుందేమో.
చంద్రబాబు నాయుడు హయాంలో
ప్రాంతీయ అసమానతలు నివారింప బడక పోగా మరింత పెరిగాయి. తెలుగు దేశం అయిదు ఏళ్ల పాలన కాలంలో పరిపాలన వ్యవస్థ కేంద్రీకృత మైనా కనీసం అభివృద్ధి అయినా అన్ని జిల్లాల్లో ఒకేలా వుండునట్లు అనువైన చర్యలు చేపట్ట బడ లేదు. అయిదు ఏళ్లకాలం ఏమంత తక్కువ కాదు. అద్భుత రాజధాని అమరావతి నిర్మాణంతో హైదరాబాద్ లాగా ఆర్థిక ఆదాయ వనరులు లభించే నగర నిర్మాణమే ధ్యేయంగా అయిదు ఏళ్లు గడిపారు. అయితే పరిపాలన రాష్ట్రం నడి బొడ్డున వుండటం వలన మూడు ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా వుండినది. అదే సమయంలో పరిపాలన కేంద్రంగా వున్న జిల్లాల్లో రియల్ ఎస్టేట్ విలువలు పెరిగి సంపద కేంద్రీకృతం అయింది. మరో వైపు వెనుక బడిన జిల్లాల అభివృద్ధి ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుండి పోయింది అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా వుండునట్లు ప్రభుత్వ విధానాలు కొనసాగివుంటే ఈ రోజు పరిపాలన వికేంద్రీకృతం కావడం సరికాదని చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదనకు తిరుగు లేని బలం వుండేది.
ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గైకొంటున్న మూడు రాజధానుల ప్రతిపాదనలు వివిధ ప్రాంతాల సామాన్య ప్రజలను ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఎక్కువగా వున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గత అయిదు ఏళ్లు అభివృద్ధిని వికేంద్రీకృతం చేయకపోవడం వలన వివిధ ప్రాంతాల్లో తలెత్తిన అసంతృప్తి ఆగ్రహం ముఖ్యమంత్రి ప్రతి పాదనకు జవం జీవం చేకూర్చుతోంది. అయితే ఇది షోడా బుడ్డి గ్యాస్ లాంటిదే. దీర్ఘకాలికంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల సిద్దాంతం తెర మీదకు తేవడానికి బలమైన నేపథ్యముంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతి పాదన తుగ్లక్ చర్యగా కొందరు భావించ వచ్చు. గాని అది సరికాదు. వ్యూహాత్మకంగనే ఈ ప్రతి పాదన రూపు దిద్దు కొన్నది. తన పార్టీ రాజకీయాల ప్రయోజనాలతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాని ముఖ్యమంత్రి ఒక విధంగా ఆలోచించితే మున్ముందు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం లేక పోలేదు.
చిరకాలంగా అన్ని రంగాల్లో రాయలసీమ వెనుక బడి వుంది. 1937 లో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడిక అమలు కాలేదు. ప్రధానంగా సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. ఎన్టీఆర్ రాయలసీమకు మిగులు జలాలతో ప్రాజెక్టులు ప్రతి పాదించినా 2004 లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గాని అవి నిర్మాణం ప్రారంభం కాలేదు. ఈ వారసత్వంతోనే 2014 లో కూడా వైసిపి సీమ ప్రాంతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. 2014 నుండి అయిదు ఏళ్ల కాలంలో శ్రీ బాగ్ ఒడంబడిక మేరకు కనీసం హైకోర్టు కూడా దక్కక పోవడం సాగునీటి రంగంలో పురోగతి లేక పోవడం పైగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం తోడై 2019 ఎన్నికల్లో వైసిపి రాయలసీమలో స్వీప్ చేసింది.
గమనార్హమైన అంశ మేమంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సీమ వాసులకు ఎట్టి వాగ్దానాలు చేయకున్నా సీమలో ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తే తమకు మేలు జరుగుతుందనే భావనతోనే 59 స్థానాలకు 49 స్థానాలు కట్ట బెట్టారు. ఈ దశలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు రెండే మార్గాలున్నాయి 1) రాయలసీమకు హైకోర్టు అయినా ఇచ్చి సీమ వాసులను సంత్రుప్తి పర్చడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రి ద్వారా రాయలసీమలో లభ్యమైన రాజకీయ అండ వదులు కొనేందుకు సిద్ధం కాక పోవడం. . 2)హైకోర్టు రాయలసీమ తరలించడం ద్వారా ఇతర ప్రాంతాల్లో వచ్చే వ్యతిరేకత తగ్గించుకోనేందుకు కనీసం ఉత్తరాంధ్రను సంత్రుప్తి పర్చడం. వెనుక బడిన తమ ప్రాంతమైన రాయలసీమకు హైకోర్టు ఇచ్చిన ముఖ్యమంత్రి ఆలాగే వెనుకబడిన తమకేం చేశారని ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీసే అవకాశం వున్నందున పరిపాలన రాజధాని విశాఖ కు ప్రతి పాదించారు. ఇవన్నీ ఒక గొలుసులో లింకులుగా తయారైనవి.
.రాయలసీమ సెంటు మెంటు బలంగా లేకుంటే అమరావతి కాకుంటే దొన కొండ మొత్తం రాజధాని అయ్యేది.అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని వికేంద్రీకృతం చేయకపోవడం అనంతపురంలో ఆయన మాటల్లోనే చెప్పాలంటే చిన్న చిన్న (ఆయన దృష్టిలో మాత్రం చిన్నవి) తప్పులు ఇంకా మరికొన్ని కారణాలు తోడై ప్రజల నుండి వ్యతిరేకత తెచ్చుకొని తుదకు ఓటమి పాలైతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే మరో రూపంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తూ మున్ముందు చేదు అనుభవాలకు రాచ బాట వేసుకుంటున్నారు. .
తమకు అనూహ్యంగా ప్రజలు ఎందుకు పట్టం గట్టారో వైసిపి మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని సమగ్ర అవగాహన వున్నట్లు లేదు. 2004 లో చంద్రబాబు నాయుడును వదిలించు కోవాలని ప్రజలు ఏలా భావించారో అంతకన్నా ఎక్కువగా 2019 ఎన్నికల్లో ప్రజలు భావించి వైసిపిని అందల మెక్కించారు. కాని వైసిపి అధిష్టాన వర్గం మాత్రం అంతా తమ మాయ అనుకుంటూ భ్రమలో వున్నందున తాము ఏం చేసినా ప్రజలు ఆమోదించుతారనే విధానాలు ఇన్ని తిప్పలు తెచ్చి పెడుతున్నాయి .
భావోద్వేగాల మధ్య ముఖ్యమంత్రి ప్రతి పాదించిన మూడు రాజధానుల ఫార్ములా వెంటనే చేదు అనుభవం మిగల్చక పోవచ్చు. గాని రోజులు గడిచే కొద్దీ సామాన్య జనం ఎదుర్కొనే ఇబ్బందులతో క్రమేణా ప్రజాగ్రహం చాప కింద నీరు లాగా వ్యాపించి తుదకు పుట్టి ముంచే ప్రమాదం లేక పోలేదు. తుదకు హైకోర్టు లభించనున్న కర్నూలు జిల్లా ప్రజలకూ మున్ముందు ఊరట లభించక పోవచ్చు. విశాఖ రాజధాని వెళ్లి మంత్రులను అధికారులను కలుసుకుని రావాలంటే కనీసం పది నుండి పండ్రెండు గంటల ప్రయాణం చేయ వలసి వుంటుంది. కనీసం మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈ ఇబ్బందులు రాయలసీమ అన్ని జిల్లాల సామాన్య జనం ఎదుర్కో వలసి వుంటుంది. వాస్తవం చెప్పాలంటే హైకోర్టు కర్నూలుకు వచ్చిన ఆనందం కన్నా కాలం గడిచే కొద్ది రాజధాని విశాఖ కు వెళ్లి వచ్చే ఖర్చులు కాల వ్యవధి తడిసి మోపెడై వైసిపి ప్రభుత్వం ప్రజల నుండి అసంతృప్తి ఆగ్రహం ఎదుర్కోవలసి వుంటుంది.
అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు హైకోర్టు పనుల మీద రావాలంటే కనీసం మూడు నాలుగు రోజులకు తోడు ప్రస్తుతం కన్నా అత్యధికంగా చేతి చిలుము వదిలించు కోవలసి వుంటుంది.
వాస్తవంలో రాయలసీమ ప్రాంత ప్రజల్లో పట్టునిలుపు కొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పరిపాలన వికేంద్రీకృతం తాత్కాలికంగా ఉపశమనం కలిగించ వచ్చునేమో గాని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలకు మించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చవి చూడవలసి వుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుతం రాయలసీమ జిల్లాల నుండి గాని అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి గాని ఉదయం బయలు దేరి అమరావతి వచ్చి పనులు పూర్తి చేసుకొని తిరిగి రాత్రికే ఇళ్లకు చేరుతున్నారు. రాజధాని రాష్ట్రం నడి బొడ్డున వున్నందున మిగిలిన అన్ని ప్రాంతాల వారికి సౌలభ్యముంది. హైకోర్టు కర్నూలులో వున్నా బెంచిలు మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పెద్దగా ఇబ్బందులు వుండక పోవచ్చు. పరిపాలన రాజధాని ఆలా కాదు. రాష్ట్రం ఒక మూలన పరిపాలన రాజధాని వుంటే తుదకు తన స్వంత జిల్లా కడప ప్రజలు కూడా సంతోషించుతారని భావించ లేము.
వీటన్నింటికీ మించి ఉద్యోగుల సమస్య మరీ జఠిలం అవుతుందేమో. అయిదు ఏళ్ల క్రితం హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగులు నివాస గృహాలు మొదలుకొని పిల్లల చదువుల వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే కుదట పడుతున్న దశలో తిరిగి విశాఖ వెళ్లాలంటే కాగితాలపై ఆదేశాలు ఇచ్చినంత తేలిక కాదు. ముఖ్యమంత్రి మంత్రులు నివాసాలు అతి సునాయాసంగా కాపురాలు మార్చ వచ్చు గాని సామాన్య ఉద్యోగి అంశం ఆలా కాదు. అమరావతి వచ్చిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు బస్సులో కొంత కాలం కాపురం చేశారు. తను ఎంత కష్ట పడుతున్నారో చూడమని ఉద్యోగులకు పాఠాలు చెప్పారు. ఉద్యోగులను కూడా త్యాగం చేయమని ఉపన్యాసాలు ఇచ్చారు. . ముఖ్యమంత్రి కో అంటే కోటి మంది సపర్యలు చేస్తారు. కాని సామాన్య ఉద్యోగులకు పలికే దిక్కు వుండదు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని విశాఖకు మార్చి చంద్రబాబు నాయుడు లాగా ఉపన్యాసాలు దంచ వచ్చు. అవేవీ లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేవు.వీటికి తోడు పరిపాలన రాజధాని విశాఖలో వుంటే శాసన సభ సమావేశాలు జరిగే సందర్భంలో అధికార యంత్రాంగం మొత్తం అమరావతి వస్తే ఖర్చు ఎంత అదనంగా వుంటుందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందుకు ఎంత వరకు అనుమతించు తుందో ఇవన్నీ సమస్యలే.
.
ఈ సమస్యలకు తోడు రాజధాని గురించి రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చూస్తే ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ల కథ గుర్తుకొస్తోంది. తొలుత మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదన్నారు. తీరా శాసన మండలిలో రాజధాని మార్చేది లేదన్నారు. వెంటనే మరో మంత్రి నిపుణుల కమిటి నివేదిక రావాలన్నారు. ఈ విషయమే మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో చెప్పి వుంటే సరి పోయేది. తీరా శాసన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు రావచ్చు అని చెప్పారు. తీరా మరు రోజు ఒక మంత్రి మూడు చోట్ల రాజధానులు వుండే అవకాశాలు వున్నాయంటూ ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారని నిపుణులు కమిటీ నివేదికలో అలా వుండొచ్చుఉండక పోవచ్చని ముక్తాయించారు. అసలు నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు ఇన్నాళ్లూ నోరు విప్పని ముఖ్యమంత్రి ఆగివుండ వచ్చు. పైగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తప్పు ఒప్పు అయినా ప్రభుత్వ విధానాన్ని ఒక మంత్రి ముఖ్యమంత్రి అభిప్రాయంగా వ్యాఖ్యానించడం మరీ అబ్బురం. ఇదంతా పరిశీలిస్తుంటే రాజధాని అంశంలో వైసిపిలో క్లారిటీ లేదా? లేక ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు వైసిపి అధిష్టాన వర్గం పథకం ప్రకారం వ్యవహరిస్తోందా?
ఇందులో ఏది నిజం ఏది అవాస్తవమైనా రాష్ట్రం రావణ కాష్ఠం కాకూడదని ఆశిద్దాం!.
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
(విశాలాంధ్ర డిసెంబర్ 20.2019 సంచికలో ప్రచురిచితమైన ఆర్టికల్. )