తమిళనాడు ప్రజల మేలు కోసం అవసరమయితే రాజకీయాల్లో చేతులు కలిపి పనిచేసేందుకు వెనకాడమని సూపర్ స్టార్ రజినీ కాంత్, ప్రఖ్యానటుటు, మక్కల్ నీది మయ్యామ్ (MNM) నాయకుడు కమల్ హాసన్ ప్రకటించారు.
ఈరోజు చెన్నై ఎయిర్ పోర్టులో వారిద్దరు వేర్వేరుగా ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యం.
ఒకరి తర్వాత ఒకరు ఒక గంట వ్యవధిలో ఇద్దరి నుంచి ఈ ప్రకటన వచ్చింది. ‘ మేమిద్దరం దగ్గిరయేది అదేమంత వింత కానవసరం లేదు. 44 సంవత్సరాలు మేమిద్దరం కలసి పని చేశాం.మేమిద్దరం కలవాల్సిన అవసరమొస్తే మీకు తప్పకుండా చెబుతాను. అయితే, ఇపుడలాంటి విషయాలు మాట్లాడే సమయం కాదు. పనిచేయడమనేది ముఖ్యం,’ అని కమల్ హాసన్ చెప్పారు. ఒదిషాలోని సెంటూరియాన్ యూనివర్శిటీ ఆఫ్ ఇంజనీరింగ్అండ్ మేనేజ్ మెంట్ నుంచి డాక్టర్ పురస్కారం అందుకుని ఈరోజు ఆయన చెన్నై తిరిగి వచ్చారు. అపుడు విమానాశ్రయంలో ఆయన విలేకరుల కంట పడ్డారు.
రాజకీయాల్లో కమల్ హాసన్ , రజినీకాంత్ కలసి పని చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించినపుడ కమల్ ఇలా స్పందించారు.
తర్వాత, రజినీ కాంత్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు.‘ రాష్ట్ర ప్రయోజనాల కోసం ,సంక్షేమం కోసం మేం (రజినికాంత్ , కమల్ హాసన్)కలసి పనిచేయాల్సి వస్తే తప్పకుండా దగ్గరవుతాం,’ అని రజినీ కాంత్ అన్నారు.
‘ విచిత్రాలు జరగుతూ ఉంటాయి. తాను ముఖ్యమంత్రి అవుతానని ఎడప్పాడి పళని స్వామి కూడావూహించి ఉండరు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ప్రభుత్వం రెన్నెళ్ల కంటే ఎక్కువ కాలం నిలవదని అంతా అనుకున్నారు. అయితే, ఆయన రెండేళ్లుగా కొనసాగుతున్నారు. అందుకే మిరకిల్స్ జరగుతూ ఉంటాయి. నిన్న అలాంటి విచిత్రాలు ఎదురయ్యాయి. ఈ రోజు జరిగాయి. రేపు కూడా జరుగుతాయి,’ అదివారం నాడు కమలహాసన్ ఆరవయ్యేళ్ల సినిమా జీవితం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూ రజినీ కాంత్ ముఖ్యమంత్రి ఎదురుగానే అన్నప్పటినుంచి ఈ తమిళ సూపర్ స్టార్లిద్దరు కలసిరాజకీయాల్లో కొస్తారేమో అని వూహాగానాలు వినబడుతున్నాయి.
కమల్ 18 నెలల కిందట పార్టీ ని ఏర్పాటుచేశారు. మొన్న లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. రజినీ కాంత్ కూడా రాజకీయాల్లో కి వస్తున్నానని చెబుతూ వస్తున్నారు. ఆయన అభిమాన సంఘాలను రాజకీయ వేదికలుగా మార్చేశారు.అయితే, ఇంకా పార్టీ పేరు ప్రకటించాల్సి ఉంది. ఇసుడు తమిళరాజకీయాలను వేడెక్కిస్తూ ఇద్దరు కలసి పని చేసేవీలుందని చెప్పారు.