తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ ట్రేడ్ యూయన్ అనేది ప్రవేశించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ట్రేడ్ యూనియన్ స్థానంలో ఉద్యోగుల బాగోగుల చూసుకునేందుకు ఒక సంక్ణేమ బోర్డు ఏర్పాటుచేస్తున్నారు. అది ఢిసెంబర్ 15లోగా ఏర్పాటవుతుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.
బోర్డు ఏర్పాటు కాగానే డిపోలవారీగా కార్మికులతో సమస్యలేమిటో తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహిస్తారు. ఈ విషయాలమీద ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుచేసే విషయం గురించి ఆయన వారితో చర్చించారు. సీఎం కేసీఆర్ సలహా మేరకు ఏర్పాటవుతున్న ఆర్టీసీలో సంక్షేమ బోర్డు లో రాష్ట్ంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ప్రతినిధులుంటారు. డిపోకి ఇద్దరి చొప్పున, ఆర్టీసికి ఉన్న మూడు వర్క్‌షాపుల నుంచి మరో ఇద్దరు ప్రతినిధులను నియమిస్తారు. మొత్తంగా 200 మందితో ఉద్యోగుల సంక్షేమ బోర్డు ఏర్పాటవుతుంది.
ప్రతినిధులను డిపో మేనేజర్ ఎంపికచేస్తారు. ఇందులో రిజర్వేషన్లు పాటిస్తారు. మహిళలకు 33 శాతం ప్రాతినిథ్యం లభించేలా చర్యలు తీసుకుంటారు. డిపోలవారీగా నెలకొకసారి, రీజియన్వారీగా రెండు నెలలకు ఒకసారి, కార్పొరేషన్వారీగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బోర్డు సమీక్ష జరుపుతుంది.
సంక్షేమ బోర్డు సూచించిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకొనేందుకు బస్‌భవన్‌లో ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తారు. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడంలో సంక్షేమ బోర్డు కీలకపాత్ర పోషించడమే కాదు, సమస్యల పరిష్కారానికి యూనియన్లు అవసరం లేదని, సమ్మెలు గిమ్మెలు కూడా అవసరం లేదని బోర్డు నిరూపిస్తుంది.