రాజధాని మార్పు ఆలోచన తొలి ప్రయోజనం రాయలసీమకు దక్కాలి.
రాజధాని అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సూచన ప్రాయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అసాధ్యమైన నూతన నగర నిర్మాణం ఊహ నుంచి బయటకు రావాలన్న నిర్ణయం, మూడు ప్రాంతాలు సమతుల్యతతో అభివృద్ధి జరగాలన్న ఆలోచన కూడా సముచితమైన ఆలోచన.
మహానగరం ఒక కల మాత్రమే. అది పాలించే వారి ఆనందం , పేరు ప్రతిష్టల కోసం నిర్మించేది ఏ మాత్రం కాదు. ఎందుకంటే ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం. 13 జిల్లాలు 5 కోట్ల జనాభా కలిగి విశాఖ , రాజమండ్రి , కాకినాడ , విజయవాడ , గుంటూరు , నెల్లూరు , తిరుపతి , కర్నూలు లాంటి నగరాలు అందుబాటులో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త నగర నిర్మాణం అనవసరం , అసాధ్యం. కానీ చంద్రబాబు గారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి మహానగర నిర్మాణానికి పూనుకున్నారు. ఆచరణ సాధ్యం కాని నిర్మాణానికి పూనుకోవడం వల్ల రాష్ట్ర వనరుల కేంద్రీకరణ ఫలితం రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రాంతం నష్ట పోవడంతో బాటు తిరుపతి , విశాఖ నగరాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈనేపధ్యంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహానగర ఉహాలనుంచి బయటకు రావడం సముచిత నిర్ణయం.
రాజధాని మార్పు ఆలోచన తొలి పలితం రాయలసీమకు దక్కాలి
ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రరాష్టంగా విడిపోవాలని నిర్ణయించుకున్నపుడు సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకున్నది రాయలసీమ. విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని మరోమారు కోల్పోయింది కూడా రాయలసీమనే. పూర్వ ఆంధ్రరాష్టం రూపంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపద్యంలో రాయలసీమకు రాజధాని రావడం నైతికం , చారిత్రక అవసరం. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు గారి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. నాటి నుంచి రాయలసీమకు రాజధాని కావాలని సీమ ప్రజలు పోరాడుతున్నారు. రాజధాని అమరావతి మార్పు సాధ్యం కాదు అన్న అభిప్రాయం పాలకులు చెప్పిన నేపద్యంలో కనీసం హైకోర్టు అయిన కావాలని సీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రాజధాని అమరావతిని పూర్తిగా మార్చక పోయినా పాక్షికంగా మార్చడానికి ఆసక్తి చూపుతున్నట్లు ముఖ్యమంత్రి మాటల బట్టి అర్థం అవుతుంది. చారిత్రకంగా , నైతికంగా రెండు సార్లు కోల్పోయిన రాయలసీమకు రాజధానిలో జరిగే మార్పు పలితం రాయలసీమకు దక్కడం సహజ న్యాయం. ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర , మధ్య కోస్తా , రాయలసీమ ప్రాంతాలు సమతుల్యత అభివృద్ధి కావాలని ఆకాంక్షించడం అభినందించదగ్గ పరిణామం. పాలన , కార్యనిర్వాహక , న్యాయ రాజధానులుగా మూడు ప్రాంతాను ఎందుకు చూడకూడదు అన్న తన ఆలోచనను ప్రజల ముందు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ నేపద్యంలో నీళ్లు , నిధులు , అభివృద్ధి విషయంలో తీవ్ర వివక్షకు గురి అయిన రాయలసీమ ప్రాంతంలో రాజధానిలో చేయబోతున్న మార్పు పలితాన్ని రాయలసీమకు ఇవ్వాలి.
రాయలసీమ సమాజం కీలక మలుపులలో దూరద్రుష్టితో వ్యవహరించక పోవడం వల్ల తీవ్రంగా నష్టపోయిన విషయం గుర్తెరిగి నేడు ముఖ్యమంత్రి మూడు ప్రాంతాలను సమతుల్య అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు , రాజకీయ పార్టీలు , సీమ ఆలోచనపరులు జరగబోయే మార్పులో రాయలసీమకు గరిష్ట ప్రయోజనం ఎలాంటి నిర్ణయం జరిగితే మంచిదో ఓపికగా , భావోద్వేగాలకు , రాజకీయ పార్టీల ప్రయోజనాలకు గురికాకుండా ముందుకు నడవాలి. సీమ ప్రజలకు అలాంటి చైతన్యం కలిగించేలా రాయలసీమ ఉద్యమ సంస్థలు , నాయకులు మార్గ నిర్దేశం చేయాలి.