(అల్లి నాగరాజు)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ పని చేసినా రికార్డులు బద్దలు కావాల్సిందే. ఆయన కొన్ని కార్యాలు రికార్డులు బ్రేక్ చేయడం కోసమే తలపెడతారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా… ప్రపంచంలోనే ఎక్కడ లేని రీతిలో… అసలు భూమి మీదే ఎక్కడ కూడా చేయని పనులు చేసినట్లు సీఎం చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి టన్నుల కొద్దీ ఇలాంటి ప్రకటనలు మీడియా కు చేరవేస్తూ ఉంటారు.
కానీ యదృచ్చికమో… లేకపోతే ఏదైనా ప్రాబ్లమో లేకుంటే… మరేదైనా కారణమో కానీ కేసీఆర్ ఖాతాలో ఒక రివర్స్ రికార్డ్ వచ్చి చేరింది.
అదేమంటే… దేశంలో ఎక్కడా లేని రీతిలో… ప్రపంచ కార్మికలోకం దృష్టిని ఆకర్శించింది ఆర్టీసీ సమ్మె. ఇప్పటి వరకు తెలుగు నేలమీద ఇన్నిరోజులు సుమారు 50 వేల మంది కార్మికులు సమ్మె చేసింది లేదు. దేశమంతా వెతికినా ఆర్టీసీ సమ్మె లాంటి పోరాటం ఇటీవల కాలంలో మరెక్కడా కనబడదు.
ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమ్మెలో భుజం కలిపి అసాధ్యం అనుకున్న తెలంగాణ ను సుసాధ్యం చేశారు. అటువంటి సమ్మెను మించిన రీతిలో ఇప్పుడు సమ్మె సాగుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్ర పుటల్లొకి ఆర్టీసీ సమ్మె ఎక్కింది. దానికి కారణం కెసిఆర్ కావడమే విచిత్రం.
స్వరాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె 42 రొజుల పాటు సాగింది. కానీ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది ఇప్పటి ఆర్టీసీ సమ్మె. నవంబర్ 16నాటికి ఆర్టీసీ సమ్మె 43 రోజులు పూర్తి చేసుకుని ఆర్టీసీ కార్మికుల ఖాతాలో సుదీర్ఘ సమ్మేగా రికార్డ్ చేరి0ది. అలాగే సీఎం కేసీఆర్ కు రివర్స్ రికార్డ్ దక్కింది.
2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకూ సాగిన సకల జనుల సమ్మె ఇప్పటి వరకు ఒక రికార్డ్. కానీ ఆ రికార్డును తుడిపేసింది నేటి ఆర్టీసీ సమ్మె.
నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొసం పోరాటం చేస్తే… నేడు ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ పరిరక్షణ కొసం ఉద్యమం సాగుతున్నది. అందులోనే జీతాల పెంపు, ఆర్టీసీ ని సర్కారులో విలీనం అంశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు స్పూర్తి గా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిలిచారని కార్మిక వర్గం చెబుతున్నది.
ఇక ఆర్టీసీ సుదీర్ఘ… సాహసోపేతమైన సమ్మెతో kcr పరిపాలన కు చెరగని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొసం యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే… నేడు ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధన కోసం ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 20మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీసీ బలిదానాలపై kcr మౌనం దాల్చడం పట్ల… మేదావి వర్గం ఆవేదనలో ఉంది. డెడ్ లైన్స్ పెట్టినా సమ్మె వీడని ఆర్టీసీ కార్మికుల వల్ల జాతీయ స్థాయిలో కేసీఆర్ పరపతి పోగొట్టుకున్నారు.
అడుగడుగునా కోర్టులు మొట్టికాయలు వేసినా… తెలంగాణ సర్కారు కఠిన చర్యలకు దిగుతున్నది. నిన్నమొన్నటి వరకు కొమ్ములు తిరిగిన మేధావులుగా చెలామణి అయినవాళ్ళ మూతులకు ఇప్పుడు తాళాలు పడ్డాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. ఇంకోవైపు RTC విలీనం విషయంలో కార్మికులు ఓకమెట్టు దిగి వొచ్చారు. కానీ సర్కార్ మాత్రం చెర్ణకోలా విడిచిపెట్టే ఆలోచనలు చేస్తలేదు.
చరిత్రలో పలుసార్లు జరిగిన ఆర్టీసీ సమ్మెలు అనేక పరిణామాలకు దారి తీసాయి. 2001లో 24 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె చేసింది. తర్వాత 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అలాగే సకల జనుల సమ్మె… కేంద్ర సర్కారు మెడలు వొంచింది. తెలంగాణ సాధనకు బాటలు వేసింది. ఇప్పుడు 20 మందికి పైగా బలిదానాలతో సాగుతున్న ఆర్టీసీ సమ్మె ముగింపు ఎలా ఉంటుందో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలింది. కెసిఆర్ పాలనా దక్షుడని పేరుంది. కాని ఈవిషయంలో ఇలాంటి వైఖరి ఏమిటో ఎవరికీ అర్థంకావడం లేదు.
(Alli Nagaraju is a senior journalist from Hyderabad. Earlier worked in Vaartha, Prajasakshi,TNews and 99Tv . He was also part of digital platforms such as AsianetTelugu and Telugu Rajyam. He is a team member of Trending Telugu News)