’మహిళా మిత్ర’ భేష్, ఆయుధంగా వాడండి :జగన్ కు ఇఎఎస్ శర్మ సూచన

(డాక్టర్ ఇఎ ఎస్ శర్మ)
హైదరాబాద్ లో మహిళావెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి మీద జరిగిన దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ప్రముఖ పౌరహక్కుల వాది డాక్టర్ ఇఎ ఎస్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  ఒక  లేఖ రాస్తూ ఇలాంటిసంఘటనలు పునరావతృం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళమిత్రను ప్రశసించారు. ఈ పథకం ఇలాంటి దారుణ సంఘటలను జరుకుండా నివారించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకాాన్ని జాతీయ పథకంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన జగన్ కు రాసిన లేఖ లోని ప్రధానాంశాలివి:
హైదరాబాదులో ఐదు రోజులక్రితం ఒక మహిళా వైద్యురాలిమీద జరిగిన అత్యాచారం అతి బాధాకరమైనది. అటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద, సమాజం మీద ఎంతైనా ఉంది.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహిళామిత్ర” పథకం చాలా ఉపయోగపడుతుంది. ప్రతీ పోలీస్ స్టేషనులో ఒక మహిళా పోలీస్ అధికారి ఉండడం, మహిళా వాలంటీర్లు వారి సహాయంతో ఆపదలో ఉన్న మహిళలకు ఆసరా ఇవ్వడం జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టవలసిన విధానం. బహుశా, మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు మనరాష్ట్రంలో  ఉన్న ఈ పథకాన్ని తమ తమ రాష్ట్రాలలో అమలుచేస్తారని భావిస్తున్నాను.

 

మహిళామిత్ర పథకం ఇంకా ఉపయోగపడాలి అంటే, హైదరాబాద్ లో జరిగిన సంఘటన వంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకుండా ఉండాలి అంటే, ఈ క్రింద సూచించిన చర్యలను కూడా తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
నగరాలలో పనిచేస్తున్న మహిళలు రాత్రుళ్ళు పగలు అనకుండా వారి పనిప్రదేశాలనుంచి ఇంటికి వంటరిగా వెళ్ళవలసి ఉంటుంది. హైదరాబాదులో జరిగినట్లు వారిమీద అత్యాచారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సంఘటనలు జరిగితే, వారు పోలీసుకు టెలిఫోన్ చెయ్యాలా, ఇంటికి టెలిఫోను చెయ్యాలా అని ఆలోచించడానికి సమయం ఉండదు. వారిలో చాలామంది వద్ద మొబైల్ ఫోనులు ఉండవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖ ఒక మహిళా ఎమర్జెన్సీ APP ను రూపొందించి మహిళల మొబైల్ ఫోనులలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించాలి. ఆ APP లో ఒకే ఒక క్లిక్ ద్వారా మహిళలు పొలిసు మహిళా ఎమర్జెన్సీ CELL కు,  “ఆపదలో ఉన్నాము” అనే  విషయాన్ని తెలియ చేయవచ్చు. ఆ APP లో GPS లింక్ ద్వారా పోలీసుకు మహిళ ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. తత్క్షణం దగ్గిరలో ఉన్న మొబైల్ పోలీస్ వాన్ కు ఆటోమాటిక్ గా సమాచారం వెళ్లి వారు మహిళ ఎక్కడ ఉందో అక్కడకు త్వరిత గతిలో చేర గలరు. ఇటువంటి APP తయారుచేయగల సంస్థలు మన రాష్ట్రంలో, బెంగుళూరులో ఎన్నోవున్నాయి.
ప్రతీ నగరంలో జనసాంద్రతలేని ప్రదేశాలలో ఒక మహిళా అధికారి ఆధ్వర్యంలో పోలీస్ మొబైల్ వ్యాన్లు 24 గంటలు నిఘా పెట్టాలి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో, రెండుమూడు గ్రామాలకు ఒక మొబైల్ వాన్  నిఘా పెట్టాలి.
ప్రతినగరంలో స్ట్రాటజిక్ ప్రదేశాలలో CCTV కెమెరాలను పెట్టాలి. అటువంటి కెమెరాలు ఉన్నాయని అందరికీ తెలిస్తే కొంతవరకు దుండగులు భయపడవచ్చు.
“నిర్భయ” పథకం జాతీయ స్థాయిలో 2013 లో ప్రవేశపెట్టబడినది. సుమారు 3,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్టులో కేటాయింపబడ్డాయి. అయినా, కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఆనిధులను అక్కడి ప్రభుత్వాలు ఉపయోగించుకోగలిగారు. మన హోమ్ శాఖ ఆలస్యం చేయకుండా ముబైల్ వానులకు, నిఘా కెమెరాలకు, APP కోసం అయ్యే ఖర్చులను పరిగణలోనికి తీసుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని కావలిసిన నిధులను నిర్భయ పథకం క్రింద కేటాయించామని కోరాలి.
రాష్ట్రంలో, నాగరాలలోనేకాకుండా, గ్రామీణ ప్రాంతాలలో ఎన్నోవిధాలుగా మహిళలమీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఉద్యోగాలిప్పిస్తామని మహిళలను మభ్యపెట్టి వేలాదిమంది ఏజెంట్లు వారిని మనదేశంలో ఇతరదేశాలలో తక్కువ జీతాలకు రవాణా చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ ఏజెంట్లకు రాజకీయ నేతల, అధికారుల మద్దతు ఉన్నదని కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాగే పొలాలలో పనిచేసే వ్యవసాయ కార్మికుల కుటుంబాలు, నగరాలలో పనిచేసే భవననిర్మాణ కార్మిక మహిళలు, ఇటుక ఆవాల పనులు చేసే ఒడిశా కార్మికులు పెద్ద ఎత్తున అత్యాచారాలకు గురి అవుతున్నారు. మీద సూచించిన మొబైల్ వాన్ అధికారులు అటువంటి వారిమీద దృష్టి పెట్టాలి. అటువంటి పనులలో మధ్యవర్తులుగా ఉన్న ఏజెంట్లమీద కఠిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో కార్మిక శాఖ అధికారులలో లంచగొండితనం ఉండడం వలన, కార్మికుల సంరక్షణ కోసం ప్రవేశ పెట్టిన చట్టాలు అమలు అవడంలేదు. ఆ శాఖమీద నిఘా పెంచవలసిన అవసరం ఉంది.
మనుషులు దోషులుగా మారడానికి చాలావరకు మన సమాజంలో ఉన్న తారతమ్యాలే కారణం. ప్రాధమిక పాఠశాలలనుంచి, సమాజంలో తారతమ్యాలను ఎలాగ తొలగించాలి, మహిళలను ఎలాగ గౌరవించాలి అనే విషయాలను, సిలబస్ లో ముఖ్య అంశాలుగా  చేయాలి
మీద సూచించిన సలహాలను పరిశీలించి మహిళా మిత్ర లో భాగం గా అమలు చేస్తారని ఆశిస్తున్నాను. 
ఒక రాజకీయ పార్టీ అధినేతగా మీకు కూడా ముఖ్యమైన బాధ్యత ఉందని మరిచిపోకూడదు.  స్థానిక, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ఎన్నికలలో , కోర్టులో క్రిమినల్ చార్జీలు ఉన్న వ్యక్తులకు టిక్కెట్లను ఇవ్వకూడదు. ఈ విషయంలో అన్ని పార్టీలను తప్పుపట్టవలసి ఉంది. మీరు మార్గదర్శకతతో, అటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వమని ప్రకటిస్తే, మిగిలిన పార్టీలకు పాఠం చెప్పినట్లు అవుతుంది.

 

(Dr EAS Sarma is a retired IAS officer and former union secretary)