పొద్దున ఎవరైనా ఇంటికొచ్చినపుడు టిఫిన్ (tiffin) చేయండనడం, టిఫిన్ చేస్తారా అని అడగడం సౌత్ ఇండియాలో అలవాటు. టిఫినంటే పొద్దునే తీసుకునే ఆహారం అని మనమనుకుంటాం. ఇంకొక విధంగా చెబితే టిఫిన్ అంటే బ్రేక్ పాస్ట్.
ఫుడ్ చరిత్రకారుల చెప్పిందాని ప్రకారం, ఇది సౌత్ ఇండియాలో మాత్రమే వినిపించే మాట.
ఒక వేళనార్త్ ఇండియాలో ఎక్కడయినా ఈ మాట వినిపించినా దాన్ని దక్షిణ భారతీయులే తీసుకెళ్లారునుకోవాలి. ఇక సౌత్ లో ఈ మాట ప్రాచర్యం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఇంటా ప్రతిహోటల్లో వినిపించే మాట.
పూర్వము హోటళ్లన్నీ టిఫిన్ , భోజనశాలలే. ఇపుడయితే సందుసందున టిఫిన్ సెంటర్లువెలిశాయి. అయితే, సింగపూర్ లో ఒక స్టార్ హోటల్ టిఫిన్ రూం చాలా పేమస్.
ఇంటిదగ్గిర టిఫిన్ చేసేందుకు రకరకాల టిఫిన్ ప్లేట్లు కూడ వచ్చాయి. ఈ మధ్య కాలంలో టిఫిన్ మధ్యాహ్నానికి, రాత్రికి కూడా విస్తరించింది. మధ్యాహ్నం ఆఫీసుల్లో భారీగా సౌత్ ఇండియన్ లంచ్ చేయడం సాధ్యంకాదు, అభిలషణీయం కూడా కాదు కాబట్టి లంచ్ టైంలో టిఫిన్ చేస్తుంటారు. ఇలాగే రాత్రి పూట వరిఅన్నం భోజనం చేయడం ఇష్టం లేని వాళ్లు కూడా లైట్ గా ఉంటుందని టిఫిన్ చేస్తుంటారు. టిపిన్ తీసుకెళ్లడం కోసం టిఫిన్ బ్యాక్సులు, టిఫిన్ క్యారియర్లు వచ్చాయి.
ఇలా సౌత్ ఇండియాలో పాతుకుపోయిన టిఫిన్ సంప్రదాయం వెనక చాలా కథ ఉంది. ఈ టిఫిన్ మాటని దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సొంత భాష పదంలాగా వాడేస్తుంటారు. ఇంతకీ టిఫిన్ అనే మాట ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్థిరపడిపోయింది… అనేవి చాలా ఆసక్తికరమయిన విషయాలు.
ఇది ఒక ఆంగ్లో ఇండియన్ పదం. ఈ పదం మొదట 1800 ప్రాంతంలో రికార్డయింది. తర్వాత హాబ్సన్ జాబ్సన్ లోకి వివరణతో సహా ప్రవేశించింది. బ్రిటిష్ వాళ్లతో పాటు అనేక మంది యూరోపియన్ వాళ్లు భారతదేశానికి వచ్చి ఇక్కడ తిష్ట వేశారు. అపుడు వాళ్ల వాళ్ల భాషల పదాలు భారతదేశంలోకి ప్రవేశించి స్థిరపడ్డాయి. ఇలా భారతీయు నోళ్లలో నానుతున్న ఆంగ్లోఇండియన్ వ్యవహారిక పదాలను సేకరించి వేసిన డిక్షనరీయే హాబ్సన్ జాబ్సన్. Hobson-Jobson డిక్షనరీ A Glossary of Colloquial Anglo-Indian Words and Phrases, and of Kindered Terms, Etymological, Historical, Geographical and Discursive అనే సబ్ టైటిల్ తో అచ్చయింది.
అనేక దేశాల యూరోపియన్ల రాకతో భారత దేశంలో ప్రాచుర్యంలోకి వచ్చిన అనేక పదాలకు అర్థాలు చెప్పే ఏకైక డిక్షనరీ ఇదే. టిఫిన్ అనే మాటకు మొదట అర్థం వివరణ చెప్పేందుకు ప్రయత్నించిన తొలి పుస్తకం ఇదే. హాబ్సన్-జాబ్సన్ డిక్షనరీ ప్రకారం, Tiffin అంటే లంచ్ అని అర్థం. అదొక ఇంగ్లీష్ వ్యహారిక మాట. ఇంగ్లీష్ to tiff అంటే మధ్యాహ్నం భోజనం చేయడం.అయితే, tafannun (diversion, amusement) అనే అరిబిక్ మాట నుంచి వచ్చిందని కొందరు, చైనా భాష ch’ih-fan ( వరి అన్నం తినడం) నుంచి వచ్చిందని మరికొందరు భావించినా దీనికి చారిత్రకాధారాలు లేవని ఈ డిక్షనరీ చెప్పింది.
చివరన, ఇది ఇంగ్లీషోళ్ల వ్యావహారికం నుంచి మాత్రమే వచ్చిందని ఈ డిక్షనరీ రాసిన వాళ్లు అభిప్రాయపడ్డారు. Tiffing అనే మాట Capt. Grose(1785)లోరాసిన Lexicon Balatronicum కనిపించిందని చెబుతూ భోజనాల మధ్య విరామలో ఏదో ఒకటి నమలడం, సేవించడం అని అర్థం పేర్కొన్నారు.
ఈ మాటకు మరికొన్ని కాలం చెల్లిన పదాల డిక్షనరీలో కొద్ది బీర్ లేదా ఆల్కహాలు సేవించడం అనే అర్థం సూచించారు. to tiff నుంచి tiffing అనే మాట వచ్చిందని ఇండియాలో వాడే టిఫిన్ కు మూలరూపం ఇదే అయి ఉంటుందని వారు చెప్పారు.
భాష గొడవ తర్వాత హబ్సన్-జాబ్సన్ డిక్షనరీ క్రోడీకరించిన వారు ఈ పదానికి అర్థం కనుగొనేందుకు 19వ శతాబ్దంలో ఇండియాకు వచ్చిన బ్రిటిష్ వారి ఆహారపు అలవాట్ల గురించి వివరించారు.
ఈ డిక్షనరీలోకి 1886లో ఈ మాట ప్రవేశించినా, భారతదేశంలో ఈ మాట బాగా ప్రచారంలో ఉందని వారు చెప్పారు. 1811 నాటి ఒక నవలలో కూడా టిఫిన్ అనే మాట ఉందని వారు ఉదహరించారు. 1807 తర్వాత ఈ మాట రాతలో బాగా వాడకంలోకి వచ్చిందని చెప్పారు. Tiff అనే మాటకు రెండు గుక్కెలు మద్యం తీసుకోవడం అని అర్థం . మద్యాన్ని టిపుల్ అని కూడా అంటారు (Old Monk rum is my favourite tipple అని వోల్డ్ మాంక్ ప్రియులు అంటుంటారు). పగలు అలా ఇలా తిరిగి ఇంటికి వచ్చి రెండు గుక్కెలు మందు తీసుకోవడం బ్రిటన్ లో to tiff అవుతుంది.
ఇది బ్రిటిష్ ఇండియాలో లైట్ మధ్యాహ్న భోజనంగా మారింది. కెటి ఆచార్య రాసిని A Historical Dictionary of Indian Food దీనికి కొంత వివరణ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్లు రాత్రి ఫుల్ మీల్స్ లాగించే వాళ్లు. దీనికి సిద్ధం కావాలంటే మధ్యాహ్నం లైట్ గా తినాలి. ఇలా లై ట్ మధ్యాహ్న భోజనాన్ని టిఫిన్ అని పలిచేవాళ్లు. 1807 నాటికే కొన్ని పుస్తాకాలకు ఈ మాట ఎక్కింది. ఇలా లైట్ మధ్యాహ్నం భోజనం (టిఫిన్ ) ఏమితినేవాళ్లంటే సాలడ్, మిగిలిపోయిన చద్ది మాంసం,పళ్లు, ఇతర చిరుతిల్లేవయిన అందుబాటులో ఉంటే అవి. వీటి స్థానంలోకి మద్రాస్ ప్రెశిడెన్సీలో దోసే, ఇడ్లీలు, ఊప్మాలు వచ్చాయి.
ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ల కు భారీగా మధ్యాహ్నం భోజనం(లంచ్) తినడం ఇండియాలో కష్టమమయింది. ఇక్కడి వేడి వాతావరణంలో వాళ్లు భారీ లంచ్ కు ఆటంకమయింది. అందువల్ల లైట్ మిడ్డే మీల్ కు అలవాటుపడ్డారు. ఇదే టిఫిన్ అయింది. ఇలా మధ్యాహ్నం లైట్ గా టిఫిన్ చేసి రాత్రి డిన్నర్ ఫుల్ గా హెవీగా తినేవారు.
ఇక భారతీయుల విషయానికి వస్తే ఇలా లైట్ గా తినడం అనేది పొద్దున మాత్రమే ఉంటుంది. మధ్యాహ్నం ,రాత్రి దక్షిణ భారతీయులు చేసే భోజనాలు భారీగనే ఉంటాయి. లైట్ మీల్ అనేది (to tiff) అనేది పొద్దునే తినే ఆహారమే. కొంతమంది అల్పాహరం లని to tiff అని సంస్కృతీకరించారు. మిగతా అలగా జనం వ్యవహారికంలో మాత్రం ఇది టిఫిన్ గానే ఉండిపోయింది. ఈ టిఫిన్ పొద్దునే లైట్ గా చేసే బ్రేక్ ఫాస్ట్ కే పేరున్నా, ఇలా లైట్ గా మధ్యాహ్నం తీసుకున్నా, రాత్రి తీసుకున్నా అది టిఫినే అయిపోయింది. చాలా మంది ఆరోగ్యం కారణాలతో లైట్ గా ఉండాలని, లంచ్ టైంలో టిఫిన్ చేస్తారు.ఇదే విధంగా రాత్రి హెవీ మీల్స్ వద్దనుకునే వారు కూడా లైట్ గా టిఫిన్ చేస్తారు, ఇడ్లీతోనో, ఊప్మాతోనో.