ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాబోధన ఏ మీడియంలో జరగాలన్న అంశంపై వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నానాటికీ వేడెక్కుతున్నది. ప్రస్తుత కాల పరిస్థితికి ప్రపంచంలో నెలకొన్న పోటీ ని దీటుగా ఎదుర్కోవడానికి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించగా, ప్రతిపక్షాలు , భాషాభిమానులు, మీడియా వ్యతిరేకిస్తున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం విద్యావ్యవస్థలో ఉన్న స్థితిగతులను ఒకసారి గమనించాలి.
రాష్ట్రంలో మొత్తం 61,696 పాఠశాలలుండగా అందులో 44,412 పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనూ, 14,436పాఠశాలలు ప్రయివేటు రంగంలో ప్రస్తుతం పనిచేస్తున్నాయి. కిండర్ గార్డెన్, కేజీలు, ఒకటవ తరగతి నుండి మొత్తం 70 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళుతుండగా ఇందులో 55 శాతం మంది (సుమారు 39 లక్షలు) ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. 17 లక్షలమంది (43శాతం) ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారు. అంటే 75 శాతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 55 శాతం మంది చదువుతుండగా 25 శాతం ఉన్న ప్రయివేటు పాఠశాలల్లో 43 శాతం మంది చదువు ‘కొంటున్నారు’.
ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ రంగంలో ఉన్న 44,412 పాఠశాలలు నడపడానికి లక్షా 85 వేలమంది సిబ్బందిని వినియోగిస్తూ ప్రతి సంవత్సరం సుమారు 32వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే ఉండటం గమనార్హం. ఇంత చేసి కేవలం 39 లక్షల మందికి మాత్రమే అరకొర చదువులు చెపుతున్నారు. ప్రస్తుతం (అప్పటి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మేరకు) సుమారు 32 శాతం పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో భోదన సాగుతున్నది.
ప్రయివేటు పాఠశాలలు
ఇక ప్రయివేటు పాఠశాలల విషయానికి వస్తే ఇక్కడ అధికారిక లెక్కల మేరకు సుమారు లక్ష మంది (అనధికారిక లెక్కల మేరకు మరో లక్ష మంది) పనిచేస్తున్నారు. ఈ పాఠశాలల్లో 98. 2 శాతం మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కుంటున్నారు. ఇందులో స్తొమత ఉన్న వెనుకపడిన వర్గాలకు చెందిన పిల్లలు సుమారు 20 శాతానికి పైగా ఉన్నారు. ఇందులో కేవలం 1100 పాఠశాలలే ఈ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇవన్నీ 1000 మంది కంటే ఎక్కవ మంది విద్యార్థులున్నవే కావడం విశేషం. 2300 పాఠశాలల్లో 500 నుండి 1000 మంది వరకు విద్యార్థులుంటే మరో నాలుగువేల పాఠశాలల్లో 100 నుండి 500 వరకు మాత్రమే పిల్లలున్నారు. 100 మంది కంటే తక్కువగా పిల్లలున్న పాఠశాలలు ఐదువేలకు పైగా ఉన్నాయి. అంటే 55 శాతం ప్రవేటు స్కూళ్లలో 80 శాతం మందికి ఇంగ్లీష్ విద్యాబోధన సాగుతున్నది.
భోదన మాధ్యమం మార్చిన ప్రయివేట్ మాత్రమే ముద్దు… ప్రభుత్వ పాఠశాలలే వద్దు.. ఎందుకు?
స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత ప్రయివేట్ రంగంలో ఏర్పాటు చేసిన అన్ని పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యా భోదన సాగుతున్నది. ప్రస్తుతం దాదాపు 98 శాతం ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లీషులోనే భోదన సాగిస్తున్నారు. తెలుగును ఒక సబ్జెక్టు గా ఉంచారు. ఇంకా కొంతమంది అధికంగా మార్కులు పొందినట్లు చూపడానికి తెలుగు సబ్జెక్టును తొలగించి సంస్కృతం ఒక సబ్జెక్టుగా చేర్చారు. మరి తెలుగు భాషాభిమానులు, భాషను ఉద్దరించాలని అంగలారుస్తున్న మేధావులు ఈ ప్రయివేట్ స్కూళ్ల అరాచకాలను ఎందుకు పట్టించుకోలేదో? తెలియదు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాల్లో భోదన చేస్తే భాషకు జరిగే నష్టం ఎంత? విద్యార్థులకు జరిగే మేలెంత? అనే అంశాన్ని అంచనా వేయలేక పోవడం శోచనీయం.
ప్రస్తుతం ప్రపంచం కుగ్రామంగా మారిన సామాజిక పరిస్థితుల్లో ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని, “కాన్వెంట్ అనే పేరుంటే” చాలు అక్కడికి పరుగులు పెడుతున్నారు. పిల్లలను చేరుస్తున్నారు. నిరుపేదలు శక్తికి మించి పిల్లల భవిష్యత్తు కోసం తమ చుట్టు పక్కల ఉన్న కాన్వెంట్ బోర్డులు వెతుకుతుంటే స్తొమత కలిగియున్న వ్యక్తులు పేరున్న సంస్థల కోసం పరుగులు పెడుతూ లక్షలాది రూపాయలను అడ్మీషన్ ఫీజుగా చెల్లిస్తూ , ప్రతి సంవత్సరం మరి కొన్ని లక్షలను ధారపోస్తున్నారు.
ఇకపోతే ఇంగ్లీష్ లో భోదన సాగించడమే ప్రవేట్ పాఠశాలల బలంగా ఉంది. అదే బలాన్ని ప్రభుత్వ పాఠశాలలకు కలిగించి సమాజంలో ఆర్థిక స్తోమత లేక కాన్వెంట్ చదువులు కొనలేక నిరాశతో క్రుంగుతున్న వెనుకపడిన వర్గాలకు ఊరట కలిగిస్తూ వారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వం చదువులు చెప్పిస్తే తప్పేమిటో? ప్రభుత్వ ప్రకటనపై చిందులు తొక్కుతున్న పెద్దలు సెలవివ్వాలి.
విమర్శే ప్రధానమా?
ప్రభుత్వం ఏమి చేసినా విమర్శించడమే ధ్యేయమైతే చేయగలిగింది లేదు. ప్రభుత్వ పనులను సహేతుకంగా విమర్శించి ఆచరణాత్మకమైన సూచనలు చేయడం భాద్యత కల ప్రతిపక్షం, మీడియా చేయవలసిన పని. రెండు విభాగాలు కూడా విచక్షణ ను మరచిపోయాయేమోనని అనుమానించక తప్పదు. “చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విమర్శించారు కాబట్టి మేము విమర్శిస్తాం అనడం కంటే మేము చూపిన మార్గంలోకి జగన్ కూడా వచ్చాడని టీడీపీ జబ్బలు చరుచుకోకుండా పనిలేని పని ఎందుకు చేస్తున్నారో? వారికే తెలియాలి”.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా జగన్ రెండు లక్ష్యాలను ఎంచుకున్నట్లు కనిపిస్తున్నది. నిరుపేద కుటుంబాలతో పాటు మధ్యతరగతి పిల్లలకు వారు కోరిన విధంగా చదువు చెప్పించడం, చదువుల పేరుతొ పిల్లలకు తలితండ్రులకు పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడంతో పాటు వారిరువురు ప్రేమ పంచుకునే అవకాశం కల్పించడం మొదటిది కాగా విద్యారంగాన్ని వ్యాపారరంగంగా మార్చిన కార్పరేట్లను వీలైనంతగా దెబ్బ కొట్టడం.
ముఖ్యమంత్రి, విద్యాశాఖ చిత్తశుద్ధితో కృషి చేసి ఆచరణలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తే అందరి కల నెరవేరుతుంది. ప్రకటన చేయడానికి ఉన్న పట్టుదల అమలు చేయడంలో లేకపోతె ఇది కూడా మరో ప్రభుత్వ పధకంగానే కాగితాలలో మిగిలి పోతుంది.