(‘అమ్మ పేరే నా కవిత్వం ‘ వచ్చి ఒక సంవత్సరం అయింది. ఈ పుస్తకాన్ని ఎందరో సమీక్షించారు. ప్రశంసించారు. కవిత్వానికి ఎందరినో అభిమానులుగా మార్చిందీ సంకలనం. ఈ సందర్భంగా అమ్మ పేర కవిత్వం ఎందుకు రాశాడో కుంచెశ్రీ వివరిస్తున్నారు.)
ఒక కవిత రాయాలనుకున్నప్పుడు నేను ఒక కవిగా ఏ అంశాన్ని పాఠకునికి చెప్పాలనుకున్నానో, ఏ అంశాన్ని తీసుకొని కవిత రాస్తున్నానో ఆ అంశాన్ని కవితా వస్తువుగా ఎన్నుకుంటాను.
కవులు దాదాపుగా సామాజిక అంశాలు వస్తువులుగా తీసుకొని కవితలు రాస్తుంటారు. లేదా దేశనాయకుల గురించి రాస్తుంటారు.
కానీ నేను ఈ అమ్మపేరే నా కవిత్వం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నేడు ఎంతో మంది తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాల్లో వదలడం లేదా వారిని ఇంటినుంచి తరిమేయడం లేదా వారి ఉద్యోగాల కోసం దేశాల దాటిపోవడం అలాంటి వాళ్లందరినీ చూశాను. అలాంటి అమ్మలు వారు పడుతున్న కష్టాలు చూసి మొదట్లో అమ్మను కవితా వస్తువుగా చేసుకొని కవితలు రాయాలనుకున్నాను.
కానీ నాకు మా అమ్మ గురించే రాద్దాము అనిపించింది. నాకు మా అమ్మకు మధ్య జరిగిన విషయాలను చిన్నప్పటి నుండి అంటే నేను అమ్మ కడుపులో ఎలా పడి ఉంటానో అనే సృజనాత్మకతో ఆలోచించి అక్కడి నుండి నా కవిత్వం మొదలైంది.
కవికి సృజనాత్మక కళ ఉండాలి అప్పుడే కవిత బాగారాయగలుగుతాడు. అలా.. అలా.. మా అమ్మపైన కవితలు దాదాపు పది కవితలు రాసుంటాను. చాలా రోజులకు అంటే ఓ రెండు సంవత్సరాలు మరలా అమ్మపైన రాసే ఆ కవితలు రాయడం ఆపేసి కవితలు కథలు రాసున్నప్పుడు మా అమ్మ పెరాలసిస్ వచ్చి మంచంపై పడిపోయింది. అమ్మకి ఒక కాలు ఒకచేయి పడిపోయింది. తన కాలకృత్యాలు తాను చేసుకోలేకపోయేది. అలా అమ్మకి అన్ని పూటలా భోజనం తినిపించడం, మాత్రలు వేయించడం, మాత్రలు వంటబట్టక వాంతులు చేసుకుంటే శుభ్రం చేయడం ఇలా రోజుకు 24 గంటలూ పక్కనే ఉండేవాడిని. రోజూ మా అమ్మ పట్టిన దుస్థితిని చూసి నాలో నేను కుమిలిపోయేవాడిని.
రోజూ కాలకృత్యాలలో మలం కడగడం, నీళ్ళు పోయడం, ఇలాంటివి చేసేటప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు కారేవి. మా అమ్మ శరీరంకు నా చేతులు ఎక్కడెక్కడో తగులుతుంటే కుమిలిపోయేవాడిని, ఇలా చేస్తూ ఏరోజుకారోజు జరిగిన సంఘటనల్ని వాటికి అక్షర రూపం ఇస్తూ వచ్చాను. మా అమ్మకి ప్రాణం ఉన్నప్పుడే తనకు ఈ “అమ్మ పేరే నా కవిత్వం” అనే పుస్తకం అంకితం చేయాలని సంకల్పించాను. అనుకున్నట్లుగానే మా అమ్మకు అమ్మపేరే నా కవిత్వం కవిత్వసంపుటి అంకితమిచ్చాను. ఈ పుస్తకం ముద్రణ అవ్వడానికి, అలాగే పుస్తకావిష్కరణ జరగడానికి నాకు సాహితీ మిత్రులు ఆర్థికంగా మరియు శారీరక శ్రమతో నాతోడై నన్ను ముందుకు నడిపించినందుకు వారికి నా కృతజ్ఞతలు.
(కుంచె శ్రీ, ఎద్దులపల్లి 9908830477)