(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి*)
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి 1953 అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. సరిగ్గా నేడు అంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే రూపంలో మనుగడలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో రాయలసీమ భవితవ్యం పై సీమ ప్రాంతంలోని అనేక ప్రజాసంఘాలు తమ వంతు ఉద్యమాలు చేసాయి. విభజన చట్టం నిర్మాణ సమయంలోను సీమ విషయంగా అనేక ప్రతిపాదనలను సీమవాసులు లేవనెత్తినప్పటికి వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కనీసం శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్ కమిటీల సిఫారసులను కూడా సీమ విషయంగా అమలుకాలేదు. ఆంధ్రరాష్ట్రం, విశాలాంధ్ర రాష్టం ఏర్పాటులో ఎంత వేగంగా, చాకచక్యంగా అడుగులు వేసారో, మొన్న రాష్ట్ర విభజన సమయంలోను అదే స్థాయిలో ఆయా ప్రాంతాల ప్రయోజనాల కోసం పాటుపడ్డారు. ఈ క్రమంలో నష్టపోయింది, నలిగిపోయింది రాయలసీమ ప్రాంతమే.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడే క్రమంలో రాయలసీమవాసులు తమ భావితరాల భవిష్యత్తు కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే కొనసాగాలా? ఆంధ్రరాష్ట్రంతో కలసి సాగాలా? అనే పరిస్థితి ఎదురైంది. 1926 లో అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నెలుకొల్పుతామని నిర్ణయించి చివరకు వాల్తేరులో(విశాఖపట్నం) లో ఏర్పాటు చేయడం సిమవాసులను కలచివేసింది. 1937 మద్రాసు శానసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజగోపాలాచారి ప్రధానమంత్రి అయ్యారు. సీమ ప్రాంతంలోని ఐదుజిల్లాలలో ఒక్కరికి కూడా ప్రభుత్వంలో మంత్రి పదవి లభించలేదు. సీమ నాయకులకు ఈ వ్యవహారంతో తమ మనుగడ కష్టమని మరోసారి అర్థమయింది. ఆంధ్రతో కలసి సాగటం సీమకు కష్టదాయకంగా భావించి ప్రత్యేక రాయలసీమ భవిష్యత్తు కోసం అడుగులు వేసారు. ఈ నేపథ్యంలో ఆంధ్రమహాసభ రజతోత్సవ మహాసభలు విజయవాడ కేంద్రంగా 1937 అక్టోబరు25,26 తేదిలలో జరిగాయి జరిగాయి. ఆంధ్రరాష్ట్రం సాధనే ఆశయంగా ఆంధ్రమహాసభ ఏర్పడింది. సీమ వాసుల మద్దతు లేనిదే ఆంధ్రరాష్ట్రం కల నెరవేరదు. సీమ నాయకులను ఈ సభలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సభలలో తమ అభ్యంతరాలు, అనుమానాలు తెలియచేసారు. వీటి ఫలితంగా సమస్యల పరిష్కారానికి రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకులతో ఒక కమిటీ ఏర్పరిచారు. ఈ కమిటీ 1937 నవంబరు 16 న మద్రాసు నగరంలో ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాథ నాగేశ్వరరావు స్వగృహమైన శ్రీభాగ్ లో సమావేశమై ఇరుప్రాంత నాయకులు కొన్ని తీర్మానాలు చేసారు. ఈ తీర్మానాలే శ్రీభాగ్ ఒప్పందంగా జన వ్యవహారంలో కొనసాగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుండి కొండ వెంకటప్పయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య నెల్లూరు నుండి లేబూరు సుబ్బరామిరెడ్డి, రాయలసీమ నుండి పప్పూరు రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు, కడప కోటిరెడ్డి, హాలహర్వి సీతారామిరెడ్డి సంతకాలు చేసారు. మిగిలిన సభ్యుల సంతకాలకోసం ఒప్పందపత్రాన్ని పంపారు. ఒప్పందంలో కింది అంశాలున్నాయి.
1. ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో కేంద్రాన్ని అనంతపురంలో నెలకొల్పడం.
2. కృష్ణా, తుంగభద్ర నదులలో జలాలను రాయలసీమ మరియు నెల్లూరు అవసరాలకు కేటాయించడం.
3. రాజధాని , హైకోర్టు లలో సీమవాసుల కోరికమేరకు ఒకటి నెలకొల్పడం.
4. జిల్లాలవారిగా సమాన నిష్పత్తిలో శాసనసభ నియోజకవర్గాలను ఏర్పాటుచేయడం.
ఈ రక్షణ ఒప్పందం అనంతరమే ఆంధ్రరాష్ట్రం సాధనకు పూర్తి స్థాయిలో సీమవాసులు మద్దతుగానిలిచి కార్యాచరణకు పూనుకున్నారు.
భాషాప్రయుక్త ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు తొందరలో సీమవాసులు బళ్ళారి, హోసూరు, కోలారు తదితర సమీప తెలుగు సరిహద్దు ప్రాంతాలను కోల్పోయారు. 1952 లో శంఖుస్థాపనకు సిద్దమైన సిద్దేశ్వరం ప్రాజక్టు కోల్పోయారు. సీమలో ఆరోజుకే తుంగభద్ర ఎగువకాలువ , దిగువకాలువ, కె.సి.కెనాల్ ఆయకట్టుల కింద దాదాపు వంద టి.యం.సి లతో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందేది. సిద్దేశ్వరం ప్రాజక్టు కూడా అమలై ఉంటే మరో మూడువందల టి.యం.సిలతో ముపైలక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సిద్దేశ్వరం నిర్మిస్తామని చెప్పి, నమ్మబలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్దేశ్వరం పక్కనపెట్టి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. కాసిన్ని నీళ్లు పోతిరెడ్డిపాడు వద్ద సీమ అవసరాలకు తీసుకొంటే పక్క ప్రాంతాలు లెక్కలు వేస్తుండడం ఇప్పుడు చూస్తున్నాం. వందల టి.యం.సీలు డెబ్బైయేళ్ళ నాడే పొగుట్టుకొన్న సీమవాసుల దుస్థితిని ఆలోచించేవారు కరువయ్యారు.
రాయలసీమలో కోటి ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంటే అందులో పందొమ్మిది శాతం భూమికి సాగునీటి వసతి కల్పించినట్లు రికార్డులు చూపుతున్నాయి. నిజానికి ఇందులో సగం భూములకు కూడా నీటి వసతిలేదు. తుంగభద్ర, కృష్ణా నదుల నుండి 120 టి.యం.సి ల నికరజలాలు కేటాయింపు చేస్తే ప్రతి సంవత్సరం అరభాగం నీళ్ళు కూడా అందుకోని దుస్థితి ఈ ప్రాంత వాసులది. నిరంతర కరువులతో గ్రామాలకు గ్రామాలే వలసలెల్లి పోతున్నాయి. వందల మంది సీమ రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. సీమలో కొన్ని చోట్ల మహిళలు గల్ఫ్, డిల్లీ, బొంబాయి వంటి దేశ విదేశాలలో మాన ప్రాణాలు అమ్ముకోని బతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. పదుల సంఖ్యలో ప్రభుత్వరంగ పరిశ్రమలను మూసి వేసారు. రాయలసీమలో ఖనిజవనరుల ఆధారంగా అనేక పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా పట్టించుకొన్న పాపానపోలేదు. ఈ విధంగా విధంగా అన్ని రంగాలలో రాయలసీమ జీవచ్ఛవంగా పెనుగులాడుతోంది.
విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైమ ఎయిమ్స్ ఆసుపత్రి అనంతపురంలో నెలకొల్పుతామని చివరకు మంగళగిరికి తరలించారు.కరువుపీడిత ప్రాంతమైన ఈ నేలలో నేటి అవసరాలకు అనుగుణంగా శ్రీ భాగ్ ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రం స్థానంలో అఖిల భారత వైద్యవిద్యా సంస్థ అనంతపురంలో ఉండడం సమంజసం.
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని విషయమై శివరామన్ కమిటీ నివేదికను కనీసం పరిగణలోకి తీసుకోకుండా , చర్చకు అవకాశంలేకుండా, ఏకపక్షంగా తొలి అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయించారు.
ఎక్కడైనా అధిక సంఖ్యాకులు మాటే చెల్లుబాటు అవుతుంది. ఇలాంటి పరిణామాలను ఊహించే సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం సందర్భంగా సమాన నిష్పత్తిలో శాసనసభ స్థానాలు కోరుకున్నారు. అది చివరకు జిల్లాల నిష్పత్తి గా మారిపోయింది.
పరస్పర నమ్మకం , విశ్వాసం ఆధారంగా రూపొందిన శ్రీ భాగ్ ఒప్పందానికి చట్టబద్దత లేదని తేలిగ్గా తీసివేస్తుంటారు. శ్రీ భాగ్ ఒప్పందానికి ప్రాధాన్యత లేకపోతే 1953 లో ఆంధ్రరాష్ట్రం రాజధానిగా కర్నూలును, హైకోర్టును గుంటూరులో ఎందుకు ఆ రోజులలో ఏర్పాటుచేసారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
భారత రాజ్యంగం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే మనిషి మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండటం. త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి తదితర అవసరాలు కల్పించడం పాలకుల బాధ్యత. దేశంలో భౌగోళికంగా అన్ని ప్రాంతాలు ఒకేరకంగా ఉండవు. కరువులు, తుఫానులు, సముద్రతీరాలు, కొండా ప్రాంతాలు ఇలా వైవిధ్యంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలలో తలెత్తే సమస్యలను పరిష్కరించి ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వాల కనీస నైతిక విధి. ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా ఎలాంటి సమస్యలను అయినా పరిష్కారం చేసుకోగల ఈ కాలంలో రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల పట్ల తరతరాలుగా వివక్ష సాగడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఒక భాగం కాబట్టి ఈ ప్రాంత కనీస జీవన అవసరాలను తీర్చవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యయుతమైన, సమంజసమైన సీమప్రాంత వాసుల ఆకాంక్షలు నేరవేర్చని పక్షంలో రాబోవు రోజులలో ఎంత దూరమయినా వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం ఫలితమే తెలుగువారి చీలికకు ఇప్పటికే కారణమయింది. కనీసం ఉన్న తెలుగు ప్రాంతమైనా కలసి సాగేందుకు చారిత్రాత్మక శ్రీ భాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకొని సీమకు అండగా నిలవాలి. శ్రీ బాగ్ స్ఫూర్తితో పాలనలో, అభివృద్ధి లో సీమకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి.
1.రాయలసీమలో రాజధాని (లేదా) హైకోర్టు, రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలి.
2. సీమలోని ప్రతి జిల్లాకు కనీసం వంద టి.యం.సిల నికరజలాలు కేటాయించాలి. కృష్ణానది జలాల పంపకంపై విచారణ చేస్తున్న బ్రజేష్ కమిటిని కరువుపీడిత ప్రాంతాలకు జలాలను పంపకంలో ప్రాధాన్యత ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సీమలోని సాంప్రదాయ సాగునీటి వనరుల సంరక్షణకు, నదులను సజీవం చేయడానికి చర్యలు తీసుకోవాలి.
3. అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా సీమ వాసులకు వారి జనాభా, భూభాగం బట్టి అన్ని అంశాలలో వారి నిష్పత్తి కి తగిన విధంగా కేటాయింపులు జరగాలి . మౌళికవసతులు కల్పించి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలి. ఈ ప్రాంత సహజవనరులు, ఖనిజవనరుల ఆధారంగా ఉత్పాదక పరిశ్రమలు నెలకొల్పాలి.
4. రాయలసీమ ప్రాంత అభివృద్ధి బోర్డును స్వయంప్రతిపత్తి సంస్థ గా నెలకొల్పాలి.
5. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ సమగ్రంగా అమలుచేయాలి.
6. విభజన చట్టంలో 13 వ షెడ్యూల్డ్ లో పేర్కొన్న కీలక సంస్థలలు అయిన ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉక్కుకర్మాగారం తదితరాలను సీమలో నెలకొల్పాలి.
7. రాజధాని పరిధిలోని వివిధ ఉద్యోగాలు, అవకాశాల కోసం ఫ్రీజోన్ గా ప్రకటించి సీమవాసుల వాటా ఉద్యోగాలు కేటాయించాలి.
8. రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో పరిశ్రమలకోసం కేటాయింపు చేసిన భూములలో పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోవాలి.
9. రాయలసీమ ప్రాంత సాంస్కృతిక సంస్థను నెలకొల్పి ఈ ప్రాంత భాష, సాహిత్యం, జానపద కళలు, చరిత్ర, పురావస్తు కట్టడాలను సంరక్షించాలి.
1937 నవంబర్ 16 న శ్రీబాగ్ వప్పంద మీద ఆంధ్రపత్రికలో వచ్చిన వార్త
(*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి.కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, అనంతపురము జిల్లా, Cell: 99639 17187)