(డా. కే.వి.ఆర్.రావు)
మాయూరప్ యాత్ర, తొమ్మిదో భాగం: రోమ్ నగరం (ఇటలి):
మా యాత్రలో పద్నాలుగోరోజు రోమ్ నగర సందర్శన. ఆమరుసటిరోజు పొద్దునే మా తిరుగు ప్రయాణం. మూడుగంటల ప్రయాణం తరువాత రోమ్ చేరాము.
పన్నెండువందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని బలమైన సైనిక శక్తితో, అతిపెద్ద రాజ్యమైన రోమన్ ఎంపైర్ కి రాజధానీ, ప్రఖ్యాతిగాంచిన శిల్పాలకు, చిత్రాలకు నిలయము ఐన రోమ్ నగరాన్ని చూడబోతున్నామని మా సహయాత్రీకులందరూ ఉత్సాహంగా ఉన్నారు.
ముందుగా బస్సులోనించే కొన్ని చారిత్రక ప్రదేశాలు, టైబర్ నది, సెస్టియస్ పిరమిడ్, ప్రస్తుత ముఖ్యమైన భవనాలు చూసి చివరిగా అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి వాటికన్ సిటికి వెళ్లాము. రోమ్ నగరంలోని ముఖ్యప్రదేశాల్లోని భవనాలు బరోక్, నియోక్లాసికల్ శైలిలో నిర్మించబడి ఉన్నాయి. ఆరోజు ఎండ చాలావున్నా వాటికన్ సిటిలోపలికి వెళ్లడంవల్ల దానితీవ్రతనుంచి తప్పించుకున్నాము.
1929 నుంచి వాటికన్ సిటి వెయ్యి జనాభాగల 44 ఎకరాల స్వతంత్ర దేశము. ప్రపంచ రొమన్ క్యాథలిక్ మతస్తులకు ప్రధానకేంద్రము, వారి మతపెద్దైన ‘పోప్ నివసించే ప్రదేశం. వాటికన్ చుట్టూ ఎత్తైన ప్రహరిగోడ ఉంది.
ఒకచోటదిగి యాత్రీకులు ప్రవేశించే ద్వారంగుండా వెళ్లి సెక్యూరిటి పరీక్షలు అయ్యాక లోపలికెళ్లాము. అక్కడైనుంచి మా వాటికన్ గైడ్ వచ్చారు. మాగైడ్ మాట్లాడుతుంటే మాకు వినపడే వైర్ లెస్ ఆడియో హెడ్ ఫోనులిచ్చారు. వాటికన్ లోపల ఒకవైపున ఎత్తైన, బహుళ అంతస్తుల భవనాలు, ఙ్ఞాపికలమ్మే షాపులు, చారిత్రక నిర్మాణాలు, పోప్ నివాసం, రాఫెల్ రూమ్స్, సిస్టైన్ చాపెల్, సెయింట్ పీటర్ బాసిలికా, పీటర్ స్క్యేర్ ఉన్నాయి. మరోవైపున దాదాపు సగం వైశాల్యంలో తోట ఉంది.
ఆరోజు యాత్రికుల సంఖ్య మధ్యస్థంగా ఉంది. గైడ్ వివరిస్తూండగా మొదటగా సిస్టైన్ చాపెల్ కి వెళ్లాము. వెళ్లే పొడవైన దారంతా రెండువైపులా గోడలు, పైకప్పు బంగారుపూతల నగిషీలతో అలంకరించబడివున్నాయి. గోడలమీద తైలవర్ణచిత్రాలు, నిలువెత్తుగా వెడల్పైన డ్రేపరీలు, అప్పటి ఎంబ్రాయిడరీ మ్యాపులు ఉన్నాయి. నేలంతా ఖరీదైన మార్బుల్ బండలు పరచివున్నాయి. అక్కడక్కడా పాలరాతి శిల్పాలు అమర్చారు. వాటన్నిట్లో అప్పటి ప్రసిధ్ధ చిత్రకారుల, శిల్పుల గొప్ప పనితనం కనిపిస్తూంది.
ఒకచోట మెట్లు దిగి సిస్టైన్ చాపెల్ లోపలికి ప్రవేశించాము. అది మైకేలాంజిలో వేసిన చిత్రాలకు అత్యంత ప్రసిద్ధిచెందిన విషయం తెలిసిందే. 135 అడుగుల పొడవు, 44 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తువున్న ఆ చాపెల్ హాలంతా జనంతో నిండివున్నా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఫోటోలు తీయరాదు, అక్కడక్కడా అంతాగమనిస్తున్న సెక్యూరిటి సిబ్బంది ఉన్నారు.
హాలు చుట్టు గోడలకు ఇతర చిత్రకారులు వేసిన తైలవర్ణచిత్రాలున్నాయి. పైకప్పు లోపలి భాగంమొత్తానికి మైకేలాంజిలో వేసిన పెద్ద వర్ణచిత్రాలున్నాయి. ఆల్టార్ వెనక నిలువెత్తుగోడ మొత్తానికి అతనే వేసిన ‘లాస్ట్ జడ్జ్ మెంట్ ‘ చిత్రమొక్కటే ఉంది. ఆ వర్ణచిత్రాలు మాటలకందనంత గొప్పగా ఉన్నాయి. మానవ నాగరికత ఈ మైకేలాంజెలో చిత్రాలద్వారా కళారంగంలో ఒకమెట్టు ఎక్కిందని విఙ్ఞుల అభిప్రాయం.
చాలాయేళ్లుగా వాటినిగురించి వినడం, ఫోటోలను చూడ్డం వేరు, వాటిని చూడ్డం వేరు. అదో గొప్ప అనుభవం. లోపలి యాత్రీకులంతా మౌనంగా లీనమైపోయి చూస్తున్నారు. లోపలికొచ్చే జనాన్నిబట్టి అందరూ ముందుకు కదులుతూ పైకప్పువైపు, ఆల్టార్ గోడను చూస్తున్నారు.
వాటిగురించి అవగాహనలేని యాత్రీకులుకూడా వాటి గొప్పదనాన్ని తమకు తెలియకుండానే చూసి అర్థంచేసుకున్నారు. కళాత్మకమైన ఒక అపూర్వ అనుభూతితో సిస్టైన్ చాపెల్ నుంచి బయటికి వచ్చాక పక్కనేవున్న సెయేంట్ పీటర్స్ బాసిలికా లోపలికెళ్లాము.
సెయింట్ పీటర్స్ బాసిలికా ప్రపంచంలోని చర్చిల్లోకెల్లా పెద్దది. 1626 లో కట్టడం పూర్తైన ఈ బాసిలికా గోపురం ఎత్తు 450 అడుగులు, వ్యాసము 140 అడుగులు. బ్రమాంటే, రాఫెల్, మైకెలాంజెలో మొదలైన ప్రసిద్ధ వాస్తునిపుణుల పర్యవేక్షణలో దీని నిర్మాణం నూట ఇరవై సంవత్సరాలు పట్టింది.
ఈస్థలంలోనే ఒకటో శతాబ్దంలో సెయింట్ పీటర్ ని శిలువ వేశారని, అప్పటినుంచి ఇక్కడవున్న సమాధి ఆయనదేనని క్రిస్టియన్ మతానికి చెందినవారు విశ్వసిస్తారని చెప్పారు.
సెయింట్ పీటర్స్ బాసిలికా లోపలికి బ్రహ్మాండమైన పాలరాతి స్థంభాల కారిడార్ గుండా వెళ్లాము. దాని రెండుపక్కలా అలాంటివే సమాంతరంగా కారిడార్లున్నాయి. లోపల ఎత్తైన పైకప్పున్న ప్రాంగణంలో అన్నివైపులా శిల్పాలు, ఫ్రెస్కోలు, ప్యానెళ్లు, వర్ణచిత్రాలు, ప్రార్థనాస్థలాలు కనిపించాయి.
ఈ బాసిలికా కళాత్మక సంపదలో, భారీతనంలో ప్యారిస్ లోని వెర్సాయి ప్యాలెస్ కు తక్కువేమీకాదు. గోపురం లోపలి భాగం చాలాఎత్తుగా వర్ణచిత్రాలతో అలంకరించిన పలకలతో కాంతులు వెదజల్లుతావుంది. గోపురానికి కింద సెయింట్ ఎత్తుగా కట్టిన పీటర్స్ సమాధి ప్రతీక ఉంది. దానికిందే పాత సమాధివుందని చెప్పారు.
బాసిలికా లోపలికి ప్రవేశించాక కుడివైపున బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుబాక్స్ లో మైకెలాంజిలో తన 26వ యేటనే చెక్కిన గొప్ప పాలరాతి ‘పిటా’ శిల్పముంది. బాసిలికాలో అనేక మంచి శిల్పాలున్నప్పటికీ కళారాధకులకు ఈ శిల్పం చూడడం గొప్ప అనుభవం.
మొత్తంగా సెయింట్ పీటర్స్ బాసిలికా ఒక అద్భుత కళాప్రపంచం. బాసిలికాను చూసి బయటికి వచ్చి అక్కడేవున్న విశాలమైన సెయింట్ పీటర్స్ స్క్వేర్ చూశాము. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో పోప్ తన సందేశాన్ని బాసిలికా బాల్కనిలోంచి ఇచ్చేటప్పుడు ఆ ప్రాంగణంలోనే ప్రేక్షకులు కూర్చుంటారు. సమయాభావం వల్ల మరొక గొప్ప రెనియజెన్స్ చిత్రకారుడు రాఫేల్ చిత్రాలున్న రాఫేల్ రూమ్స్ చూడలేక పోవడం ఒక పెద్ద కొరత.
వాటికన్ నుంచి భూగర్భ రహదారిగుండా నడిచి బయటకు వచ్చాము. అక్కడ బస్సెక్కి పాతనగరానికి వెళ్లి మొదటగా బస్సులోంచే పాలటైన్ హిల్ చూశాము. రోమ్ నగరం మొదట అక్కడే ప్రారంభమైందట.
అక్కడికి సమీపంలోనే దిగి కొలోసియం చూడ్డానికి వెళ్లాము. కొలోసియం అనబడే పురాతనకాలపు స్టేడియం క్రీస్తుశకం 70-80 ల మధ్య రోమన్ చక్రవర్తులు వెస్పేసియన్, టైటస్ ల కాలంలో కట్టబడింది. ఆరెకరాల స్థలంలో 600 అడుగుల పొడవుతో 150 అడుగుల ఎత్తుతో 80 గేట్లతో, అరవైవేలమంది ప్రేక్షకులు కూర్చునే వసతితో కట్టబడింది.
దాన్ని పెద్ద ఘనాకారపు రాళ్లతో కట్టి, బలమైన ఇనుపకమ్మీలు బిగించారు. కొలోసియంలో ప్రస్తుతం మూడింటరెండొంతులుమాత్రమే ఉంది. ఇప్పుడు రాళ్లున్నచోటకూడా కమ్మీలు చాలావరకు పోయాయి. ఈ కొలోసియం అనే పేరు అంతకు ముందు అక్కడ ఉండిన రొమన్ చక్రవర్తి నీరో వంద అడుగుల కంచువిగ్రహంవల్ల వచ్చిందని చెప్పారు.
ఎత్తైన మెట్లు ఎక్కగలిగినవారిని మాత్రమే చూడ్డానికి లోపలికి రమ్మన్నారు. మాలో నలుగురైదుగురు ఆగిపోయారు. సెక్యూరిటి చెక్ అయ్యాక లోపలికెళ్లి చూస్తే అక్కడ లిఫ్ట్ ఉంది. కానీ దిగేదికూడా కష్టమేనన్నారు.
మేమందరం పైకి వెళ్లాం. పైన వివిధ గ్యాలరీలన్నీ పాక్షికంగా ఉన్నాయి. పైన్నుంచి చూస్తే కింద మధ్యన 280 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు కలిగిన, దీర్ఘవృత్తాకారపు ‘ఎరీనా’వుండిన చిహ్నాలు కనిపిస్తాయి. దీనిమీదే గ్లేడియేటర్ల పోరాటాలు, మరణదండనలు, జంతువుల వేటలాంటివి టికెట్లుపెట్టి ప్రదర్శించేవారట.
తదుపరి కాలంలో యుధ్ధరిహార్సళ్లు, నాటకాలుకూడా చేరాయి. ఎరీనా కింద ఉండిన రెండస్తుల సొరంగాల కూలిన గోడలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ సొరంగాలగుండానే పూర్వం గ్లేడియేటర్లను, జంతువులను ఎరీనాలోకి తెచ్చేవారట. ఎరీనాచుట్టూ పదిహేను అడుగుల గోడ, దాన్నుంచి పైకి ప్రేక్షకుల గ్యాలరీలు ఉన్నాయి.
గత శతాబ్ధాల్లో, మనం గొప్పగా చెప్పుకునే చక్రవర్తులకాలంలో, మనిషి ఇంతక్రూరంగా ఉండేవాడా అనిపిస్తుంది. గురజాడ చెప్పిన ‘మంచి గతమున కొంచెమోనోయ్’ అనేమాట గుర్తొస్తుంది.
కొలోసియం నుంచి బయటకి వచ్చాక చివరి ప్రోగ్రాంగా పురాతన రోమ్ శిధిలాలను చూసే నడక పెట్టారు. నడవలేనివాళ్లు బస్సెక్కి కూర్చున్నారు. మిగతావాళ్లం ఒక కిలోమీటరు నడిచి రోడ్డుకు రెండువైపులా లోతులోవున్న తొలిశతాబ్ధాల శిధిలాలను చూశాం.
శతాబ్దాలుగా పునర్నిర్మాణాలు జరగ్గా మిగిలిన కొద్ది ప్రదేశాలను పరిరక్షించారు. ఒకవైపు పాత మార్కెట్ శిధిలభవనాలున్నాయి. మరోవైపు పురాతన స్థంభాలు, గోడలు, పునాదుల్లాంటివి ఉన్నాయి.
ఇంకాస్త ముందుకెళ్లి పంతొమ్మిదో శతాబ్దపు ఇటలి రాజు విక్టర్ ఎమాన్యుయెల్ స్మారకభవనం చూశాము. అది నియోక్లాసికల్ శైలిలో కట్టిన పెద్దభవనం. దాని పక్కనే ఎత్తుమీద మైకెలాంజిలో రూపొందించిన ప్యాలెస్ లు (అక్కడ ఒకప్పుడు జూపిటర్ గుడి ఉండేదట) ఎదురుగా ముస్సొలిని ఉపయోగించిన ఆఫీసు భవనం, దానికి కొంతదూరంలో గుహలాంటి ప్రదేశంలో అగస్టస్ సమాధి బయటినుంచే చూశాము.
అక్కడే బస్సెక్కి సాయంత్రపు లైట్లకాంతిలో దారిలో మిగతా రోమ్ ని చూస్తూ హోటల్ కి వెళ్లాము.
ఆ సాయంత్రంతో మా యూరప్ యాత్ర ముగిసింది.
పదిహేనోరోజు ఉదయమే సామాన్లతో బస్సులో బయలుదేరి తిరుగుప్రయాణానికి రోమ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాం. అనేక ఙ్ఞాపకాల సంపుటిని తలలో మోసుకుంటూ రోమ్ లో బయలుదేరి అబు దాబిలో విమానం మారి ఆరోజు రాత్రికి హైదరాబాదు చేరుకున్నాము.
ఉపసంహారం:
మొత్తానికి థామస్ కుక్ వాళ్ల టూర్ మా అందరికీ బాగావుందని అనిపించింది. నిజానికి పదిహేనురోజులు ఎలాగడిచిపోయాయో తెలియలేదు. ఏర్పాట్లన్నీ చక్కగావున్నాయి. వాళ్లుంచిన నాలుగు నక్షత్రాల హోటళ్లు, బస్సు అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. మేము హోటళ్లలో, టూరిస్ట్ ప్రదేశాలలో కలిసిన ఇతర యాత్రీకుల మాటలను బట్టి అన్ని కంపెనీల ప్యాకేజీల్లోనూ దాదాపుగా ఇవే ప్రదేశాలను, ఇలాగే చూపిస్తారని అర్థమైంది. బేరీజు వేసుకుంటే కొన్నివిషయాల్లోమాదే బెటరనిపించి తృప్తిపడ్డాము.
ఐతే మనదేశపు బస్సుల్లోలాగే అక్కడిబస్సులో కూడా ప్రయాణాల్లో మన సినిమాలు వేశారు. కిటికీలోంచి కనిపిస్తున్న యూరప్ ల్యాండ్ స్కేప్ చూడనివ్వకుండా, లేదా విశ్రాంతి తీసుకోనివ్వకుండా ఈ సినిమాలేమిటి అని మాలో కొంతమంది వ్యతిరేకించాం. అది థామస్ కుక్ కంపెనివారి పాలసి అని చెప్పారు.
అంతకంటే వెళ్లబోయే చోటికి సంబంధిన విడియోలేస్తే కాస్తైనా ఉపయోగంగా ఉంటుందిగదా అని కొంతమంది చెపితే అవిషయం కంపెనీకి సూచిస్తే బావుంటుందన్నారు. ఈ సినిమాగోల, కొన్ని ముఖ్యమైనవి ప్యాకేజిలో లేకపొవడం మినహాయిస్తే మిగతావన్నీ బావున్నాయి. ఒక మంచి టూర్ మేనేజర్ మాతో రావడంఒక అదనపు విలువ.
మనం ప్రతి ముఖ్యమైన అనుభవంతోటి ఏదోఒకటి నేర్చుకుంటాం. పదిహేనురోజులపాటు ప్రపంచంలో క్లిష్టమైన చరిత్రగలిగిన, ఆధునిక మానవపరిణామంలో కీలకపాత్ర వహించిన, అభివృద్ధి చెందిన దేశాలనబడే తొమ్మిది దేశాలలో ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడడం ఒక లోతైన అనుభవం.
చారిత్రక సంఘటనలు, కళా వికాసం, మానవ నాగరికతా పరిణామం జరిగిన చోట్లకి వెళ్లేముందు వాటిగురించి ఎంతబాగా తెలుసుకుంటే అంత లీనమై చూసి మనం లోతుగా అనుభూతి చెందగలం అన్నది యాత్రలు చేసేవాళ్లందరికీ అనుభవమయ్యే విషయమే. మేం వీటిని చాలావరకు పాటించగలిగాము. ఇలంటి ప్రదేశాలు మనదేశంలో కూడా చాలావున్నాయి.
నేర్చుకునే ఆసక్తినిబట్టి ఏ యాత్రలోనైనా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలా మేము చాలానే తెలుసుకున్నామని చెప్పగలం. అక్కడి ప్రస్తుత నగరాల, నివాసాల తీరుతెన్నులు, మనుషుల ప్రవర్తన వీటన్నిట్లో ఎన్నో తెలుసుకోవలసిన విషయాలున్నాయి.
అలాగే అక్కడి స్మారకాలను చూసి చరిత్రను, వైతాళికులను గుర్తుకుతెచ్చుకోవడం, వాటినుంచి కొన్ని పాఠాలను నేర్చుకోవడం, కళారంగంలో వారు సాధించిన గొప్ప విజయాలను చూసి కొత్త అనుభూతిని, వ్యక్తిగత వికాసాన్ని పొందడం మనం యాత్రలో పొందే లాభాలు.
(సమాప్తం)