(*బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అర్వింద్)
టిఆర్ఎస్ ఎంపిలు ఈ రోజు ఉదయం పార్లమెంటులో డ్రామాలు చేశారు. ఇలా డ్రామాలతో ధర్నాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులను దుర్వినియోగం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు దివాళా తీసిన పరిస్థితికి తీసుకొచ్చింది.
బడ్జెట్ నిర్వహణలో భారీ అవకతవకలు, భారీ స్థాయిలో అవినీతి, నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాష్ట్రంలోని ఆర్థిక గందరగోళానికి ప్రధాన కారణాలు.
టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నుండి 28,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ప్రస్తావిస్తూ , నీటిపారుదల ప్రాజెక్టు కోసం 20,000 కోట్ల నీతి అయోగ్ సిఫారసులను, మిషన్ కాకతియ కోసం మరో 3,000 కోట్లు లెక్కించడం మోసపూరితం , మూర్ఖత్వం.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినవి సున్నా బకాయిలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వం నిర్ణీత ప్రక్రియలో రాష్ట్రానికి షెడ్యూల్ ప్రకారం బదిలీ చేస్తోంది.
టిఆర్ఎస్ ఎంపిలు పాలన గురించి తెలుసుకోవడానికి తిరిగి పాఠశాలకు వెళ్లాలి. నీతి అయోగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోదు.వారు ఇచ్చే అనధికారిక సిఫార్సులతో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు జరగవు. ఈ రకమైన మోసపూరిత , అర్థరహిత, దిగజారుడు డిమాండ్లును పార్లమెంటు వేదికగా డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను మరింత కోల్పోయే విదంగా అధికారపార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్నారు. వీళ్ళ తీరు రాష్ట్రాన్ని మరింత తీవ్రమైన ఆర్థిక సమస్యల్లోకి నడిపించేలా కనిపిస్తుంది.
ఇటీవలి CAG నివేదిక ప్రకారం, సిఎం కెసిఆర్ తన సొంత ప్రయోజనాలు నెరవేర్చే పెంపుడు ప్రాజెక్టులు కాలేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ కోసం ఖర్చు చేసిన 2 లక్షల కోట్లకు పైగా లెక్కలనుCAG కు అందించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. అదే కాక కెసిఆర్ అనేక వేల కోట్ల జాతీయ నిధులను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తప్పుదారి పట్టించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఆరు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిధులు , రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల పై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
కేసీఆర్ వద్ద దాచడానికి ఏమిలేకపోతే తనకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టుల
కోసం ఖర్చు చేసిన 2 లక్షల కోట్లకు పైగా లెక్కలను CAGకి ఎందుకు సమర్పించడం లేదని బిజెపి ప్రశ్నిస్తుంది.
సిఎం కెసిఆర్ తన ఆర్థిక అసమర్థత , అవినీతి పద్ధతులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముంచివేసినట్లు గా బీజేపీ అభిప్రాయపడుతోంది.
రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి భారీ అప్పులు సవాలుగా మారానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు పెద్ద భారంగా మారనుంది.
ముఖ్యమంత్రి చేసిన ఈ భారీ రుణానికి నెల నెల వడ్డీ కట్టడానికే తెలంగాణ రాష్ట్ర ఆదాయం సరిపోయే ప్రమాదముంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒక రోగం ఉంది. ఆ రోగం పేరెందో డాక్టర్లే తేల్చాలి.
ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒక రోగం ఉంది. తన తప్పులన్నింటిని ఇంకొకరి పై నెట్టడం, ఇతరులు చేసిన మంచినంతా తన ఘనతే అని చెప్పుకోవడం. ఈ రోగం పేరెందో నాకయితే తెలవదు. డాక్టర్లే తేల్చాలి.
జీతాలు ఇవ్వలేని తమ దుస్థితిని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందని, ఇదంతా కేంద్రం వల్లే అని ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నాడు.
దేశంలో ఆర్ధిక మందగమనం ఉంది వాస్తవమే కానీ ఎక్కడా మాంద్యం లేదు. దేశంలో వృద్ధి కొంత వేగం తగ్గింది కానీ వృద్ధే లేనట్లుగా సీఎం చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.
దేశ ఆర్ధిక పరిస్థితి గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. మన విదేశీ మారకం, ద్రవ్యోల్భలం, ద్రవ్య లోటు, ట్రేడ్ లోటు ఇవన్నీ ఎప్పుడూ లేనంత మెరుగ్గా ఉన్నాయి. కొన్ని రంగాలలో వృద్ధి తగ్గినంత మాత్రాన కెసిఆర్ దేశం సంక్షోభంలో ఉందని మాట్లాడడం దుర్మార్గం.
దేశంలో గత 6 నెలల నుండి మాత్రమే మందగమనం ఉంది. కానీ రాష్ట్రంలో గత మూడేళ్ళ నుండి మాంద్యం ఉంది.
మూడేళ్ళ నుండి 35 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కాంట్రాక్టర్లకు ఏళ్ల కొద్ది బిల్లులు చెల్లించకపోవడం వల్ల అభివృద్ధి పడకేసింది. నిధులు లేక ఫీజ్ రీయింబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ, కల్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయి.
108 ఉద్యోగులు, విద్య వాలంటీర్లకు, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల కొద్ది జీతాలు ఇవ్వలేదు. నెలకు 4 వేల కోట్లు అప్పు చేస్తే కానీ రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. పెట్టిన బడ్జెట్లో 70 శాతం కంటే ఎక్కువ ఎప్పుడూ ఖర్చు చేసిన పాపాన పోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల వేళా కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతున్నాయి. చివరకు అక్రమంగా రాష్ట్రంలో ఉద్యోగస్తుల పి ఎఫ్ కూడా వాడుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. ఇలాంటి ఈయన కేంద్రం విధానాల మీద విమర్శ చేయడమా? జనం నవ్వుకుంటున్నారు.
కేంద్రం పంపే నిధులు ఒక్క పది రోజులు తాత్సారం చేస్తే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ కేంద్రం మీద నిందలు వేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
మొన్నటి దాకా కేంద్రం తెచ్చిన చట్టం వల్లనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుందని రాగాలు దీర్గాలు తీసిన ఈయన చివరకు ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేది లేదని చెప్పారు. అంటే దాని అర్ధం ఏంటి? ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి, తన తప్పులను, కుట్రలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కేంద్రం కెసిఆర్ బురదజల్లుతుంటాడు అని అర్ధం.
వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 1.82 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో 1.46 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే 36,000 కోట్ల మేరకు బడ్జెట్ ను కుదించింది. ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ను కుదించిన మొనగాడు ఒక్క కెసిఆర్ మాత్రమే. ఇంతాటి రికార్డు సృష్టించిన ఈయన కేంద్రం మీద విమర్శలు చేస్తున్నాడు. ఏమంటాం?
అసలు రాష్ట్రంలో నువ్వు అభివృద్ధి చేసిన వనరులేవి? ఆదాయ మార్గాలేవి? లిక్కర్ తప్ప వేరే అద్ధాయ మార్గాలు ఏమైనా అభివృద్ధి చేసావా?
మీ దుబారా వల్ల, అవినీతి వల్ల, క్రమశిక్షణారాహిత్యం వల్ల రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇది వాస్తవం కాదా?
మీరు పెట్టినటువంటి బడ్జెట్ కేవలం జీతాలు, తెచ్చిన అప్పులకు వడ్డీలు, సబ్సిడ్డిలు, పాత బకాయిలకు సరిపోయే పరిస్థితి లేదు. ఇది వాస్తవం కాదా?
కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేసి కనీసం యూసీ లను కూడా అందించకపోవడం వాస్తవం కాదా?
మొత్తంగా బంగారు తెలంగాణ పేరు మీద వచ్చిన తెలంగాణను బాకీల తెలంగాణగా ,బకాయిల తెలంగాణగా, బడాయి తెలంగాణగా మార్చింది వాస్తవమా కాదా?
కాబట్టి ఈ చౌకబారు వేషాలు మానుకొని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపర్చడానికి నువ్వేం చేస్తావో చెప్పాలి. దాని తర్వాత కేంద్రం నుండి ఎం సహకారం కావాలో చెప్పాలి. అంతే కానీ నేను ఏది పడితే అది, ఎట్ల పడితే అట్ల మాట్లాడుతా అనుకుంటే. జనాల్లో దిగజారుతున్న నీ స్థాయిని ప్రజలు గమనిస్తున్నారు..
(*బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అర్వింద్ తెలంగాణ బిజెపి లోక్ సభ సభ్యులు)