తెలుగు భాషను కాపాడుకునేందుకు జనసేన అధినేత త్వరలో *మన నుడి-మన నది* అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రకటన సారాంశం ఇదే.
‘మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతాం. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరం. మాతృ భాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా ‘మన నుడి… మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. “నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు.నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయి. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం.మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం.
మన నుడినీ, మన నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం.మాతృ భాషను పరిరక్షించుకోవాలి. మన నదులను కాపాడుకోవాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా “మన నుడి… మన నది” కార్యక్రమం. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం, అని చెప్పారు
“మన నుడి మన నది” కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జనసేన. #OurRiversOurMotherTongue pic.twitter.com/yqBCByJyX1
— JanaSena Party (@JanaSenaParty) November 20, 2019
మన నుడి ,మన నది … pic.twitter.com/TtYzCgl2Dv
— Pawan Kalyan (@PawanKalyan) November 20, 2019