ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని, ఆపడం లేదని ఆర్టీసి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. యూనియన్ల సెంట్రల్ కమిటీలో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ విషయాన్ని ఈ రాత్రి వెల్లడిస్తూ ప్రస్తుతానికి సమ్మె ఆపడం లేదని స్పష్టం చేశారు
అయితే, హై కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాక, న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన సమావేశం అనంతరం చెప్పారు. ఒకటి రెండ్రోజుల్లో తమ తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంగళవారం ఉదయం జేఏసీలోని అన్ని యూనియన్ల సెంట్రల్ కమిటీలు హైదరాబాద్లో సమావేశమయ్యాయి. సాయంత్రందాకా చర్చలు జరిగాయి.
సమ్మె విరమించి,ఉద్యోగాల్లో చేరేందుకు ఉద్యోగులు ముందుకు వచ్చినా ఆర్టీసి యాజమాన్యం నిరాకరిస్తే ఏమిచేయాలనే అంశం మీద యూనియన్ల మధ్య తర్జ నభర్జనలున్నాయి. ఆర్టీ సియూనియన్ల మీద ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా ఆగ్రహంతో ఉన్నందున ఏకపక్షంగా సమ్మె విరమిస్తే ప్రభుత్వం బెట్టు చేయవచ్చనే అనుమానం చాలా మంది లో ఉంది. అందుకే కోర్టు తీర్పు వివరాలు తెలిసే దాకా సమ్మెను ఆపకుండా కొనసాగించాలని సమావేశంలో జెఎసి నేతలు నిర్నయించినట్లు తెలిసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని, రేపు తమ చేతికి అందే అవకాశం ఉందని చెబుతూ తీర్పలోని వివరాలను పరిశీలించి, లాయర్లు, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆ తర్వాత మరోసారి సమావేశమై సమ్మెపై తదుపరి కార్యక్రమం మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు.
సమ్మె విరమించాలని కార్మికుల నుంచి మీపై ఒత్తిడి లేదని చెప్పారు అశ్వత్థామరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.