పూర్తి మెజారిటీ ఏడాది కిందట రెండో సారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ కేవలం అత్తెసరు మార్కులనే వేస్తున్నారు. కెసియార్ ఏడాది పాలన మీద ఆయన ఒక సమీక్ష చేశారు. కెసిఆర్ రెండో విడత మొదటి సంవత్సరం ఆశించినంత బాగా లేదని దుర్గం అంటున్నారు. ఆయన సమీక్షను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఇది ఆ సమీక్ష:
తెలంగాణ సుపరిపాలన నినాదంతో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఏడాది పాలన అత్తెసరు మార్కులతో సాగింది.
కొన్ని అంశాల్లో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ సంస్కరణలు-అభివృద్ది అంటూనే పాత పద్దతులలోనే పాలన కొనసాగించారు. మాటలు మూరెడు పనులు బెత్తెడు అన్నట్లుగా పాలనా పనులు సాగాయి. సరి అయిన కారణం లేకుండానే సచివాలయాన్ని ముప్పై ముక్కలు చేసి పాలనను అస్తవ్యస్తం చేశారు.పాలన ఆ ఒక్కరి కనుసన్నల్లోనే పూర్తి ఫ్యూడల్ పద్దతిలో సాగింది. ఆర్టీసీ సమ్మె పై సకాలంలో స్పందించక అన్యాయంగా దాదాపు 30 మంది ఆర్.టి.సి.ఉద్యోగుల ప్రాణాలను ప్రభుత్వం బలి గొన్నది.
ఏడాదికాలంలో ఆసరా పింఛన్లు రెట్టింపైనవని చెప్తున్నప్పటికి ఏ రెండు నెలలు కూడా అవి సక్రమంగా అందడం లేదన్న విమర్శ ఉంది. రైతుబంధు పెంచినప్పటికి అవి అందరికీ అంద లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగినప్పటికి ఖర్చుకు తగిన పని జరగ లేదు.దాని నిర్మాణంలో భారీగా ముడుపులు చేతులు మారాయి అన్నది ఆరోపణ.
కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలు, ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు, కొల్లాపూర్, కోరుట్ల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, గ్రామ పారిశుధ్య కార్మికుల జీతాలు 8,500లకు పెంపు, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు,కొత్త మున్సిపల్ చట్టం అమలు,కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు,అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు ప్రారంభం,మణుగూరులో బీటీపీఎస్ మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ శాఖలో ఆర్టిజన్స్‌కు సర్వీసు రూల్స్ అమలు,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో మొదటిసారి గోదావరి జలాలు, ఎల్బీనగర్ ఫ్లెఓవర్, మైండ్‌స్పేస్ అండర్‌పాస్, బయో డైవర్సిటీ అండర్ పాస్, ములుగులో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హార్టికల్చర్ యూనివర్సిటీ భవనాల ప్రారంభం అయినట్లు ప్రభుత్వం చెప్తున్నది.
రాష్ట్రంలో మునుపటిలానే సగటున రోజుకు ముగ్గురు రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన ప్రతీ రంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడుతలో కొంత పట్టించుకున్నట్లు నటించినా,గత ఏడాదిలో దాదాపు అన్నీ రంగాలను గాలికి వదిలేసింది.నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ బృతి మాటను పూర్తిగా మరిచారు.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరు కిలోల బియ్యం, కేసీఆర్ కిట్స్, రైతుబంధు, రైతు బీమా లాంటి సంక్షేమ కార్యక్రమాలను తప్పని సరి అయి నడుపుతున్నారు, కానీ వాటి అమలులో అలసత్వం పుష్కలంగా కనిపించింది.
నేడు తెలంగాణలో పేదలకు,దళిత భాహు జనులకు కనీస జీవన భద్రత లేదు.పేద ,మధ్య తరగతి మహిళలు, పిల్లల్లో రక్త హీనత ఆందోళన కర స్థాయిలో ఉంది.ప్రభుత్వ విద్యా రంగం మునుపటి కన్నా అస్థ వ్యస్తంగా తయారయ్యింది. రక రకాల కారణాలతో వేలాది బడులను మూత వేశారు. ఇంటర్,డిగ్రీ కళాశాలలు పూర్తి నిర్లక్ష్యానికినికి గురయ్యాయి.విశ్వవిద్యాలయాలు 15-20 శాతంమంది ఆద్యాపకులతో పూర్తి మొక్కుబడిగా కొనసాగుతున్నాయి.వీసీల నియామకం అంతులేని జాప్యంతో సాగుతున్నది.
ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం, కులవృత్తులకు చేయూత ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతీ ఇంట్లో ఎంతోకొంత నగదు నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడిందని చిన్న అవసరాలకు పేదలు ఇబ్బంధి పడే దుస్థితి పోయింది అని చెబుతున్నా అవి ఏ రెండు నెలలు కూడా సవ్యంగా అందలేదు.ఉప ఎన్నికలు ఉన్న ప్రాంతాలలో తప్ప ఎక్కడా రైతు భంధు సరిగా అమలు కాలేదు.సాగు చేయని భూములకు,రైతులకు కూడా రైతు భంధు ఇవ్వడం అశాస్త్రీయం,అసంబద్దం అని విజ్ఞులు చెబుతున్నా పట్టించు కోకుండా దానిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు.
సంక్షేమ రంగంలో దేశంలోనే ఎక్కువగా ఖర్చుపెడుతున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం సాకారం అయిన చేసిన ఖర్చుతో సరి చూస్తే సగం విలువైన పనులే జరిగాయి.సాగునీటి పేరుతో అయిన ఖర్చులో సగానికి సగం స్వాహా అయ్యిందని ప్రతి పక్షాలు విమర్శించాయి. వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టడానికి తీసుకున్న చర్యలు కూడా సారి అయిన ఫలితాలు ఇవ్వలేదు. ఖర్చు సంగతి పక్కన పెడితే తెలంగాణ ఏర్పడిన్నాడు ఉన్న విద్యుత్ కోతలు మాత్రం,ప్రభుత్వ చర్యల ఫలితంగా తీరాయి.ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నది.
ఆన్ని జన వాసాల మంచినీటి సమస్యకు మిషన్ భగీరథ శాశ్వత పరిష్కారం చూప లేక పోయింది. నాటి తొలి పారిశ్రామికవిప్లవ కాలం నుండి నేటి కార్పొరేట్ల దాడులతో నిర్దాక్షిణ్యంగా కుప్ప కూలుతున్న కులవృత్తులకు ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతున్నదని ప్రభుత్వం చెబుతున్నా దానిలో నిజం చాలా కొద్దిగా ఉంది . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల కొందరు పేద విద్యార్థులకు బడి వసతి వచ్చింది కానీ నాణ్యమైన విద్య అందడం లేదు.ఇదీ అందరికీ అందు భాటులో లేదు. సర్కార్ దవాఖానల్లో వసతులు మొక్కుబడిగా మెరుగుఅయ్యాయి. దేశానికే ఆదర్శంగా నిలిచిన టీఎస్ ఐపాస్ విధానం వల్ల పారిశ్రామిక రంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రభుత్వ వర్గాలు ఊదర గొడుతున్నా అసలు పనులు అరకోరగానే సాగుతున్నాయి. ఐటీ, సేవా రంగా ల్లో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా ఉందన్నది నిజం కానే కాదు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్దతులు,విదానాలు పనులను కొనసాగిస్తూనే, మూడో సారి అధికారాన్ని సాదించడం అనే దృష్టి కోణం స్పష్టంగా కనిపిస్తున్నది.అందుకోసమే చట్టాల్లో మార్పులు,పాలనా సంస్కరణలు,సంక్షేమ కార్య క్రమాలు జరుగుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కన్నా అద్వాన్నాంగా మారిన పట్టణ,గ్రామ పాలన కోసం కొత్త పంచాయతీరాజ్ ,మున్సిపల్ చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి.కానీ వారికి నిదులు,అధికారాలు సరి పడ ఇవ్వనే లేదు.
అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికహడావిడిగా అమలైంది. కానీ గ్రామీన పాలన ప్రజల జీవన ప్రమాణాల్లో పెద్ద మార్పు ఏమి రాలేదు. గ్రామీణ ప్రాంత వలసలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి.జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పట్టణాల్లో కూడా పచ్చదనం, పరిశుభ్రత పెంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహింస్తున్నారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా పెరిగిన సౌకార్యా లు ఏమీ లేవు.
భూసంబంధ వివాదాల పరిష్కారం కనుగొనేందుకు మొదటి విడుతలోనే భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది దానికి కొనసాగింపుగా కొత్త రెవెన్యూ చట్టానికి, కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నది. ఇలాంటి సంస్కరణలు పాలక వర్గాలకు మాత్రమే మేలు కలిగిస్తాయన్నది ఎల్లరు అనుకుంటున్న విషయం., తెలంగాణ ప్రజల జీనవ ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రారంభించిన రెండో విడుత ప్రయాణం గ్రేస్ మార్కులతో పాస్ అవుతూ ఒడిదుడుకులతోనే సాగుతున్నది.